fake visas
-
నిరుద్యోగులకు ఏజెంట్ల వల!
మోర్తాడ్: విదేశాలకు వెళ్లి ఉపాధి పొందాలనుకునే యువతను లక్ష్యంగా చేసుకుని ఏజెంట్లు దందా సాగిస్తున్నారు. నకిలీ వీసాలతో అమాయకులను దోచుకుంటున్నారు. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఏజెంట్లు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఇటీవల జరిగిన సంఘటనలు వెల్లడిస్తున్నాయి. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో మలేషియా ముందు వరుసలో ఉంటుంది. ఆ దేశంలో పనిచేయడానికి కంపెనీలు వర్క్ వీసాలను జారీ చేసే అవకాశం ఉన్నా ఏజెంట్లు డబ్బులపై ఆశతో వర్క్ వీసాల జోలికి వెళ్లకుండా విజిట్ వీసాలే ఇస్తున్నారు. మరికొందరు ఏజెంట్లు నకిలీ వీసాలను అంటగడుతూ నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నారు. అయితే విజిట్ వీసాలపై వస్తు న్న వలసదారులు వీసా గడువు ముగిసినా మలేషియాలోనే ఉండిపోతున్నారని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. అక్రమంగా ఉండేవారిని అడ్డుకోవడానికి ఇటీవల పకడ్బందీ చర్యలు చేపట్టింది. విజిట్ వీసాపై వచ్చినవారిలో ఎవరు టూరిస్టులో, ఎవరు ఉండటానికి వస్తున్నారో గుర్తించి మలేషియా ఎయిర్‌పోర్టులోనే నిలువరిస్తోంది. విజిట్ వీసాపై టూరిజం సంస్థల ద్వారా వచ్చినవారినే ఆ దేశంలో అడుగుపెట్టడానికి అనుమతి ఇస్తోంది. ఏదో పనిచేసుకుందామని విజిట్ వీసాలపై వస్తున్నవారిని ఎయిర్‌పోర్టులోనే ఉంచుతున్న పోలీసులు ఒకటి రెండు రోజుల్లో తిప్పి పంపిస్తున్నారు. ఇలా నెలన్నరగా రోజుకు వంద నుంచి రెండు వందల మంది మలేషియా నుంచి తిరిగి వస్తున్నారు. లక్షల రూపాయలు ఏజెంట్ల పాలు.. మలేషియాలోనే పలు కంపెనీలు వర్క్ వీసాలను జారీ చేస్తున్నా ఏజెంట్లు మాత్రం విజిట్ వీసాలపైనే అక్కడికి పంపిస్తున్నారు. నిరుద్యోగులు వీసా కోసం ఏజెంట్లకు రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఇటీవల మెట్పల్లి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన దాదాపు 25 మందికి నకిలీ వీసాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వారికి సందేహం వచ్చి ఆన్లైన్లో పరిశీలించగా నకిలీవని తేలింది. ఏజెంట్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో విషయం బయటికి వచ్చింది. అయి తే, మలేషియాలో మునుపటి పరి స్థితి లేదని, అక్కడ ఉపాధి పొందుతున్న ఏర్గట్లకు చెందిన మచ్చ లక్ష్మణ్ ‘సాక్షి’కి తెలిపారు. వర్క్ పర్మిట్ వీసాలు తీసుకుని వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. -
నకిలీ వీసా స్టాంపింగ్ రాకెట్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్ : నకిలీ వీసా స్టాంపింగ్‌లతో మహిళలను కువైట్‌కు తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఆర్జీఐఏ పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారంతో నకిలీ వీసా స్టాంపింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో సీపీ వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు పట్టణానికి చెందిన రెల్లు కుబెందర్ రావు అలియాస్ చిన్న హమాలీగా పని చేసేవాడు. ఆ తర్వాత వెల్డింగ్ పని నేర్చుకున్న అతను 2007 నుంచి 2014 వరకు సింగపూర్, సౌతాఫ్రికాలో పని చేశాడు. 2016లో నర్సరావుపేటలో పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించిన అతను కమీషన్‌పై చెన్నైకి చెందిన ఎన్బీఎస్ ట్రావెల్స్‌లో ఎయిర్ టికెట్ బుకింగ్ చేసేవాడు. ఇందుకుగాను అతడికి చెన్నై, కుంభకోణం ప్రాంతానికి చెందిన షేక్ బషీర్ అహ్మద్ సహాయకుడిగా పని చేసేవాడు. తరచు శ్రీలంక వెళ్లే బషీర్ అక్కడ కుమార్ అనే వ్యక్తి నుంచి ఒరిజనల్ స్టాంపులు తెచ్చేవాడు. అనంతరం వాటి ఆధారంగా కుబెందర్‌రావు, బషీర్, కుంభకోణంకు చెందిన బాలు ప్రసాద్‌తో కలిసి శంషాబాద్‌లోని ఓ హోటల్లో నకిలీ వీసాలు తయారు చేసేవారు. నకిలీ వీసాలతో దుబాయికి.. ఈ నకిలీ స్టాంప్‌ల ఆధారంగా బాలుప్రసాద్ నకిలీ పీఓఇ, ఇసీఆర్, మెడికల్ సర్టిఫికెట్లు రూపొందించేవాడు. అనంతరం సబ్ ఏజెంట్ల ద్వారా తమను సంప్రదించిన మహిళలను విజిటింగ్ వీసాపై దుబాయ్, అక్కడి నుంచి కువైట్ పంపేవారు. కువైట్ చేరుకున్న వారికి లక్ష్మీ, శారద, శ్రీను, సారా అనే వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పించేవారు. ఇందుకు గాను ఒక్కో మహిళ నుంచి రూ. లక్ష వసూలు చేసేవారు. ఇందులో కువైట్‌లో ఉండే ఏజెంట్లకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఇచ్చేవారు. ఇదే తరహాలో 21 మందిని కువైట్ పంపినట్లు సీపీ తెలిపారు. వారు ఎక్కడ పనిచేస్తున్నారో త్వరలోనే వివరాలు సేకరిస్తామన్నారు. ఈ విషయమై ఇప్పటికే కువైట్ ఎంబసీకి సమాచారం అందించామన్నారు. ప్రధాన నిందితులు రెల్లు కుబెందర్‌రావు, షేక్ బషీర్ అహ్మద్‌తో పాటు సబ్ ఏజెంట్లుగా వ్యవహరించిన మోహన్‌రావు, అగస్టీ, రుత్తమ్మ, సునీత, వెంకటరామకృష్ణలను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు బాలు ప్రసాద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి రూ.2 లక్షల నగదు, ప్రింటర్, లాప్ ట్యాప్, 15 మీ సేవా పత్రాలు, 16 పాస్ పోర్ట్‌లు, 13 వీసా పేపర్లు, 25 ఒరిజినల్ స్టాంపులు, 6 స్టాంప్ ప్యాడ్స్ స్వాదీనం చేసుకున్నారు. శ్రీలంకకు చెందిన కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటికి వస్తాయన్నారు. సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు, శంషాబాద్ డీసీపీ సందీప్‌కుమార్, ఏసీపీ అశోక్‌కుమార్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, ఆర్జీఐఏ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్, ఎస్ఐలు రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: విస‘వీసా’ జారుతున్నాం -
నకిలీ వీసాలతో మోసాలు
సిరిసిల్ల: గల్ఫ్ బాటలో ఘరానా మోసం జరిగింది. నకిలీ వీసాలు అంటగట్టి కోట్లు కొల్లగొట్టిన ఘటన తెలంగాణ జిల్లాల్లో వణుకు పుట్టిస్తోంది. బోగస్ వెబ్సైట్ సృష్టించి నకిలీ వీసాలను చూపించి రూ.5 కోట్లకు టోకరా ఇచ్చాడు ఓ రాజస్తానీ యువకుడు. రాష్ట్రంలోని 5 జిల్లాలకు చెందిన 300 మంది చెల్లించిన లక్షలతో ఉడాయించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనలో పొరుగు జిల్లాల్లోనూ బాధితులున్నారు. షార్జా బల్దియా వీసాల పేరిట షార్జాలోని బల్దియా (మున్సిపాల్) క్లీనింగ్ వీసాల పేరిట మోసం జరిగింది. రాజస్తాన్‌కు చెందిన మక్సూద్ అలీ (పాస్‌పోర్టు నంబరు ఎల్ 3833483) దుబాయి వెళ్లి వస్తాడు. సొంతగా ఓ నకిలీ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి అందు లో నకిలీ వీసాలను తయారు చేసి అప్లోడ్ చేశాడు. దుబాయి, షార్జాల్లో పని చేసే వలస కార్మికులకు బల్దియా వీసాలు ఉన్నాయని నమ్మించాడు. మీకు బంధువులకు వీసాలు ఇవ్వండి అంటూ మక్సూద్ చెప్పాడు. దీంతో పలువురు వలస జీవులు సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాలోని సమీప బంధువులకు షార్జా బల్దియా వీసాలు ఉన్నాయని చెప్పారు. అవసరమైతే వెబ్సైట్లో చెక్ చేసుకుని వీసాలకు డబ్బులు చెల్లించాలని సూచించారు. షార్జాలో ఉన్న ఆత్మీయులే ఇలా చెప్పడంతో నమ్మిన పలువురు వెబ్సైట్ చెక్ చేయడంతో వీసాలు ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. దీంతో ఒక్కొక్కరు రూ.1.80 లక్షల నుంచి రూ.2.30 లక్షల వరకు వీసాలకు చెల్లించారు. ఇలా సుమారు 300 మంది యువకులు రూ.5 కోట్ల వరకు చెల్లించినట్లు సమాచారం. ఆ డబ్బులను తీసుకున్న మక్సూద్ నకిలీ వీసాలతో అందరినీ మోసం చేశాడు. బయట పడిందిలా.. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలానికి చెందిన ఓ ఎంపీటీసీ సభ్యులు గల్ఫ్ ఏజెంట్‌గా పనిచేస్తారు. ఆయన 36 మందికి సంబంధించి రూ.56 లక్షలను మక్సూద్‌కి చెల్లించాడు. ఏడుగురు అభ్యర్థులను ఇటీవల షార్జా పంపించగా.. షార్జా ఎయిర్‌పోర్టు అధికారులు అవి నకిలీ వీసాలని గుర్తించి వారిని ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి పంపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్‌నగర్ శివారు తుర్కాసికాలనీకి చెందిన మరో పది మందిని స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు షార్జా పంపేందుకు హైదరాబాద్ పంపారు. శంషాబాద్‌విమానాశ్రయం అధికారులు నకిలీ వీసాలను గుర్తించి ఆ పది మందిని వెనక్కి పంపారు. మక్సూద్ ఇచ్చిన వెబ్‌సైట్‌ను చెక్ చేస్తే.. అది నకిలీదని తేలింది. దీంతో తాము మోసపోయామనే విషయం బాధితులకు అర్థమైంది. కాగా, 36 మంది మోసపోయినట్లు తెలియడంతో దర్పల్లికి చెందిన ప్రజాప్రతినిధి గుండెపోటుకు గురై∙ఆస్పత్రి పాలయ్యాడు. -
కువైట్ చెక్కేస్తున్న 20 మంది మహిళల అరెస్టు..
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ వీసాలతో విదేశాలకు చెక్కేస్తున్న 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వీసాలు కలిగిన వీరు కువైట్ వెళ్లేందుకు యత్నిస్తూ పట్టుబడ్డారని ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు. మహిళలను అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించామని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆస్ట్రేలియా బోగస్ వీసాలపై అప్రమత్తంగా ఉండాలి
సిడ్నీ: ఆస్ట్రేలియా బోగస్ వీసాల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి సూచించారు. ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. శాస్త్ర, సాంకేతిక రంగాలతోపాటు విద్య, ఉపాధి అవకాశాలు ఆస్ట్రేలియాలో ఘననీయంగా ఉన్నాయన్నారు. ఈ కారణంగా నెలకొన్న డిమాండ్ ని సొమ్ము చేసుకోవాలని కొందరు నకిలీ ఏజెంట్లు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వర్క్ పర్మిట్ ల పేరుతో నకిలీ పత్రాలతో విచ్చలవిడిగా మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. విక్టోరియా స్టేట్ ఇంచార్జి సాయిరాం ఉప్పు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల పరిసర ప్రాంతాల్లో కొందరు నకిలీ ఏజెంట్లు ఆస్ట్రేలియా వీసాలు, వర్క్ పర్మిట్ ల పేరున మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఆస్ట్రేలియాలోని వివిధ కంపెనీల పేరుమీద సొంతంగా జాబ్ ఆఫర్ లెటర్ లు ముద్రించి ఉపాధి కోసం యత్నిస్తున్న యువకుల్ని లక్ష్యంగా చేసుకొని లక్షల్లో డబ్బులు వసూలు చేసి, కుంటి సాకులు చూపిస్తున్నారని తెలిపారు. నెలలు గడుస్తున్నా, ఏ విధమైన పురోగతి లేకుండా వారి ఆఫీసుల వెంబడి తిప్పుకుంటారని తన దృష్టికి వచ్చిందన్నారు. ఆస్ట్రేలియాలోని సదరు కంపెనీలను సంప్రదించగా ఇవ్వన్నీ ఫేక్ ఆఫర్ లెటర్లని తెలిసిందని, యాజమాన్యాలకు తెలియజేసి వారి వెబ్ సైట్ లో ఇలాంటి బూటకపు ప్రకటనలను, ఏజెంట్లను నమ్మవద్దని ఒక సందేశాన్ని కూడా పొందుపరిచేలా ఏర్పాటు చేశామన్నారు. ఒక ముఠాగా ఏర్పడిన కొందరు నకిలీ ఏజెంట్లు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దందా జరుగుతుందన్నారు. పూర్వపు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో తమ ఏజెంట్ల ద్వారా నకిలీ ఆఫర్ లెటర్లు చూయించి ఒక్కొక్కరి నుంచి విడదల వారీగా దాదాపు ఆరు లక్షల రూపాయలు వసూలు చేసి, వారిని నమ్మించేందుకు పాసుపోర్టు జిరాక్సులు తీసుకొని, ప్రక్రియ మొదలైందని మాయమాటలు చెప్తూ కాలం వెల్లదీస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పంపిస్తున్నామని కొందరిని నమ్మించి సముద్రమార్గం ద్వారా మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా దేశాలకు పంపి కొన్ని నెలలపాటు నివాసయోగ్యం కాని ఇరుకు గదుల్లో ఉంచుతారని తెలిపారు. చివరకు చేతి ఖర్చులకు సైతం తెచ్చుకున్న డబ్బును సైతం స్వాహా చేస్తే పరాయి దేశాల్లో ఫుట్ పాత్ లపై జీవనం సాగించి, జైలు జీవితం గడిపి అష్టకష్టాలు పడి చివరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరిగి ఇంటికి చేరుకున్న సందర్భాలున్నాయని వివరించారు. ఆస్ట్రేలియాతోపాటు అన్ని ముఖ్యమైన యూరప్ దేశాలకు కూడా ఇలాంటి నకిలీ వీసాల ఆశ చూయించి మోసాలకు పాల్పడుతున్నారని ఆస్ట్రేలియా టీఆర్ఎస్ బృందం వెల్లడించింది. నైపుణ్యం కలిగిన వృత్తి, విద్య కోర్సుల ద్వారా గాని, ఉన్నత చదువుల కోసం గుర్తింపు పొందిన కన్సల్టెన్సీలకు అప్లయ్ చేసుకోసుకుని పొందిన వీసాల ద్వారానే నిభందనలమేరకు ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు సంపాదించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అంతే కానీ ఇలా పాసుపోర్టు జిరాక్సుల ద్వారా వీసాలు పొందే ప్రక్రియ అసలే లేదని, అలాంటి నకిలీ ఏజెంట్ల మోసాలకు బలై డబ్బుతో పాటు ప్రాణాలకు హాని తెచ్చుకోవద్దని కాసర్ల నాగేందర్ రెడ్డి హెచ్చరించారు. -
ప్రవాస భారతీయ దంపతులకు 30 ఏళ్ల జైలు!
వాషింగ్టన్: ప్రవాస భారతీయ దంపతులు రాజు కోసూరి(44), ఆయన భార్య(45) స్మృతి ఝరియాలు హెచ్-1బీ అక్రమ వీసాల కేసులో దోషులుగా తేలారు. వీరికి 30 ఏళ్ల జైలు శిక్ష పడే వీలుందని అమెరికన్ న్యాయ శాఖ తెలిపింది. ఏస్‌బర్న్‌లో నివసించే ఈ జంటతోపాటు మరో నలుగురు వీసా అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఫోర్జరీ సంతకాలతో నకిలీ వీసాలను సృష్టించి వీరు ఇప్పటి దాదాపు 20 మిలియన్ డాలర్లు ఆర్జించినట్లు ఆరోపణలు ఉన్నాయని న్యాయశాఖ పేర్కొంది. -
డూప్లికేట్లకు కటకటాలు
మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సోమాలియన్ల అరెస్టు నకిలీ స్టాంప్‌లు, ఫోర్జరీ డాక్యుమెంట్ల స్వాధీనం గోల్కొండ: నకిలీ వీసాలు, స్టే పర్మిట్లు, డూప్లికేట్ పాస్‌పోర్టులు తయారు చేస్తూ.. ఎంతో మంది అమాయకులను మోసం చేసిన ఇద్దరు సోమాలియన్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు బుధవారం వెల్లడించారు. సోమాలియాలోని మగధీషుకు చెందిన అబ్ది రహ్మాన్ ఇబ్రహీం లిబాన్ (25) పాస్‌పోర్టు లేకుండా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అదే దేశానికి చెందిన అబ్ది రహ్మాన్ అబూకర్ హాజీ ఉస్మాన్ (22) నగరంలో ఉంటూ రామోజీ ఫిలింసిటీ సమీపంలోని సెయింట్ మేరీ కళాశాలలో ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతనికి హుమాయూన్‌నగర్‌లో నివ సించే అనుమతి ఉండగా.. దీనికి విరుద్ధంగా విజయనగర్ కాలనీలో ఉంటున్నాడు. 2009లో ఇక్కడకు వచ్చిన హాజీ ఉస్మాన్ ఓమన్‌లో హైస్కూల్ విద్య, నిజాం కళాశాలలో బీఎస్సీ పూర్తి చే సి 2013లో సోమాలియా వెళ్లిపోయాడు. మళ్లీ తిరిగి వచ్చి ఎంబీఏ చదువుతున్నాడు. అనంతరం హైదరాబాద్‌లో జతకట్టిన వీరిద్దరూ ఆదాయం కోసం అక్రమ మార్గాలు పట్టారు. సోమాలియాతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చేవారికి నకిలీ పాస్‌పోర్టులు, వీసాలు, స్టే పరిమిట్లు ఇస్తూ అందిన కాడికి దండుకుంటూ జల్సాలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు వీరి కార్యకలాపాలపై నిఘా పెట్టారు. ఈ నెల 14న ఎన్ఎంఈసీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఉస్మాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతనిచ్చిన సమాచారం మేరకు బుధవారం లిబాన్ను అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ పత్రాల కుంభకోణం బయటపడింది. ఇబ్రహీం లిబాన్ వద్ద నుంచి నకిలీ ఫారినర్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ బెంగళూరు, వీసా ఎక్స్టెన్షన్ రబ్బర్‌స్టాంప్, సింగిల్ ఎంట్రీ వీసా ఎఫ్ఆర్ఆర్ఓ బీఐఓ బెంగళూరు, డబుల్ ఎంట్రీ రబ్బర్ స్టాంప్‌తో పాటు సన్‌షైన్ ఆస్పత్రి రబ్బర్‌స్టాంప్, సేలం మెడికల్ కాలేజ్, లఫోలే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రబ్బర్‌స్టాంప్, హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రబ్బర్ స్టాంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఉస్మాన్ నుంచి స్టే వీసా ఫోర్జరీ డాక్యుమెంట్, ల్యాప్‌ట్యాప్, పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరినీ రిమాండ్‌కు తరలించారు. కేసును హుమాయూన్‌నగర్ ఇన్స్పెక్టర్ ఎస్. రవీందర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు బి. కరుణాకర్‌రెడ్డి, పి. నందకిషోర్రావు దర్యాప్తు నిర్వహించారు. -
ఉద్యోగాలం
నిరుద్యోగులకు ఏజెంట్ల వల విదేశీ ఉద్యోగాల పేరిట టోకరా లక్షలు కాజేసి నకిలీ వీసాలు అందజేత విషయం తెలియక బాధితులు విలవిల ఇరాక్‌లో జిల్లా వాసులు చిక్కుకుపోవడంతో విషయం వెలుగులోకి.. స్పందించని జిల్లా యంత్రాంగం విశాఖపట్నం: విదేశాల్లో మంచి ఉద్యోగం.. వేలల్లో జీతం..విలాసవంతమైన జీవితం.. ఇలా నిరుద్యోగులకు ఏజెంట్లు ఆశ లు కల్పిస్తున్నారు. అందినంత గుంజుతున్నారు. నకిలీ వీసాలు, విజిటింగ్ వీసాలతో ఢిల్లీ, ముంబయి తీసుకెళ్లి అక్కడ నుంచి విదేశాలకు విమానం ఎక్కించి చేతులు దులుపుకుంటున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసి నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు. తిరిగి వచ్చేందుకు డబ్బుల్లేక దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ నెల 18న విశాఖ జిల్లాకు చెందిన 40 మంది యువకులను ఏజెంట్ ఇరాక్‌కు పంపాడు. అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఆ దేశంలోని నజాఫ్‌లో పనిలోకి తీసుకున్న కంపెనీ వీరిని ఓ కంటైనర్‌లో ఉంచింది. తిండీ, నీళ్లు లేక వారంతా ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. వారి స్నేహితులు ఆదివారం ఢిల్లీలోని సాక్షి కార్యాలయానికి వచ్చి గోడు వెలిబుచ్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాక్ వెళ్లేందుకు ఢిల్లీ వరకు వచ్చి ఏజెంట్ చేతిలో మోసపోయిన మరికొందరు విశాఖవాసులు తమను రాజమండ్రి సమీపంలోని రావులపాలెం మండలం ఓబలంక గ్రామానికి చెందిన మేడపాటి వెంకటకృష్ణ అనే ఏజెంట్ తమను మోసం చేశాడని, ఇరాక్‌లో ఉద్యోగాల పేరిట రూ.లక్షల్లో తీసుకున్నాడని సాక్షికి చెప్పారు. సుమారు రూ.60 లక్షల మేర తీసుకుని నకిలీ వీసాలు తమ చేతుల్లో పెట్టి చేతులు దులుపుకున్నాడని వాపోయారు. ఇరాక్‌లో చిక్కుకున్న తమ వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే భారత్‌కు చేర్చాలని బాధితుల కుటుంబ సభ్యులు, స్నేహితులు వేడుకుంటున్నారు. ఫిర్యాదులు అందలేదు విశాఖ జిల్లాకు చెందిన 40 మంది నిరుద్యోగులు ఇరాక్‌లో చిక్కుకున్నారని తెలిసినా జిల్లా యంత్రాంగంలో కదలిక లేదు. కనీసం వారెవరన్నది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కలెక్టర్ ఆరోఖ్యరాజ్ హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇతర అధికారులు ఈ విషయం పట్టించుకోలేదు. బాధిత కుటుంబాల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని జిల్లా ఎస్పీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంఘటన గురించే తమకు తెలియదని చెప్పడం విశేషం. బాధితుల నుంచి ఫిర్యాదు అందితేనే చర్యలు తీసుకుంటామని ఒక పోలీస్ అధికారి తెలిపారు. ఫిర్యాదులు అందితే భారత దౌత్య కార్యాలయానికి సమాచారమిస్తామని పేర్కొన్నారు. ఏజెంట్‌ను నమ్మి మోసపోయాం ‘మాది కశింకోటలోని గవరపేట...కూలి చేస్తే కానీ భుక్తి గడవని కుటుంబం. ఇద్దరు కుమారులు..పెద్ద వాడు ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. చిన్నవాడు బాపునాయుడిని ఏడో తరగతి వరకూ చదివించాం... గాజువాకలో ప్రైవేటుగా రూ.35 వేలు చెల్లించి వెల్డింగ్ నేర్పించాం. దుబాయి పంపించాం. అక్కడ రెండేళ్లు వెల్డర్‌గా పనిచేసి పనిలేక తిరిగొచ్చేశాడు. కుటుంబాన్ని బాగు చేసుకోవాలంటే మళ్లీ విదేశానికి ఉపాధికి వెళ్లాలని భావించాడు. ఇరాక్‌లో ఉద్యోగం ఇప్పిస్తారని నమ్మి ఏజెంటు మేడిపాటి వెంకటకృష్ణకు రూ.లక్షన్నర అప్పు చేసి చెల్లించాం. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 30 మందితో కలిసి నాలుగు నెలల క్రితం బాపునాయుడిని ఇరాక్ పంపించాం. అక్కడికెళ్లగానే ఏజెంటు బ్యాంకు ఖాతాద్వారా లక్షన్నర రూపాయలు కాజేసి ఉద్యోగం ఇప్పించకుండా పంపేశాడు. అటు డబ్బులు పోయి, ఇటు ఉద్యోగం రాక మోసపోయాం. - పెంటకోట అప్పలసత్తి, లక్ష్మి, కశింకోట (బాధితుని తల్లిదండ్రులు) బాధితులను ఆదుకోవాలి ఇరాక్‌లో పని కోసం వెళ్లి చిక్కుకుపోయిన విశాఖవాసులను వెనక్కి రప్పిం చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇరాక్‌లో ఇబ్బందులు పడుతున్న బాధితులను ఆదుకోవాలి. టీడీపీ, బీజేపీ నేతలు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. - గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ నేత -
వీసాల కోసం దొంగ పెళ్లిళ్లు:దంపతులు అరెస్టు
మెల్బోర్న్:ఆస్ట్రేలియా వీసాల కోసం స్థానిక మహిళలతో దొంగ పెళ్ళిళ్లు ఏర్పాటు చేసిన కేసులో భారత సంతతి దంపతులను స్థానిక ఫెడరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబైకి చెందిన మైగ్రేషన్ ఏజెంట్ చేతన్ మోహన్‌లాల్ మష్రూ, పెళ్ళిళ్ల వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన అతని భార్య, ఆస్ట్రేలియూలోనే జన్మించిన దివ్య క్రిష్ణె గౌడలకు బ్రిస్బేన్ మేజిస్ట్రేట్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను మార్చి 14వ తేదీకి వాయిదా వేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో వెలుగు చూసిన ఈ కేసులో నేరం రుజువైతే నిందితులకు పదేళ్ల వరకు జైలు శిక్ష, సుమారు కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. నైరుతి బ్రిస్బేన్‌లోని ఆక్స్లీ నివాసంలో మష్రూ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా.. 30 మందికి పైగా పురుషులు, మహిళలకు వీరు దొంగ పెళ్ళిళ్లు ఏర్పాటు చేసినట్టుగా ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. 2011 మార్చి-2012 మార్చి మధ్యలో ఏర్పాటు చేసిన పెళ్ళిళ్లకు గాను మష్రూ దంపతులు 10 వేల నుంచి 20 వేల అమెరికన్ డాలర్లు వసూలు చేసినట్లు కామన్వెల్త్ ప్రాసిక్యూటర్ ఎయిమీ ఎస్తోర్ప్ ఆరోపించారు. వారిపై ఆరోపణలకు సాక్ష్యంగా కొన్ని బ్యాంకు స్టేట్మెంట్లు, మ్యారేజీ సర్టిఫికెట్లు కోర్టు ముందుంచారు. ఈ మొత్తం వ్యవహారంలో గౌడ ఎక్కువ లబ్ది పొందినట్టు ఆమె చెప్పారు. న్యాయవిద్యార్థి అరుున మష్రూ తన మైగ్రేషన్ ఏజెంట్ లెసైన్స్ గడువు గత ఏడాదిలో ముగిసినప్పటికీ రెన్యువల్ చేసుకోలేదని సమాచారం.