ఉద్యోగాలం | Net for the unemployed agents | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలం

Published Tue, Jun 24 2014 12:21 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

ఉద్యోగాలం - Sakshi

ఉద్యోగాలం

  • నిరుద్యోగులకు ఏజెంట్ల వల
  •  విదేశీ ఉద్యోగాల పేరిట టోకరా
  •  లక్షలు కాజేసి నకిలీ వీసాలు అందజేత
  •  విషయం తెలియక బాధితులు విలవిల
  •  ఇరాక్‌లో జిల్లా వాసులు చిక్కుకుపోవడంతో విషయం వెలుగులోకి..
  •  స్పందించని జిల్లా యంత్రాంగం
  • విశాఖపట్నం: విదేశాల్లో మంచి ఉద్యోగం.. వేలల్లో జీతం..విలాసవంతమైన జీవితం.. ఇలా నిరుద్యోగులకు ఏజెంట్లు ఆశ లు కల్పిస్తున్నారు. అందినంత గుంజుతున్నారు. నకిలీ వీసాలు, విజిటింగ్ వీసాలతో ఢిల్లీ, ముంబయి తీసుకెళ్లి అక్కడ నుంచి విదేశాలకు విమానం ఎక్కించి చేతులు దులుపుకుంటున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసి నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు. తిరిగి వచ్చేందుకు డబ్బుల్లేక దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు.

    ఈ నెల 18న విశాఖ జిల్లాకు చెందిన 40 మంది యువకులను ఏజెంట్ ఇరాక్‌కు పంపాడు. అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఆ దేశంలోని నజాఫ్‌లో పనిలోకి తీసుకున్న కంపెనీ వీరిని ఓ కంటైనర్‌లో ఉంచింది. తిండీ, నీళ్లు లేక వారంతా ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. వారి స్నేహితులు ఆదివారం ఢిల్లీలోని సాక్షి కార్యాలయానికి వచ్చి గోడు వెలిబుచ్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

    ఇరాక్ వెళ్లేందుకు ఢిల్లీ వరకు వచ్చి ఏజెంట్ చేతిలో మోసపోయిన మరికొందరు విశాఖవాసులు తమను రాజమండ్రి సమీపంలోని రావులపాలెం మండలం ఓబలంక గ్రామానికి చెందిన మేడపాటి వెంకటకృష్ణ అనే ఏజెంట్ తమను మోసం చేశాడని, ఇరాక్‌లో ఉద్యోగాల పేరిట రూ.లక్షల్లో తీసుకున్నాడని సాక్షికి చెప్పారు. సుమారు రూ.60 లక్షల మేర తీసుకుని నకిలీ వీసాలు తమ చేతుల్లో పెట్టి చేతులు దులుపుకున్నాడని వాపోయారు. ఇరాక్‌లో చిక్కుకున్న తమ వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే భారత్‌కు చేర్చాలని బాధితుల కుటుంబ సభ్యులు, స్నేహితులు వేడుకుంటున్నారు.
     
    ఫిర్యాదులు అందలేదు
     
    విశాఖ జిల్లాకు చెందిన 40 మంది నిరుద్యోగులు ఇరాక్‌లో చిక్కుకున్నారని తెలిసినా జిల్లా యంత్రాంగంలో కదలిక లేదు. కనీసం వారెవరన్నది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కలెక్టర్ ఆరోఖ్యరాజ్ హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇతర అధికారులు ఈ విషయం పట్టించుకోలేదు. బాధిత కుటుంబాల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని జిల్లా ఎస్పీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంఘటన గురించే తమకు తెలియదని చెప్పడం విశేషం. బాధితుల నుంచి ఫిర్యాదు అందితేనే చర్యలు తీసుకుంటామని ఒక పోలీస్ అధికారి తెలిపారు. ఫిర్యాదులు అందితే భారత దౌత్య కార్యాలయానికి సమాచారమిస్తామని పేర్కొన్నారు.
     
    ఏజెంట్‌ను నమ్మి మోసపోయాం

    ‘మాది కశింకోటలోని గవరపేట...కూలి చేస్తే కానీ భుక్తి గడవని కుటుంబం. ఇద్దరు కుమారులు..పెద్ద వాడు ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. చిన్నవాడు బాపునాయుడిని ఏడో తరగతి వరకూ చదివించాం... గాజువాకలో ప్రైవేటుగా రూ.35 వేలు చెల్లించి వెల్డింగ్ నేర్పించాం.  దుబాయి పంపించాం. అక్కడ రెండేళ్లు వెల్డర్‌గా పనిచేసి పనిలేక తిరిగొచ్చేశాడు. కుటుంబాన్ని బాగు చేసుకోవాలంటే మళ్లీ విదేశానికి ఉపాధికి వెళ్లాలని భావించాడు.

    ఇరాక్‌లో ఉద్యోగం ఇప్పిస్తారని నమ్మి ఏజెంటు మేడిపాటి వెంకటకృష్ణకు రూ.లక్షన్నర అప్పు చేసి చెల్లించాం. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 30 మందితో కలిసి నాలుగు నెలల క్రితం బాపునాయుడిని ఇరాక్ పంపించాం. అక్కడికెళ్లగానే ఏజెంటు బ్యాంకు ఖాతాద్వారా లక్షన్నర రూపాయలు కాజేసి ఉద్యోగం ఇప్పించకుండా పంపేశాడు. అటు డబ్బులు పోయి, ఇటు ఉద్యోగం రాక మోసపోయాం.
     - పెంటకోట అప్పలసత్తి, లక్ష్మి, కశింకోట (బాధితుని తల్లిదండ్రులు)
     
    బాధితులను ఆదుకోవాలి
    ఇరాక్‌లో పని కోసం వెళ్లి చిక్కుకుపోయిన విశాఖవాసులను వెనక్కి రప్పిం చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇరాక్‌లో ఇబ్బందులు పడుతున్న బాధితులను ఆదుకోవాలి. టీడీపీ, బీజేపీ నేతలు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి.  
     - గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్‌సీపీ నేత
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement