సాక్షి, కృష్ణా జిల్లా : రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఏకకాలంలో అన్ని తహసీల్దార్, మున్సిపాలిటీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల రెవెన్యూ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం రెవెన్యూ అధికారులను, సిబ్బందిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. మండల తహసీల్దార్ టీ.చంద్రశేఖర్ నాయుడును అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు అతని నుంచి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. (అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్)
రెవెన్యూ కార్యాలయంతో పాటు, అధికారుల వాహనాలను స్వాధీనం చేసుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్ చంద్రశేఖర్ నాయుడు కారులో రెండు లక్షరూపాయలు డిప్యూటీ తహసీల్దార్ కారులో లక్ష రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు మీడియాకు వివరిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో మహేశ్వర రాజు, హ్యాపీ కృపానందం, నజీరుద్దిన్ బృందం పాల్గొన్నారు. (తెలుగు తమ్ముళ్ల వీరంగం, కెమెరాలో రికార్డు)
గుంటూరు: రాజుపాలెం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పాస్ పుస్తకాల మంజూరులో అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో సోదాలు నిర్వహిస్తున్నారు.
నెల్లూరు: గూడురు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కార్యాలయంలోని పలు రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.
కర్నూలు: ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. భారీగా లంచాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ డీఎస్పీ శివ నారాయణ తన సిబ్బందితో కలసి పట్టణంలోని పాత, కొత్త తహసీల్దార్ కార్యాలయాలపై దాడి చేశారు. పాత కార్యాలయం అడ్డాగా కొందరు వీఆర్‌వోలు అక్రమాలు చేస్తున్నారన్న ఫిర్యాదులు అందడంతో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ రామయ్యను కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. కార్యాలయానికి వచ్చిన వారి సమస్యలు ఆడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు సాయంత్రం తెలుపుతామన్నారు. అలాగే రేషన్ డీలర్లను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
శ్రీకాకుళం : జిల్లాలో పలు తహశీలార్ల కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. సంతకవిటి కార్యాలయంలో తనిఖీలు చేస్తుండగా వీఆర్‌వోలు, సిబ్బంది పరారయ్యారు.
అనంతపురం: కూడేరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. భూ రికార్డులకు సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది అవినీతిపై విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు
విజయనగరం: బలిజపేట తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
విశాఖ: కశింకోట రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. పలు రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment