అనుమతులు లేకుండానే చేలు పూడ్చుతున్న దృశ్యం
సాక్షి, తణుకు : వేసవి కాలం వచ్చిందంటే చాలు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. మట్టి పేరుతో యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తూ కాసులు ఆర్జిస్తున్నారు. ఒక పక్క అనుమతులు లేకుండానే తవ్వకాలు జరుపుతుండగా మరోపక్క ప్రభుత్వానికి ఎలాంటి కన్వర్షన్ ఫీజులు చెల్లించకుండానే పూడికలు చేపడుతున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని పెద్ద ఎత్తున పొలాలను పూడ్చుతున్నప్పటికీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తణుకుతో పాటు జిల్లాలోని డెల్టా ప్రాంతంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
డెల్టాలోని తణుకు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు తదితర పట్టణ సమీప ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టిని తరలిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు. మరోవైపు ట్రాక్టర్లు, లారీల్లో మట్టి తరలిస్తుండటంతో రోడ్లు ఛిద్రమవుతున్నాయి. జాతీయ రహదారిపై సైతం అపసవ్య దిశలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ పర్యవేక్షించాల్సిన పెట్రోలింగ్ సిబ్బంది పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.
అనుమతులు ఏవి?
ఇళ్ల స్థలాలకు అనువుగా వరిచేలను లేఅవుట్లుగా మార్చుకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి. ప్రభుత్వానికి 3 శాతం రుసుం చెల్లించడంతో పాటు భూమార్పిడి చేయించుకోవాలి. అనంతరం వరిచేలను పూడ్చడానికి మట్టి అవసరం అవుతుంది. చేలల్లో మట్టి దిబ్బల నుంచి మట్టిని తవ్వుకోవడానికి ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి. గనుల శాఖకు రుసుం చెల్లించి అనుమతులు తెచ్చుకుని మట్టితో పూడ్చుకోవాలి.
ఎలాంటి అనుమతులు లేకుండానే తణుకు పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారితో పాటు ప్రధాన రోడ్లు అనుకుని ఉన్న భూములను కొబ్బరి ఇతరత్రా పంటలు వేసుకుంటున్నామనే సాకుతో పూడికలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ల్యాండ్ కన్వర్షన్ ఫీజులు మాత్రమే చెల్లించి మట్టి అనుమతులు తీసుకోకుండా పూడికలు కానిచ్చేస్తున్నారు. తణుకు పట్టణ పరిధితో పాటు మండలం పరిధిలోని దువ్వ, తేతలి, ముద్దాపురం, మండపాక తదితర ప్రాంతాల్లో అనుమతులు లేకుండానే పూడికలు కానిచ్చేస్తున్నారు.
ఇటు రెవెన్యూ, అటు గనుల శాఖకు చెందిన అధికారులు సైతం మామళ్ల మత్తులో జోగుతూ ఇష్టానుసారం మట్టిని తవ్వుకుంటూ తరలిస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇలా వందల ఎకరాల్లో పూడికలు చేస్తూ ప్రభుత్వానికి రావాల్సిన రూ.కోట్లాది రూపాయిల ఫీజులను ఎగ్గొడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
నియంత్రణ లేని వాహనాలు
ఒకపక్క అక్రమంగా మట్టిని తరలించుకుపోతున్న అక్రమార్కులు వాహనాలపై సరైన నియంత్రణ లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రాక్టర్లు, లారీల్లో మట్టిని ఎత్తుగా వేసుకుని అతి వేగంగా రహదార్లుపై నడుపుతున్నారు. తణుకు మండలం దువ్వ జాతీయ రహదారి ఆనుకుని పెద్ద ఎత్తున పూడ్చుతున్న నిర్వాహకులు వాహనాలను ఇష్టానురీతిగా నడుపుతున్నారు. జాతీయ రహదారి నుంచి వరిచేలల్లోకి సబ్ రోడ్లు నిర్మించేస్తున్నారు.
దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను గమనించకుండానే మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు, లారీలు ఒక్కసారిగా హైవేపైకి దూసుకువస్తున్నాయి. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు డ్రైవర్లు సైతం చెవులకు ఇయర్ ఫోన్లు పెట్టుకుని సినిమా పాటలు వింటూ రోడ్డుపై వెళ్లే వారికి దారి ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కొందరు డ్రైవర్లకు కనీసం లైసెన్సులు లేకపోగా ఒక్కో వాహనంలో మైనర్లే డ్రైవింగ్ చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం నుంచి సక్రమంగా అనుమతులు తీసుకుని ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుంలు చెల్లించేలా అధకారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
అనుమతులు తప్పనిసరి
మట్టి పూడిక చేసినా లేక పొలాల్లోని మట్టిని తవ్వి తరలించుకోవాలనుకున్నా గనుల శాఖ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుంలు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాహనాలు రాకపోకలు సాగించాలి.
– ఎల్.శివకుమార్, తహసీల్దార్, తణుకు
Comments
Please login to add a commentAdd a comment