గతంలో తనకు జారీ అయిన పట్టా పాసు పుస్తకాలతో కుండ మధు
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): రెవెన్యూ శాఖలోని కొందరు వీఆర్వోలు అక్రమాలకు పాల్పడ్డారు. బడాబాబుల వద్ద డబ్బులు తీసుకుని చిన్న, సన్నకారు రైతుల భూములను మరొకరికి పట్టా చేసి ఇచ్చారు. ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతో తమకు గతంలో జరిగిన అన్యాయాన్ని బాధితులు ఇప్పుడు వెల్లబోసుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకపోవడంతో ఇతరులకు పట్టా చేసి ఇచ్చిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన చిట్యాల నర్సుబాయి అనే వృద్ధురాలికి 921 సర్వే నంబర్‌లో 21 గుంటల భూమి ఉంది. ఈ భూమిని నర్సుబాయి కుటుంబ సభ్యులు చాలా ఏళ్ల కిందనే కొనుగోలు చేశారు. అనివార్య కారణాల వల్ల రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు.
కాగా తెలంగాణ ప్రభుత్వం సాదా బైనామాలపై ఉన్న భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని నిర్ణయించగా తమ గ్రామ వీఆర్వోకు వినతి పత్రం సమర్పించింది. సాదా బైనామాపై ఉన్న భూమిని పట్టా మార్పిడి చేయడానికి ఈ గ్రామ వీఆర్వో లంచం అడగగా నర్సుబాయి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. అంతే నర్సుబాయికి సంబంధించిన భూమిని మరో మోతుబరి రైతు పేరిట పట్టా మార్పిడి చేశారు. సాదాబైనామాలకు సంబంధించిన కాగితాలు నర్సుబాయి వద్ద ఉండగా పట్టా మార్పిడి ఆమె పేరిట కాకుండా ఎలాంటి కాగితాలు లేని వ్యక్తి పేరిట పట్టా చేశారు.
ఇదే తొర్తి గ్రామానికి చెందిన కుండ మధు 781 సర్వే నంబర్‌లో 24 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఇతను 2007లో ఆర్‌వోఆర్‌లో దరఖాస్తు చేసుకుని తన పేరిట పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ సైతం తీసుకున్నాడు. ఈ భూ మిని మధు సాగు చేస్తున్నాడు. కానీ భూ ప్రక్షాళనలో భాగంగా మధుకు డి జిటల్ పాసు పుస్తకం రావాల్సి ఉంది. అప్పటికే మధుకు సంబంధించిన భూమి మరో బడా రైతు పేరిట పట్టా చేయబడింది. ఆర్‌వోఆర్‌కు సంబంధించిన ప్రొసీడింగ్‌తో పాటు ఉమ్మడి రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ ఉన్నా రికార్డులలో మాత్రం మధు పేరుకు బదులు మరోకరి పేరు ఉంది.
ఇలా నర్సుబాయి, మధులకు భూమి ఉన్నా రెవెన్యూ రికార్డులలో అక్రమాలు చోటు చేసుకోవడంతో రైతుబంధుకు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లబ్ధి పొందలేక పోయారు. తమ భూమికి సంబంధించిన రికార్డులను సరి చేసి తమకు పట్టా పాసు పుస్తకం జారీ చేయాలని వీఆర్వో, ఇతర అధికారులకు విన్నవించగా ఏదో ఒక సాకు చెబుతూ పట్టా సర్టిఫికెట్లను జారీ చేయలేదు. కాగా రికార్డులను సరిచేస్తామని వీఆర్వో నమ్మించడంతో బాధితులు ఎక్కడ కూడా తమ బాధ చెప్పుకోలేదు. చివరకు వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయడంతో పట్టాల మార్పిడిలో చోటు చేసుకున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ఒక నర్సుబాయి, కుండ మధులకు సంబంధించిన సమస్యనే కాదు. ఎంతో మంది చిన్న, సన్నకారు రైతులకు సంబంధించిన సమస్య. చిన్న సన్నకారు రైతుల భూములను డబ్బులు ఇచ్చిన వారి పేరిట పట్టా మార్పిడి చేసిన అవినీతి వీఆర్వోల బాగోతం ఇది.
కబ్జా కాలమ్ రద్దుతో అసలు సమస్య
కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగంగా ప్రభుత్వం పహణీలలో కబ్జా కాలమ్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కబ్జా కాలం రద్దు కావడంతో పట్టా పాసు పుస్తకాలు రాని భూముల యజమానుల పరిస్థితి అగమ్యగోచరం కానుంది. తొర్తికి చెందిన చిట్యాల నర్సుబాయి, కుండ మధులు ఇది వరకు కబ్జా కాలంలో ఉండగా కబ్జా కాలం రద్దయితే యాజమాన్య హక్కులను పూర్తిగా కోల్పోతారు.
సమగ్ర దర్యాప్తు జరిపితేనే..
తొర్తితో పాటు పలు గ్రామాల్లో చోటు చేసుకున్న అక్రమాలు వెలుగులోకి వచ్చి బాధితులకు న్యాయం జరగాలంటే భూ రికార్డులపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాదా బైనామాలపై ఉన్న భూముల పట్టాల మార్పిడికి చిన్న, సన్నకారు రైతులు వీఆర్వోలు అడిగినంత ఇచ్చుకోకపోవడంతో భూముల యజమానులు మారిపోయారు. వీఆర్వోలు గ్రామాలలో తిష్టవేసి ఉన్నంత కాలం పట్టాల మార్పిడికి సంబంధించి వారు ఏదో ఒక సాకు చెబుతూ తప్పించుకున్నారు. వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయడంతో తమకు గతంలో జరిగిన అన్యాయాన్ని బాధితులు ఇప్పుడు వెల్లబోసుకుంటున్నారు.
అసైన్డ్ భూములది అదే పరిస్థితి..
అసైన్డ్ భూములను గతంలో పొందిన కొందరు తమ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో భూములను విక్రయించుకున్నారు. ఈ భూములకు సంబంధించి పట్టాల మార్పిడికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అసైన్డ్ భూముల పట్టాల మార్పిడిని రిజిస్ట్రేషన్ పద్ధతిలో కాకుండా సాదాబైనామాలపై మార్పిడి చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో ఒక్కో ఎకరం భూమి పట్టా మార్పిడికి రూ. 25వేల వరకు కింది స్థాయి ఉద్యోగులు వసూలు చేశారు. కొందరు డబ్బులు ఇవ్వకపోవడంతో సాదాబైనామా దరఖాస్తులను వీఆర్వోలు పక్కన పడేశారు. ప్రతి రెవెన్యూ కార్యాలయంలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు పడి ఉన్నాయి.
అవినీతి వీఆర్వోలపైనే చర్యలు తీసుకువాలి
అధికారం తమ చేతిలో ఉందనే ధీమాతో కొందరు వీఆర్వోలు తమ పరిధిలోని గ్రామాల్లో అడ్డగోలుగా దోచుకున్నారు. అక్రమంగా ఎన్నో రకాల ఆస్తులను కొందరు అవినీతి వీఆర్వోలు సంపాదించుకున్నారు. ప్రభుత్వం విచారణ చేపట్టి ఇలాంటి వీఆర్వోలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment