మోర్తాడ్: విదేశాలకు వెళ్లి ఉపాధి పొందాలనుకునే యువతను లక్ష్యంగా చేసుకుని ఏజెంట్లు దందా సాగిస్తున్నారు. నకిలీ వీసాలతో అమాయకులను దోచుకుంటున్నారు. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఏజెంట్లు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఇటీవల జరిగిన సంఘటనలు వెల్లడిస్తున్నాయి. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో మలేషియా ముందు వరుసలో ఉంటుంది.
ఆ దేశంలో పనిచేయడానికి కంపెనీలు వర్క్ వీసాలను జారీ చేసే అవకాశం ఉన్నా ఏజెంట్లు డబ్బులపై ఆశతో వర్క్ వీసాల జోలికి వెళ్లకుండా విజిట్ వీసాలే ఇస్తున్నారు. మరికొందరు ఏజెంట్లు నకిలీ వీసాలను అంటగడుతూ నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నారు. అయితే విజిట్ వీసాలపై వస్తు న్న వలసదారులు వీసా గడువు ముగిసినా మలేషియాలోనే ఉండిపోతున్నారని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. అక్రమంగా ఉండేవారిని అడ్డుకోవడానికి ఇటీవల పకడ్బందీ చర్యలు చేపట్టింది.
విజిట్ వీసాపై వచ్చినవారిలో ఎవరు టూరిస్టులో, ఎవరు ఉండటానికి వస్తున్నారో గుర్తించి మలేషియా ఎయిర్‌పోర్టులోనే నిలువరిస్తోంది. విజిట్ వీసాపై టూరిజం సంస్థల ద్వారా వచ్చినవారినే ఆ దేశంలో అడుగుపెట్టడానికి అనుమతి ఇస్తోంది. ఏదో పనిచేసుకుందామని విజిట్ వీసాలపై వస్తున్నవారిని ఎయిర్‌పోర్టులోనే ఉంచుతున్న పోలీసులు ఒకటి రెండు రోజుల్లో తిప్పి పంపిస్తున్నారు. ఇలా నెలన్నరగా రోజుకు వంద నుంచి రెండు వందల మంది మలేషియా నుంచి తిరిగి వస్తున్నారు.
లక్షల రూపాయలు ఏజెంట్ల పాలు..
మలేషియాలోనే పలు కంపెనీలు వర్క్ వీసాలను జారీ చేస్తున్నా ఏజెంట్లు మాత్రం విజిట్ వీసాలపైనే అక్కడికి పంపిస్తున్నారు. నిరుద్యోగులు వీసా కోసం ఏజెంట్లకు రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఇటీవల మెట్‌పల్లి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన దాదాపు 25 మందికి నకిలీ వీసాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వారికి సందేహం వచ్చి ఆన్‌లైన్‌లో పరిశీలించగా నకిలీవని తేలింది.
ఏజెంట్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో విషయం బయటికి వచ్చింది. అయి తే, మలేషియాలో మునుపటి పరి స్థితి లేదని, అక్కడ ఉపాధి పొందుతున్న ఏర్గట్లకు చెందిన మచ్చ లక్ష్మణ్ ‘సాక్షి’కి తెలిపారు. వర్క్ పర్మిట్ వీసాలు తీసుకుని వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment