సాక్షి, అమరావతి : పారదర్శకత కోసం గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. సచివాలయంలోని తన చాంబర్‌లో గురువారం ఆయన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందన్నారు. దీంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సర్వే సెటిల్‌మెంట్, భూమి రికార్డుల శాఖల సమన్వయంతో రీసర్వే ప్రాజెక్టు ఫేజ్–1లోని 51 గ్రామ సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు.
1908 రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్–6 ప్రకారం నిర్దేశించిన గ్రామ సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా సేవలు అందించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని రజత్ భార్గవ అధికారులను కోరారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై సచివాలయ కార్యదర్శులకు అవసరమైన శిక్షణను అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధంచేయాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషగిరిబాబును ఆదేశించారు. సమావేశంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అదనపు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఉదయభాస్కర్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment