డూప్లికేట్లకు కటకటాలు
మోసాలకు పాల్పడుతున్న
ఇద్దరు సోమాలియన్ల అరెస్టు
నకిలీ స్టాంప్‌లు, ఫోర్జరీ డాక్యుమెంట్ల స్వాధీనం
గోల్కొండ: నకిలీ వీసాలు, స్టే పర్మిట్లు, డూప్లికేట్ పాస్‌పోర్టులు తయారు చేస్తూ.. ఎంతో మంది అమాయకులను మోసం చేసిన ఇద్దరు సోమాలియన్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు బుధవారం వెల్లడించారు. సోమాలియాలోని మగధీషుకు చెందిన అబ్ది రహ్మాన్ ఇబ్రహీం లిబాన్ (25) పాస్‌పోర్టు లేకుండా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అదే దేశానికి చెందిన అబ్ది రహ్మాన్ అబూకర్ హాజీ ఉస్మాన్ (22) నగరంలో ఉంటూ రామోజీ ఫిలింసిటీ సమీపంలోని సెయింట్ మేరీ కళాశాలలో ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతనికి హుమాయూన్‌నగర్‌లో నివ సించే అనుమతి ఉండగా.. దీనికి విరుద్ధంగా విజయనగర్ కాలనీలో ఉంటున్నాడు. 2009లో ఇక్కడకు వచ్చిన హాజీ ఉస్మాన్ ఓమన్‌లో హైస్కూల్ విద్య, నిజాం కళాశాలలో బీఎస్సీ పూర్తి చే సి 2013లో సోమాలియా వెళ్లిపోయాడు. మళ్లీ తిరిగి వచ్చి ఎంబీఏ చదువుతున్నాడు. అనంతరం హైదరాబాద్‌లో జతకట్టిన వీరిద్దరూ ఆదాయం కోసం అక్రమ మార్గాలు పట్టారు. సోమాలియాతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చేవారికి నకిలీ పాస్‌పోర్టులు, వీసాలు, స్టే పరిమిట్లు ఇస్తూ అందిన కాడికి దండుకుంటూ జల్సాలు చేస్తున్నారు.
అనుమానం వచ్చిన పోలీసులు వీరి కార్యకలాపాలపై నిఘా పెట్టారు. ఈ నెల 14న ఎన్‌ఎంఈసీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఉస్మాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతనిచ్చిన సమాచారం మేరకు బుధవారం లిబాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ పత్రాల కుంభకోణం బయటపడింది. ఇబ్రహీం లిబాన్ వద్ద నుంచి నకిలీ ఫారినర్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ బెంగళూరు, వీసా ఎక్స్‌టెన్షన్ రబ్బర్‌స్టాంప్, సింగిల్ ఎంట్రీ వీసా ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ బీఐఓ బెంగళూరు, డబుల్ ఎంట్రీ రబ్బర్ స్టాంప్‌తో పాటు సన్‌షైన్ ఆస్పత్రి రబ్బర్‌స్టాంప్, సేలం మెడికల్ కాలేజ్, లఫోలే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రబ్బర్‌స్టాంప్, హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రబ్బర్ స్టాంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఉస్మాన్ నుంచి స్టే వీసా ఫోర్జరీ డాక్యుమెంట్, ల్యాప్‌ట్యాప్, పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరినీ రిమాండ్‌కు తరలించారు. కేసును హుమాయూన్‌నగర్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రవీందర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు బి. కరుణాకర్‌రెడ్డి, పి. నందకిషోర్‌రావు దర్యాప్తు నిర్వహించారు.