సాక్షి, హైదరాబాద్: భూ యాజమాన్యపు హక్కు లను తేల్చి, భూముల సేల్డీడ్లను రద్దు చేసే అధికారం తహసీల్దార్లకు ఇవ్వడం ఆందోళనకరమైన విషయమని హైకోర్టు మరోసారి అభిప్రాయపడింది. తహసీల్దార్లు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడే ప్రమాదముందని హెచ్చరించింది. ఇప్పటికే రెవెన్యూ శాఖలో చాలా అవినీతి ఉందని, సేల్‌డీడ్ల రద్దు అధికా రం తహసీల్దార్లకిస్తే ఆ అవినీతి మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది. తహసీల్దార్ల చర్యలు వినాశకరంగా మారుతా యని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సంగారెడ్డి జిల్లా, కంది తహసీల్దార్ అభ్యర్థన మేరకు సబ్ రిజిస్ట్రార్ పలువురి భూముల సేల్డీడ్లను రద్దు చేయడం పై స్టే విధించింది.
తహసీల్దార్లకు సేల్‌డీడ్ల రద్దు అధికారం ఇచ్చే విషయంలో చట్టం ఏం చెబుతుందో వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ను డిసెంబర్ 18కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా, కంది తహసీల్దార్ అభ్యర్థన మేరకు సబ్ రిజిస్ట్రార్ తమకు నోటీసివ్వకుండానే తమ భూమికి చెందిన సేల్‌డీడ్లను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ లక్ష్మీప్రసన్న, శ్రీనివాసరావు, రంగారావు, సతీశ్‌యాదవ్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు గురువారం మరోసారి విచారణకొచ్చాయి.
పిటిషనర్ల తరఫున పి.రాయ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వ కేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ.. కంది తహసీల్దార్ చర్యలను సమర్థించారు. పిటిషనర్ల భూములు ప్రభుత్వ భూములని, ఇనాం భూములు కావని అన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి కల్పించుకుని.. తాము భూ యాజమాన్య హక్కుల జోలికి వెళ్లట్లేదని పేర్కొన్నారు. సేల్‌డీడ్లు రద్దు చేసే అధికారం తహసీల్దార్‌లకు ఉందా లేదా అన్నదే ప్రధాన అం శమని చెప్పారు. రద్దు అధికారానికి సంబంధిం చి నిబంధనల్లో స్పష్టత లోపించిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment