ఆరని మంటలు
►ఆరు బయో డీజిల్ ట్యాంకులు పూర్తిగా దగ్ధం
►మరో 24 గంటల వరకు మంటలు అదుపు చేయడం కష్టమే
►పదో నంబర్ ట్యాంక్ నుంచి ఆయిల్ లీకేజీ
►సంఘటన స్థలంలోనే అధికారులతో కలెక్టర్ సమీక్ష
►మరో మూడు ట్యాంకులకు పాక్షిక నష్టం
►మిథనాల్ , హైస్పీడ్ డీజిల్ ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా చర్యలు
అగ్నిమాపక దళాల నిర్విరామ శ్రమ.. ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ ఫలించలేదు. 24 గంటలు గడిచినా బయో డీజిల్ మంటలు రావణ కాష్టంలా రగులుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది మిగిలిన ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా అడ్డుకోగలుగుతున్నారే తప్ప పూర్తిగా ఆర్పలేకపోతున్నారు. గగనతలం నుంచి మంటలను ఆర్పే అంశాన్ని నేవీ అధికారులు పరిశీలించినా.. దానిపైనా ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయారు. మరోవైపు డీజిల్ పొగల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
అగనంపూడి(విశాఖపట్నం): దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లోని బయో మాక్స్ ప్లాంట్‌లో రేగిన మంటలు బుధవారం రాత్రికి కూడా అదుపులోకి రాలేదు. ప్రమాదస్థాయిని అంచనా వేయడం కష్టంగా మారడంతో అధికారులు, యాజమాన్య ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. మంగళవారం రాత్రి సంభవించిన ప్రమాదంలో ఇప్పటికే ఆరు ట్యాంకులు పూర్తిగా మంటలకు ఆహుతి కాగా, మరో మూడు పాక్షికంగా దగ్ధమయ్యాయి. బయో డీజిల్ ట్యాంకులను ఆనుకొని ఉన్న 10, 11, 12 ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది ఫోమ్ చల్లి చల్చబరుస్తున్నారు. అలాగే కార్యాలయ సముదాయాన్ని అనుకొని ఉన్న నాలుగు మిథనాల్ ట్యాంకర్లు, రెండు హైస్పీడ్ డీజిల్ ట్యాంకులకు వేడి ప్రభావం లేకుండా బ్రాండిక్స్‌కు చెందిన ఫోమ్ స్ప్రెడ్డింగ్ మిషన్‌తో ఫోమ్‌ను చల్లుతూ వేడి ప్రభావం లేకుండా చర్యలు తీసుకున్నారు. కాగా ఈ ప్రమాదంలో ప్రాధమిక అంచనా మేరకు రూ.120 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు బయోమ్యాక్స్ సంస్థ ఏజీఎం శ్రీనివాసరావు తెలిపారు.
హెలికాప్టర్‌తో పర్యవేక్షణ: మంటలు అదుపులోకి రాకపోవడంతో నేవీ అధికారుల సాయంతో హెలికాప్టర్‌లో పర్యవేక్షించారు. గగనతలం ద్వారా నేవల్ హెలికాప్టర్ నుంచి మంటలను అదుపు చేయడానికి ఏ మేరకు అవకాశం ఉందో పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఉదయం పదకుండున్నర గంటలకు ఆ ప్రక్రియ చేపట్టారు. ట్యాంకుల్లోని ఆయిల్ పూర్తిగా ఆవిరయ్యే వరకు మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి కనపడకపోవడంతో చేసేది లేక హెలికాప్టర్ వెనుదిరిగింది. ఇతర ట్యాంకులకు మంటలు అంటుకోకుండా చర్యలు చేపట్టడం తప్ప ప్రత్యామ్నాయం కనపడకపోవడంతో సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు.
లీకే జీలను అరికట్టాలి బయోమ్యాక్ ఆవరణలోని 10వ ట్యాంక్ నుంచి ఆయిల్ లీక్ అవుతుండడంతో మంటలు వాటికి కూడా అంటుకొనే ప్రమాదం ఉందని అధికారులు గుర్తించి నివారణ చర్యలు చేపట్టారు. లీకేజీని అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో వెంటనే తెలపాలని, తగిన సహాయం అందిస్తామని జిల్లా కలెక్టర్ యాజమాన్య ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఫోమ్ చల్లడం తప్ప వేరే మార్గం కనిపించకపోవడంతో ఆ ప్రక్రియ కొనసాగించాలని జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహనరావు, నేవల్ ఇన్‌చార్జి సుజిత్‌రెడ్డిలను కలెక్టర్ ఆదేశించారు.
ఫైర్ సిబ్బంది నిర్విరామశ్రమ వివిధ విభాగాలకు చెందిన అధికారులతోపాటు ఫైర్ సిబ్బంది నిర్విరామంగాశ్రమించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. బయో డీజిల్ మంటల వల్ల వెలువడుతున్న పొగ వల్ల ఏర్పడే కాలుష్యాన్ని అంచనా వేయడానికి కాలుష్య నియంత్రణ పరికరాన్ని తీసుకువచ్చిన ఆ శాఖ అధికారులను బయోమ్యాక్స్ యాజమాన్య ప్రతినిధులు పట్టించుకోపోవడంపై అధికారులు మండిపట్టారు. ఉదయం నుంచి తాళాలు లేవని, కరెంటు లేదని చెబుతూ తమను పనిచేయకుండా అడ్డుకున్నారని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ సైంటిస్ట్ సోమసుందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంఘటన స్థలం వద్ద్ద కలెక్టర్, నేవల్ అధికారులు, డీఎఫ్‌వో
ప్రమాదం జరిగిన వెంటనే మంగళవారం రాత్రి సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ యువరాజ్ అప్పటి నుంచి అక్కడే ఉండి నేవల్ ఇన్‌చార్జిఅధికారి సుజిత్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహనరావు, సంస్థ అధికారులతో చర్చించారు. పరిస్థితిని సమీక్షించారు. మంటలు ఎప్పటికి అందుబాటులోకి వస్తాయి. ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు.