సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా ఆసిఫ్‌నగర్ మండల కార్యాలయ సిబ్బందిపై కొందరు దుండగులు చేసిన దాడికి నిరసనగా గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆందోళనలను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీఆర్‌ఎస్‌ఏ) ప్రకటించింది. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇచ్చిన హామీ మేరకు ఆందోళనలను విరమించుకుంటున్నామని టీఆర్‌ఎస్‌ఏ అధ్యక్షుడు మఠం శివశంకర్ తెలిపారు.
మహమూద్ అలీతో పాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ సమక్షంలో మంగళవారం టీజీటీఏ, వీఆర్వో, వీఆర్‌ఏ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. దాడి ఘటన నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించడానికి వారంలోగా జిల్లా కలెక్టర్‌తో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పినట్లు శివశంకర్ తెలిపారు. దాడికి పాల్పడ్డ దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. సమావేశంలో టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, అధ్యక్షుడు కె.గౌతంకుమార్, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు జి.సతీశ్, వీఆర్‌ఏల అధ్యక్షుడు వి.ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment