నకిలీ వీసా స్టాంపింగ్‌ రాకెట్‌ గుట్టురట్టు | Fake Visas Giving Gang Arrested In Hyderabad | Sakshi
Sakshi News home page

నకిలీ వీసా స్టాంపింగ్‌ రాకెట్‌ గుట్టురట్టు

Published Sat, Feb 15 2020 11:14 AM | Last Updated on Sat, Feb 15 2020 1:27 PM

Fake Visas Giving Gang Arrested In Hyderabad  - Sakshi

స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువులను చూపుతున్న సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌ : నకిలీ వీసా స్టాంపింగ్‌లతో మహిళలను కువైట్‌కు తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఆర్‌జీఐఏ పోలీసులు, శంషాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు పక్కా సమాచారంతో నకిలీ వీసా స్టాంపింగ్‌ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ వివరాలు వెల్లడించారు.  పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు పట్టణానికి చెందిన రెల్లు కుబెందర్‌ రావు అలియాస్‌ చిన్న హమాలీగా పని చేసేవాడు. ఆ తర్వాత వెల్డింగ్‌ పని నేర్చుకున్న అతను 2007 నుంచి 2014 వరకు  సింగపూర్, సౌతాఫ్రికాలో పని చేశాడు.

2016లో నర్సరావుపేటలో పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించిన అతను కమీషన్‌పై చెన్నైకి చెందిన ఎన్‌బీఎస్‌ ట్రావెల్స్‌లో ఎయిర్‌ టికెట్‌ బుకింగ్‌ చేసేవాడు. ఇందుకుగాను అతడికి  చెన్నై, కుంభకోణం ప్రాంతానికి చెందిన షేక్‌ బషీర్‌ అహ్మద్‌ సహాయకుడిగా పని చేసేవాడు. తరచు శ్రీలంక వెళ్లే బషీర్‌ అక్కడ కుమార్‌ అనే వ్యక్తి నుంచి ఒరిజనల్‌ స్టాంపులు తెచ్చేవాడు. అనంతరం వాటి ఆధారంగా కుబెందర్‌రావు, బషీర్, కుంభకోణంకు చెందిన బాలు ప్రసాద్‌తో కలిసి   శంషాబాద్‌లోని ఓ హోటల్‌లో నకిలీ వీసాలు తయారు చేసేవారు.  

నకిలీ వీసాలతో దుబాయికి.. 
ఈ నకిలీ స్టాంప్‌ల ఆధారంగా బాలుప్రసాద్‌ నకిలీ పీఓఇ, ఇసీఆర్, మెడికల్‌ సర్టిఫికెట్లు రూపొందించేవాడు. అనంతరం సబ్‌ ఏజెంట్ల ద్వారా తమను సంప్రదించిన మహిళలను విజిటింగ్‌ వీసాపై దుబాయ్, అక్కడి నుంచి కువైట్‌ పంపేవారు. కువైట్‌ చేరుకున్న వారికి లక్ష్మీ, శారద, శ్రీను, సారా అనే వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పించేవారు. ఇందుకు గాను  ఒక్కో మహిళ నుంచి రూ. లక్ష వసూలు చేసేవారు. ఇందులో కువైట్‌లో ఉండే ఏజెంట్లకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఇచ్చేవారు. ఇదే తరహాలో 21 మందిని కువైట్‌ పంపినట్లు సీపీ తెలిపారు. వారు ఎక్కడ పనిచేస్తున్నారో త్వరలోనే వివరాలు సేకరిస్తామన్నారు. ఈ విషయమై ఇప్పటికే కువైట్‌ ఎంబసీకి సమాచారం అందించామన్నారు. 

ప్రధాన నిందితులు  రెల్లు కుబెందర్‌రావు,  షేక్‌  బషీర్‌ అహ్మద్‌తో పాటు సబ్‌ ఏజెంట్లుగా వ్యవహరించిన మోహన్‌రావు, అగస్టీ, రుత్తమ్మ, సునీత, వెంకటరామకృష్ణలను పోలీసులు అరెస్టు చేశారు.  మరో నిందితుడు బాలు ప్రసాద్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు.  వారి నుంచి రూ.2 లక్షల నగదు, ప్రింటర్, లాప్‌ ట్యాప్, 15 మీ సేవా పత్రాలు, 16 పాస్‌ పోర్ట్‌లు, 13 వీసా పేపర్లు, 25 ఒరిజినల్‌ స్టాంపులు, 6 స్టాంప్‌ ప్యాడ్స్‌ స్వాదీనం చేసుకున్నారు. శ్రీలంకకు చెందిన కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటికి వస్తాయన్నారు. సమావేశంలో మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు, శంషాబాద్‌ డీసీపీ సందీప్‌కుమార్, ఏసీపీ అశోక్‌కుమార్, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి, ఆర్‌జీఐఏ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కుమార్, ఎస్‌ఐలు రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చదవండి: విస‘వీసా’ జారుతున్నాం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement