విలేజ్ మాల్స్ ప్రతిపాదనను పక్కన పెట్టిన ప్రభుత్వం
దసరా నుంచి 18 వస్తువులను చౌకగా అందిస్తామని హామీ
కొత్త సంవత్సరం వస్తున్నా పట్టించుకోని పౌరసరఫరాల శాఖ
సాక్షి, హైదరాబాద్: విలేజ్ మాల్స్ ద్వారా చౌక ధరలకు సరుకులు అందుతాయనుకుంటున్న ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. దసరా నుంచి విలేజ్ మాల్స్ ద్వారా 18 రకాల సరుకులను చౌక ధరలకే అందిస్తామని ప్రకటించిన పౌరసరఫరాల శాఖ.. ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోలేదు. కొత్త సంవత్సరం వస్తున్నా దాని గురించి ఆలోచించడంలేదు. ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పక్కన పెట్టేసిందని, ఇక విలేజ్ మాల్స్ కథ కంచికి చేరినట్లేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దసరా నుంచి రాష్ట్రవ్యాప్తంగా 46 వేల గ్రామాల్లో విలేజ్ మాల్స్ ఏర్పాటు చేసి 18 రకాల వస్తువులను సరసమైన ధరలకు అందిస్తామని పౌరసరఫరాల కార్పొరేషన్ గత ఏప్రిల్‌లో ప్రకటించింది.
ఉత్పత్తిదారుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసిన వస్తువులను చౌక ధరల దుకాణాల ద్వారా తక్కువ ధరతో ప్రజలకు అందించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రజలు నిత్యం వినియోగించే కాఫీ పొడి, టీ పొడి, సబ్బులు, టాల్కం పౌడర్, డిటర్జెంట్లు, టూత్‌పేస్టులు తదితర 18 రకాల వస్తువులను విక్రయించాలని నిర్ణయించారు. తర్వాత మరిన్ని వస్తువులను ఇందులో చేర్చాలని యోచించారు. తక్కువ ధరకు సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన సంస్థలకు చెందిన వస్తువులను చౌక ధరల దుకాణాల డీలర్ల ద్వారా అమ్మించాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. ‘‘46 వేల చౌక దుకాణాల్లో సరుకులు అమ్మితే తయారీ సంస్థలకు కూడా మేలు జరుగుతుంది. ఉత్పత్తి సంస్థలు రాష్ట్ర స్థాయి అధీకృత డీలర్లకు ఇచ్చే ధరలకే వస్తువులను చౌక ధరల దుకాణాలకు సరఫరా చేస్తారు. దీంతో చౌక దుకాణాలను విలేజ్ మాల్స్‌లా మార్చి తక్కువ ధరకు గ్రామీణ ప్రజలకు సరుకులు అందించవవచ్చు. దీని వల్ల ప్రజలకు మేలు జరగడమేకాకుండా చౌక దుకాణాల డీలర్ల ఆదాయం కూడా కొంత పెరుగుతుంది’’ అని అప్పట్లో అధికారులు ప్రకటించారు. ఇది మంచి ఆలోచన అయినా దీనిని ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఈ విషయమై పౌరసరఫరాల సంస్థ అధికారులను సంప్రదించగా.. ‘‘కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలను క్రమబద్ధంగా నిర్వహించాలంటేనే తలనొప్పి తప్పడంలేదు. కొత్త తలనొప్పులు ఎక్కడ తెచ్చుకుంటాం’’ అని ప్రశ్నిస్తున్నారు. ఉన్న పథకాలను సక్రమంగా నిర్వర్తించడానికే ప్రాధాన్యం ఇస్తామని పౌరసరఫరాల అధికారి ఒకరు అన్నారు.