
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, డిచ్‌పల్లి(నిజామాబాద్): పూజలతో గ్రహస్థితి బాగు చేస్తానంటూ మాయమాటలతో మహిళను నమ్మించి రూ.25 లక్షలకు పూజారి టోకరా వేసి అనంతరం పరారయ్యాడు. డిచ్‌పల్లి ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో ఉన్న శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కొంత కాలంగా శ్రీనివాస్ శర్మ పూజారి (అర్చకుడు)గా పని చేస్తున్నాడు. నిజామాబాద్ కంఠేశ్వర్ న్యూ హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన కొత్త మాధవీలత ఖిల్లా రోడ్‌లో షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఆమె భర్త గణేష్ పక్షవాతం, మనవరాలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మాధవీలత ధర్మారం(బి)లో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజారికి తన సమస్యలను ఏకరువు పెట్టుకుంది. మీ గ్రహస్థితి బాగలేదని, కొంత మంది భక్తులకు లడ్డూలతో భోజనాలు వడ్డిస్తే సమస్యలన్నీ తీరుతాయని నమ్మించాడు. మాయమాటలకు నమ్మిన మాధవీలత శ్రీనగర్‌లో రెండు ఎకరాల భూమి అమ్మగా వచ్చిన రూ.25 లక్షలనుదశల వారీగా పూజారికి ఇచ్చారు. మోసపోయానని గ్రహించి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తడి తేవడంతో పూజారి శ్రీనివాస శర్మ మే 29 నుంచి కన్పించలేదు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment