అప్పులపాలు.. ఆత్మహత్యలు
చితికిపోతున్న యువత
ఆందోళనలో తల్లిదండ్రులు
పరువుపోతుందని కేసులు పెట్టని వైనం
కరీంనగర్: అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను కొందరు మంచికి వినియోగించుకుంటే.. మరికొందరు ఆన్‌లైన్‌గేమ్స్ ఆడుతూ అదఃపాతాళానికి పోతున్నారు. క్రమంగా ఆన్‌లైన్ ఆటలకు అలవాటు పడిన యువత ఎవరిమాట వినకుండా తయారవుతున్నారు. లక్షల రూపాయలు నష్టపోయి పెద్దలకు చెప్పుకోలేక కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. మరికొందరు తల్లిదండ్రుల ఖాతాల్లో నుంచి దొంగతనాన తీసుకొని అప్పులు చెల్లిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో ఇటీవల పెరిగిపోయాయి.
నిత్యం ఆన్‌లైన్‌లో..
ఆండ్రాయిడ్ ఫోన్లు, అన్‌లిమిటెడ్ డాటా ఉండడంతో ఎవరిని చూసిన నిత్యం ఆన్‌లైన్‌లోనే ఉంటున్నారు. రమ్మి, క్యాసినో.. తదితర కొత్తకొత్త పేర్లతో అట్రాక్ట్ చేస్తున్న ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ లక్షల్లో నష్టపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా చేతిలో ఫోన్‌తోనే గడుపుతున్నారు. ఇలా అలవాటుపడ్డ వాళ్లలో కొందరి మానసిక స్థితి సరిగ్గా లేకుండా పోయింది. మరికొందరైతే పెద్దల మాటలకు ఎదురుచెప్పడం, కుటుంబ సభ్యులపై దాడి చేయడం వంటి స్థితికి చేరుకుంటున్నారు.
లాభాలు వస్తున్నాయనే ఆశతో..
అప్పుడప్పుడే ఆన్‌లైన్ గేమ్స్ మొదలుపెట్టిన వారికి మొదటల్లో చిన్నపాటి లాభాలు ఆశచూపుతారు. ఇలా ఆ గేమ్స్‌కు ఆకర్షితులను చేసి క్రమంగా డబ్బులు గుంజుతుంటారు. జిల్లాలో ఇలా ఆన్‌లైన్ గేమ్స్ ఆడి కుదేలైన కుటుంబాలు అనేకం ఉన్నాయి. అయితే ఇలా నష్టపోయిన కుటుంబాలకు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నాయి. తమ కుటుంబం పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చేయడం లేదు.
ఆన్‌లైన్ గేమ్స్ ఆడి నష్టపోయిన వారు ఇలా..
వేములవాడకు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రైల్వేశాఖలో విధులు నిర్వర్తించేవాడు. సహచరులతో ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడి ఉన్న ఆస్తిని పోగొట్టుకున్నాడు. అప్పుల పాలు కావడంతో మానసికంగా కుంగిపోయి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డున పడ్డారు.
ఇటీవల వేములవాడలో రూ.2కోట్లతో ఉడాయించిన పూజారి మహేశ్ కూడా ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడని స్నేహితులు తెలిపారు.
వేములవాడకు చెందిన యువకులు రాజు, వెంకటేశ్, రమణ, శ్రీనివాస్.. ఆన్‌లైన్ గేమ్ పేరుతో క్యాసినో తదితర ఆటలవైపు మొగ్గుచూపారు. దాదాపు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నష్టపోయారు.
అవగాహన కల్పిస్తున్నాం..
ఆన్‌లైన్ గేమ్స్, సైబర్‌క్రైమ్‌లపై పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నాం. కళాబృందాల ద్వారా గ్రామీణులను చైతన్యం చేస్తున్నాం యువత ఆన్‌లైన్ గేమ్‌లకు బానిస కావడం సమాజానికి మంచిది కాదు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. స్కిల్ గేమ్స్ మాత్రమే ఆడాలి. అధిక డబ్బులు వస్తాయని ఆశ చూపే ఏ గేమ్ కూడా వాడొద్దు. అలాంటి గేమ్స్ వాడితే ఆర్థికంగా నష్టపోతారు. ఇలా ంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలి. – నాగేంద్రచారి, వేములవాడ డీఎస్పీ
ఇవి చదవండి:
Comments
Please login to add a commentAdd a comment