చౌక 5జీ ఫోన్ల మోత! | Qualcomm, MediaTek chipsets heat up market for affordable 5G phones | Sakshi
Sakshi News home page

చౌక 5జీ ఫోన్ల మోత!

Published Sat, Jul 13 2024 4:18 AM | Last Updated on Sat, Jul 13 2024 4:18 AM

Qualcomm, MediaTek chipsets heat up market for affordable 5G phones

రూ.10,000 లోపు హ్యాండ్‌సెట్లపై కంపెనీల దృష్టి

ఈ పండుగ సీజన్‌లోనే వెల్లువలా మార్కెట్లోకి...

5జీ చిప్‌సెట్‌ రేట్లు దిగిరావడంతో ఫోన్ల ధరలు తగ్గుముఖం

చైనా చిప్‌సెట్‌ బ్రాండ్‌ యూనిసాక్‌ బాటలో క్వాల్‌కామ్, మీడియాటెక్‌

5జీ ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా? పండుగ సీజన్‌ వరకు కాస్త ఓపిక పట్టండి! ఎందుకంటారా? భారీగా ఆదా చేసే చాన్స్‌ రాబోతోంది. రాబోయే పండుగల్లో చౌక 5జీ ఫోన్లు మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. ప్రధానంగా హ్యాండ్‌సెట్ల తయారీలో కీలకమైన 5జీ చిప్‌సెట్లను చిప్‌ తయారీ బ్రాండ్‌లు తక్కువ ధరల్లో విడుదల చేస్తుండటంతో ఫోన్‌ రేట్లు దిగొచ్చేందుకు వీలవుతోంది. దీంతో ఈ ఏడాది చివరికల్లా దేశంలో 5జీ హ్యాండ్‌సెట్ల మార్కెట్‌ భారీగా ఎగబాకుతుందనేది పరిశ్రమ వర్గాల అంచనా.

మనం ఇప్పటికే 5జీ యుగంలోకి అడగుపెట్టేశాం. ఒకపక్క టెలికం కంపెనీలు 5జీ నెట్‌వర్క్‌ విస్తరణకు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. మరోపక్క మొబైల్‌ ఫోన్‌ తయారీ సంస్థలు కూడా 5జీ హ్యాండ్‌సెట్లను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. దీంతో ఫోన్‌ కొనుగోలుదారులకు ఇక ‘పండుగే’! ప్రస్తుతం దేశంలో 5జీ స్మార్ట్‌ ఫోన్ల ధర రూ. 11,000–13,000 మధ్య ప్రారంభమవుతోంది. కొన్ని ఫోన్‌ బ్రాండ్‌లు అప్పుడప్పుడు ప్రమోషనల్‌ ఆఫర్లను అందిస్తుండటంతో ధర కొంచెం తగ్గుతోంది. అయితే, చిప్‌ తయారీ సంస్థలు చౌక 5జీ చిప్‌సెట్‌లను అందుబాటులోకి తెస్తుండటంతో ఫోన్‌ రేట్లు భారీగా దిగిరానున్నాయి. 

చిప్‌.. చిప్‌.. హుర్రే! 
తాజాగా భారత్‌ కోసం చైనా చిప్‌సెట్‌ బ్రాండ్‌ యూనిసాక్‌ ‘టీ760’ చిప్‌సెట్‌ను విడుదల చేసింది. ప్రధాన మొబైల్‌ ఫోన్‌ తయారీ సంస్థలు అందుబాటు ధరల్లో 5జీ ఫోన్ల విడుదలకు చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించింది. దీంతో రూ. 10,000 లోపు ధరల్లో 5జీ ఫోన్లకు మార్గం సుగమం కానుంది. యూనిసాక్‌ బాటలోనే మొబైల్‌ చిప్‌సెట్లలో దిగ్గజ బ్రాండ్‌లైన క్వాల్‌కామ్, మీడియాటెక్‌ కూడా చౌక 5జీ చిప్‌సెట్లను అందించనున్నాయి. ‘అతి త్వరలోనే’ బడ్జెట్, ఎంట్రీలెవెల్‌ 5జీ హ్యాండ్‌సెట్ల కోసం చిప్‌సెట్లను తీసుకొస్తామని క్వాల్‌కామ్‌ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.

 మీడియాటెక్‌ ‘డైమెన్సిటీ 6000 సిరీస్‌’ ఎంట్రీలెవెల్‌ చిప్‌సెట్‌ చౌకగా స్మార్ట్‌ ఫోన్లను అందించేందుకు వీలుకల్పిస్తుందని ఆ కంపెనీ డిప్యూటీ డైరెక్టర్‌ అనూజ్‌ సిద్ధార్థ్‌ చెప్పా రు. ‘2జీ, 4జీ విభాగాల్లో యూనిసాక్‌ చిప్‌సెట్ల వాటా పటిష్టంగా ఉంది. టీ760తో భారత్‌లో అందరికీ చౌక 5జీ ఫోన్లను అందించడమే మా లక్ష్యం. దీనికోసం కీలక ఫోన్‌ తయారీదారులతో జట్టు కడుతున్నాం. టీ760 చిప్‌సెట్‌ మెరుగైన పనితీరుతో భారత్‌ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తాం’ అని యూనిసాక్‌ కంపెనీ పేర్కొంది. 
 

ఇక 5జీ మార్కెట్‌ జోరు... 
చిప్‌సెట్ల రేట్లు దిగిరావడం, చౌక ఫోన్ల లభ్యతతో ఈ ఏడాది చివరికల్లా 5జీ ఫోన్ల మార్కెట్‌ వాటా రెండంకెల స్థాయికి చేరుకోవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘రూ. 10,000 విభాగంలో 5జీ ఫోన్ల వాటా ఈ ఏడాది మే నాటికి కేవలం 1.4 శాతం మాత్రమే ఉంది. చౌక చిప్‌సెట్ల ప్రభావంతో డిసెంబర్‌ నాటికి ఈ వాటా 10 శాతానికి చేరుకోనుంది’ అని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ పేర్కొన్నారు. 

ట్రాన్సియన్‌ హోల్డింగ్స్‌ (టెక్నో, ఇన్ఫినిక్స్, ఐటెల్‌ తదితర మొబైల్‌ బ్రాండ్స్‌), హెచ్‌ఎండీ గ్లోబల్‌ (నోకియా బ్రాండ్‌), రియల్‌మీ, రెడ్‌మీ వంటి కంపెనీలు దసరా, దీపావళి పండుగ సీజన్‌లో చౌక 5జీ హ్యాండ్‌సెట్లను ప్రవేశపెట్టే సన్నాహాల్లో ఉన్నాయి. ‘ట్రాన్సియన్‌ వంటి కీలక తయారీదారు భారీ ప్రణాళికల్లో ఉండటంతో రూ.10,000 లోపు 5జీ హ్యాండ్‌సెట్ల మార్కెట్‌ దూసుకుపోనుంది. 5జీ ఫోన్ల విడుదలకు సంబంధించి మార్కెట్‌ను అధ్యయనం చేస్తున్నాం’ అని ట్రాన్సియన్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అరిజీత్‌ తలపాత్ర పేర్కొన్నారు.

ఈ ఏడాది మే నాటికి రూ.10,000 లోపు 5జీ హ్యాండ్‌సెట్ల అమ్మకాల వాటా: 1.4% 

డిసెంబర్‌ కల్లా దేశీ ఫోన్ల మార్కెట్‌లో 5జీ మొబైల్స్‌ సేల్స్‌ పరిమాణం (కౌంటర్‌ పాయింట్‌ అంచనా): 10% 
ఎంట్రీలెవెల్‌ 5జీ సెగ్మెంట్లో టాప్‌ కంపెనీలు: ట్రాన్సియన్, హెచ్‌ఎండీ గ్లోబల్, రియల్‌మీ, రెడ్‌మీ    

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement