నాగరాజు (ఫైల్ )
సాక్షి, నిజామాబాద్: రుణ దాత అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయగా భార్య మెడలోంచి పుస్తెల తాడు తీసిచ్చింది. అవమానం భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన నవతే నాగరాజు గంజ్‌లో గుమాస్తాగా పనిస్తాడు. వ్యాపారం నిమిత్తం శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర రూ. లక్ష 20 వేలు అప్పుగా తీసుకున్నాడు. లాక్‌డౌన్ కారణంగా వ్యాపారం సరిగా నడవకపోవడంతో నష్టాల పాలయ్యాడు.
అప్పు ఇచ్చిన శ్రీనివాస్ డబ్బులు చెల్లించాలంటూ నాగరాజ్‌ను ఒత్తిడికి గురిచేస్తూ.. పలుసార్లు ఇంటికి వెళ్లి నిలదీశాడు. నాగరాజు బైక్‌ను కూడా లాక్కొని వెళ్లాడు. బుధవారం శ్రీనివాస్ మరొకరితో కలిసి డబ్బులు చెల్లించాలని నాగరాజును ఇంటి వద్ద నిలదీశాడు. దీంతో నాగరాజు భార్య అఖిల తన భర్తను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తన మెడలోని బంగారు గొలుసు పుస్తెల తాడును తీసి శ్రీనివాస్‌కు ఇచ్చింది. అతను పూస్తెలతాడును తీసుకెళ్లాడు. దీంతో నాగరాజు తీవ్ర మనస్తాపం చెంది బెడ్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.
ఎంతకూ తలుపు తీయకపోవడంతో భార్య అఖిల ఇంటి యజమానిని తీసుకువచ్చి తలుపులు పగులగొట్టించింది. నాగరాజు ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. ఆగ్రహం చెందిన మృతుని బంధువులు అప్పుల పేరిట వేధించిన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మూడో టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట కొద్దిసేపు బైఠాయించారు. ఫిర్యాదు మేరకు నిందితుడు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment