సాక్షి, హైదరాబాద్: మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డిలపై వచ్చిన భూ ఆక్రమణ ఆరోపణలను రెవెన్యూ వర్గాలు నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై మరింత లోతుగా విచారించేందుకుగాను ప్రత్యేక అధికారిని కూడా ప్రభుత్వం నియమించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయనపై వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న రెవెన్యూ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోనికి వస్తుం డడం, స్థానికుల నుంచి సాక్ష్యాధారాలు కూడా లభిస్తుండడంతో ప్రత్యేకంగా విచారణ చేయించడం ద్వారా రేవంత్ అక్రమాలను పూర్తి స్థాయిలో వెలికితీయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే జరుగుతున్న విచారణలో రేవంత్ సోదరులిద్దరూ ప్రభుత్వ భూములు, చెరువులు, ప్రైవేటు భూములతోపాటు రోడ్లను కూడా వదల్లేదని వెల్లడయినట్టు తెలుస్తోంది. వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అధికార వర్గాలందించిన సమాచారం ప్రకారం... గోపనపల్లి గ్రామంలోని సర్వేనెంబర్ 34లో ఎకరా 11 గుంటలు, సర్వే నెం 126, కోమటికుంటలో ఎఫ్‌టీఎఫ్ బఫర్‌జోన్‌లో ఎకరా 14 గుంటల భూమిని రేవంత్ సోదరులు కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. ఈ భూముల ఆక్రమణలతో చెరువులోకి నీళ్లు రాకుండా రేవంత్ అడ్డుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంలో రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, వాల్టా చట్టాన్ని, తెలంగాణ రెవెన్యూ ఫస్లీ చట్టాన్ని ఉల్లంఘించారనేందుకు తగిన ఆధారాలు కూడా రెవెన్యూ విచారణలో వెలుగులోకి వస్తున్నట్టు సమాచారం. గోపనపల్లి సర్వే నెంబర్ 127లో ఐదెకరాల 21 గుంటల భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ చేయించుకున్నారని, సర్వే నెంబర్ 128, 160లలో 10 గుంటల ప్రైవేటు స్థలాన్ని కబ్జా చేశారని, సర్వే నెంబర్ 127లో వందేళ్ల నుంచి ఉన్న బండ్ల బాటను కూడా వదలకుండా కబ్జా చేశారనే ఆరోపణలు రేవంత్ ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారాల్లో ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి డి.శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు అధికారుల పాత్ర కూడా ఉందని, అందులో ఒకరు మృతి చెందగా, మరొకరు రిటైర్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మరింత లోతుగా విచారణ జరిపించడం ద్వారా జరిగిన అక్రమాలన్నింటినీ బయటకు తీయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.
స్థానికుల ఆరోపణల ఆధారంగా..
గోపనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 127లో ఉన్న భూమిలో కొంత భాగాన్ని రేవంత్‌రెడ్డి ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూమిని ఓ వ్యక్తి నుంచి కొన్నట్టుగా నకిలీ పత్రాలు సృష్టించారని కొందరు, తమ పేరిట మ్యుటేషన్ చేసినందుకు డబ్బులిస్తామని చెప్పి ఇవ్వలేదని కొందరు ఆరోపిస్తున్నారు. స్థానికులు కొందరు ఈ విషయంలో కోర్టును ఆశ్రయించగా స్టేటస్‌కో ఉత్తర్వులు వచ్చాయని అంటున్నారు. అయితే, ఈ విషయంపై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్.. తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా ఈ భూమి మ్యుటేషన్ జరిగిందని నిర్ధారించి సీఎస్‌కు నివేదిక ఇచ్చారు. తప్పుగా రికార్డుల్లో నమోదు చేశారని, తప్పుడు మ్యుటేషన్లు చేశారని ఆ నివేదికలో కలెక్టర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ భూమితో పాటు ఇతర ఆరోపణలపై కూడా ప్రత్యేక అధికారి చేత విచారణ జరిపించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment