దేశంలోనే తొలి ప్రయోగాత్మక ప్లాంట్ సింగరేణిలో ఏర్పాటు
రోజుకు 500 కేజీల సీఓ2 నుంచి 180 కేజీల మిథనాల్ ఉత్పత్తి
కోల్ ఇండియా, ప్రైవేట్ సంస్థలతో కలిసి సింగరేణి ఏర్పాటు
డిసెంబర్ 31 నాటికి పూర్తి : సింగరేణి సీఎండీ శ్రీ ఎన్.బలరామ్
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్ లోని 1,200 మెగావాట్ల సింగరేణి విద్యుత్ కేంద్రంలో వెలువడే కార్బన్‌డయాక్సైడ్ (సీఓ2) వాయువు నుంచి మిథనాల్ ఉత్పత్తికి సింగరేణి బొగ్గు గనుల సంస్థ శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మక ప్లాంట్‌ను రూ.20 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తోంది. థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రక్రియలో భాగంగా బొగ్గును మండించడంతో పెద్ద మొత్తంలో కార్బన్‌డయాక్సైడ్ విడుదలవుతుంది.
రోజుకు 500 కేజీల కార్బన్ డయాక్సైడ్ సేకరించి, హైడ్రోజన్‌తో రసాయన చర్యకు గురిచేయడం ద్వారా మిథనాల్ ద్రావణాన్ని ఉత్పత్తి చేస్తారు. విద్యుత్ కేంద్రం చిమ్నీకి అనుసంధానం చేసి మిథనాల్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 31 నాటికి ఇది పూర్తవుతుందని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు.
సింగరేణి విద్యుత్ కేంద్రంలో వెలువడే కర్బన ఉద్గారాలను 99.9 శాతం వరకు వాతా వరణంలో కలవకుండా నివారించేందుకు ఎలక్ట్రో స్టాటిక్ ప్రెసిపి టేటర్స్ (ఈఎస్‌పీ)ను ఏర్పాటు చేశామని ఓ ప్రకటనలో చెప్పారు. దీంతో అనుమతించిన పరిమితులకు లోబడే కర్బన ఉద్గారాలను విద్యుత్ కేంద్రం విడుదల చేస్తుండగా, వాటినీ రీసైకిల్ చేసి మిథనాల్‌ను తయారు చేయనున్నట్లు వివరించారు.
విజయవంతమైతే భారీ ప్లాంట్
మిథనాల్ ప్లాంట్‌కి సంబంధించిన సివిల్ పనులు పూర్తి కాగా..కార్బన్‌డయాక్సైడ్‌ను సంగ్రహించే యూనిట్, హైడ్రోజన్ జనరేటర్, కంప్రెషర్, మిథనాల్ డిస్టిలేషన్ యూనిట్లను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కోల్ ఇండియా అనుబంధ పరిశోధన సంస్థ ‘సీఎంపీడీఐఎల్’ ఆర్థిక సహకారంతో ఇథనాల్ ప్లాంట్‌ను చేపట్టారు.
నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను బెంగళూరుకు చెందిన జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్, బ్రెత్ అప్లైడ్ సైన్సెస్ సంస్థలకు అప్పగించారు. ప్లాంట్ రోజుకి 180 కేజీల మిథనాల్‌ను ఉత్పత్తి చేయనుండగా, సింగరేణి సంస్థ విక్రయించడం లేదు. ప్రయోగాత్మక ప్లాంట్ విజయవంతమైతే వ్యాపార విస్తరణలో భాగంగా భారీ మిథనాల్ ఉత్పత్తి ప్లాంట్‌ను నిర్మించి వాణిజ్య విక్రయాలు జరపాలని సంస్థ భావిస్తోంది.
మిథనాల్‌ను ఎరువులు, అక్రిలిక్ ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్ వస్త్రాలు, ప్లైవుడ్, పెయింట్స్ తయారీలో వినియోగిస్తారు. దేశంలో 120 మిలియన్ టన్నుల మిథనాల్‌ను వినియోగిస్తుండగా, 80 మిలియన్ టన్నులు ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment