ఇంటి కోడి.. లాభాల ఒడి
ఇంటి కోడి.. లాభాల ఒడి
Published Sun, Mar 5 2017 9:52 AM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM
► ఆసక్తి ఉంటే చాలు తక్కువ శ్రమ, ఖర్చుతో అధిక లాభాలు
► మామునూరులో కోడి పిల్లల ఉత్పత్తి కేంద్రం
► ఏటా 1.20లక్షల పిల్లల ఉత్పత్తి
మామునూరు(వర్ధన్నపేట) : జీవనోపాధికి చాలా మార్గాలు ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అట్టడుగు వర్గాల వారు, నిరక్షరాస్యులకు అవి అందుబాటులో ఉండవు. ఈ సమస్యకు పరిష్కారం చూపడంలో పశు సంవర్థక శాఖ ముందుం టోంది. తక్కువ పెట్టుబడి, శ్రమతో ఎవరి పనులు వారు చేసుకుంటూనే ఇంటి వద్ద ఎంచుకోదగిన తేలికైన ఉపాధి మార్గమే పెరటి కోళ్ల పెంపకం.
మామునూరులో ఉత్పత్తి కేంద్రం
వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మండలం మామునూరులో వనరాజా, గిరిరాజ, రాజశ్రీ ఇతర కోడి పిల్లల ఉత్పత్తి కేంద్రం ఉంది. 2007లో దీనిని ప్రారంభించగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి వనరాజా కోడి పిల్లల ఉత్పత్తి కేంద్రం ఇది ఒక్కటే కావడం విశేషం. గుడ్లను హ్యాచింగ్ చేసేందుకు 10వేల గుడ్లను స్టోరేజీ సామర్థం కలిగిన ఇంక్యుబేటర్ ఏర్పాటు చేశారు. ఇంక్యుబేటర్‌లో 18 రోజుల వరకు గుడ్లను పొదిగి ఆ తర్వాత 5వేల గుడ్ల సామర్థ్యం కలిగిన హాచింగ్ యూనిట్‌లోకి మారుస్తారు. అందులో మూడు రోజులపాటు ఉంచుతారు. మొత్తం 21 రోజుల పాటు కృత్రిమంగా పొదిగించిన తర్వాత పిల్ల లు బయటకు వస్తాయి. బ్రూడింగ్(పెంచడం) చేసిన అనంతరం అవసరం ఉన్నవారికి అందజేస్తున్నారు. ప్రతీనెల ఉత్పత్తి అయిన కనీసం 10వేల కోడి పిల్లలను రఘనాథపల్లి మండలం కోమళలో ఉన్న మదర్ యూనిట్ ద్వారా అందజేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు ఏపీలోని అన్ని జిల్లాల నుంచి ఇక్కడి వనరాజా, గిరిరాజా, గ్రామప్రియ, రాజశ్రీ కోడిపిల్లలు సబ్సిడీపై సరఫరా అవుతున్నాయి. ఈ ఫామ్‌లో ఏడాదికి రూ.1.20లక్షల పిల్లలు ఉత్పత్తి చేస్తున్నారు. వనరాజా పెరటి కోళ్లను వివిద శాఖల అధికారులు రాయితీపై ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సబ్సిడీపై అందజేస్తున్నారు.
సబ్సిడీ ఇలా..
పెరటికోళ్ల పెంచుకునేందుకు ఆసక్తి ఉన్న రైతులు, యువత, మహిళలు మార్చి, ఏప్రిల్, మే నెలలో ముందుగా మండల పశువైద్యాధికారిని సంప్రదించి ధరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర బడ్జెట్‌ను బట్టి మండలానికి 20 నుంచి 30 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. జిల్లా అధికారి ఆమోదం తెలిపిన జాబితా వచ్చాక మండల పశువైద్యశాఖ అధికారుల ద్వారా మామునూరు కోళ్ల ఉత్పత్తి కేంద్రంలో 45 కోళ్ల చొప్పున సబ్సిడీపై అందజేస్తారు. రెండు విడతలుగా 25, 20 కోళ్లను పంపిణీ చేస్తారు. 4–6వారాల వయస్సు ఉన్న ఈ పిల్లలకు ఒక్కో దానికి మొత్తం ధర రూ.68 ఉండగా.. రూ.50 సబ్సిడీ పోగా రూ.18 చెల్లిస్తే కోళ్లు ఇస్తారు.
వనరాజా కోళ్ల పెంపకం..
గ్రామీణ ప్రాంతాల్లో పెంచుకోవడానికి వనరాజ కోళ్లు అనుకూలం, లాభదాయకం. పెంపకం ఖర్చులు చాలా తక్కువగా ఉండడంతో పాటు గుడ్డు పెద్దసైజులో వస్తుంది. ఆరు వారాల వయస్సులో కోడి 700 నుంచి 850 గ్రాముల బరువు ఉంటే దేశవాళీ కోడి కేవలం 250నుంచి 400వరకు బరువు ఉంటుంది. దేశవాళీ కోడిగుడ్లు బరువు కేవలం 28నుంచి 40గ్రాముల మధ్యలో ఉంటాయి.
పెరటికోళ్ల రకాలు..
వనరాజా, గిరిరాజా, గ్రామరాజా, రాజశ్రీ కోళ్లు ఆత్యంత ఆకర్షణ లక్షణాలతో రంగు ల రెక్కలతో ఉంటాయి. వీటికి అధిక రోగ నిరోధక శక్తి ఉంటుంది. పెద్ద సైజు గుడ్లు ఉత్పాదన, పెంపంకంపై ఖర్చు తక్కువ, ఎక్కువ రోజుల వరకు బతికే కలిగే సామర్థ్యం వీటి గుడ్లను దేశీ కోళ్లు కూడా పొదగడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
పెంపకంలో జాగ్రత్తలు
4–6వారాల వయస్సు దాటిన తర్వాత వీటీని పెరట్లో పెంపకానికి విడిచిపెట్టొచ్చు. సాయంకాలం ఆయ్యే సరికి ఇవి తమ గూటికి చేరుకునేటట్టు మొదటి నుండే అలవాటు చేయాలి. రోగాల బారిన పడినప్పుడు ఒక డోసు వ్యాక్సిన్ ఇస్తే సరిపోతుంది.
పెరటి కోళ్ల పెంపకం లాభదాయకం..
పెరటి కోళ్ల పెంపకం అత్యంత లాభదాయకం. మండల పశువైద్యాధికారి అందించిన జాబితా ప్రకారం సబ్సిడీపై లబ్ధిదారులకు కోళ్లను అందజేస్తాం. మనరాజా కోడి పిల్లలు అవసరం, ఆసక్తి ఉన్న వారు నేరుగా లేక 98490 01612 నంబర్‌లో సంప్రదించవచ్చు. వనరాజా కోళ్లు పెంపకం చేపడితే అదనపు అదాయం సమకూరుతుంది. తక్కువ కాల పరిమితిలో మంచి మాంసం, గుడ్ల ద్వారా సంపాదన లభిస్తుంది. వీటి పెంపకంలో ఖర్చు కూడా చాలా తక్కువ.– డాక్టర్ ఎం.డీ.జాకీర్ అలీ, ఫాం ఇన్‌చార్జి
Advertisement
Advertisement