కళాభవన్ మణి (ఫైల్)
కొచ్చి: విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతిపై మిస్టరీ కొనసాగుతోంది. తాజాగా ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిన అంశాలతో ఆయన మృతిపై అనుమానాలు బలపడుతున్నాయి. ఆయన దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్(మిథనాల్) అవశేషాలు కనుగొన్నట్టు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ కు చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(సీఎఫ్ఎస్ఎల్) నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెలుగు చూసింది.
అయితే కళాభవన్ మణి శరీరంలో ఎంత శాతం మిథనాల్ ఉంది, అది ఎంతవరకు ఆయన మరణానికి కారణం అయిందనేది వెల్లడి కాలేదు. పురుగు మందుల అవశేషాలు లేవని తేల్చింది. ఫోరెన్సిక్ నివేదికపై స్పష్టత కోసం సీఎఫ్ఎస్ఎల్ ను కేరళ పోలీసులు సంప్రదించనున్నారు.
మణి శరీరంలో ప్రమాదకరమైన క్రిమిసంహారిణి 'క్లోర్ పిరిఫొస్' అవశేషాలు ఉన్నట్టు కొచ్చిలోని కక్కనాడ్ ప్రాంతీయ రసాయన పరీక్షా కేంద్రం అంతకుముందు వెల్లడించింది. మలయాళంతో పాటు ఇతర భాషాల్లో 200 సినిమాల్లో నటించిన కళాభవన్ మణి ఈ ఏడాది మార్చి 6న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.