సమావేశంలో పాల్గొన్న భెల్ రామచంద్రాపురం యూనిట్ అధికారులు
సాక్షి, హైదరాబాద్/రామచంద్రాపురం (పటాన్‌చెరు): బొగ్గు నుంచి మిథనాల్‌ను ఉత్పత్తి చేసేందుకు దేశంలో తొలిసారిగా అభివృద్ధి చేసిన కోల్ టు మిథనాల్ (సీటీఎం) ప్లాంట్‌ను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే శనివారం జాతికి అంకితం చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రోజుకు 0.25 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను బీహెచ్‌ఈఎల్ అభివృద్ధి చేసింది. ఎక్కువ బూడిద ఉండే భారతీయ బొగ్గు నుంచి 99 శాతం స్వచ్ఛతతో మిథనాల్‌ను ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు.
గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా ఎక్కువ బూడిద కలిగి ఉండే భారతీయ బొగ్గును మిథనాల్‌గా మార్చే పరిజ్ఞానం అందుబాటులోకి రావడం దేశంలో ఇదే తొలిసారి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌లో ఆత్మనిర్భర్ భారత్ కింద అభివృద్ధి చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. స్వదేశీ ఉత్పాదక రంగాన్ని నిర్మించడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా తయారీ రంగం ప్రాముఖ్యతను ప్రభుత్వం ప్రజలందరికీ తెలియజేసిందన్నారు. పరిశోధన, అభివృద్ధికి బీహెచ్‌ఈఎల్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని సంస్థ సీఎండీ నలిన్ సింఘాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment