అబుజా : నైజీరియా ( Nigeria)లో ఘోర ప్రమాదం సంభవించింది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు ప్రకటించారు.
నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఈఎంఏ) అధికారిక ప్రకటన మేరకు.. శనివారం నార్త్ సెంట్రల్ నైజీరియా నైజర్ రాష్ట్రం (Niger state)లో అక్రమంగా ఇంధనాన్ని తరలించే సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు ఎన్‌ఈఎంఏ అధికారులు నిర్ధారించారు.
అగంతకులు జనరేటర్ సాయంతో ఒక పెట్రోల్ ట్యాంకర్ (petrol tanker explosion) నుంచి మరో పెట్రల్ ట్యాంకర్‌లోకి పెట్రోల్‌ను నింపి ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో ఒక్కసారి జనరేటర్ పేలడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. పేలుడు ధాటికి మంటలు చెలరేగి భారీ శబ్దాలు రావడం.. స్థానికుల ఆర్తనాదాలతో భయంకరంగా పరిస్థితి మారిపోయింది. అక్కడికక్కడే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా కాలిన గాయాలతో మరికొందరు విలవిల్లాడారు.
పేలుడు ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సహాయ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాద బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. అయితే, భారీ స్థాయిలో ఎగిసి పడిన మంటల కారణంగా బాధితుల్ని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న పలువురు రెస్క్యూ సిబ్బంది సైతం అగ్నికి ఆహుతైనట్లు ఎన్‌ఈఎంఏ అధికార ప్రతినిధి హుస్సేన్ ఇసా తెలిపారు.
ప్రమాదాలు సర్వసాధారణం
నైజీరియాలో ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. నైజీరియాలో అస్థవ్యస్థంగా ఉన్న రైల్వే వ్యవస్థ కారణంగా ఎక్కువ శాతం మంది ప్రజలు రోడ్డు రవాణాను వినియోగించుకుంటున్నారు. పలుమార్లు అక్రమ ఇంధన రవాణా కారణంగా తరుచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
గతేడాది ఇదే రాష్ట్రంలో
గతేడాది సెప్టెంబరులో ఇదే తరహా దుర్ఘటన జరిగింది. నైజర్ రాష్ట్రంలో పశువులను తరలిస్తున్న ట్రక్కును పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 48 మందికి పైగా మరణించారు.
నైజీరియా ఫెడరల్ రోడ్ సేఫ్టీ గణాంకాల ప్రకారం.. 2020లోనే 1,531 పెట్రోల్ ట్యాంకర్లు పేలాయి. ఫలితంగా 535 మరణించగా, 1,100 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఇలాంటి ఘటనల వల్ల ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా నిబంధనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు. అయినప్పటికీ పలువురు అక్రమంగా ఇంధనాన్ని తరలిస్తూ ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment