బెట్టింగ్‌రాయుళ్ల ఒత్తిళ్లతో వ్యక్తి ఆత్మహత్య | Man Commits Suicide After Bet Loss In Prakasam | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌రాయుళ్ల ఒత్తిళ్లతో వ్యక్తి ఆత్మహత్య

Published Fri, Sep 6 2019 8:02 AM | Last Updated on Fri, Sep 6 2019 9:53 AM

Man Commits Suicide After Bet Loss In Prakasam - Sakshi

వెంకటేశ్వరరెడ్డి మృతదేహం

సాక్షి, గుంటూరు రూరల్‌ : బెట్టింగ్‌ రాయుళ్ల ఒత్తిళ్లతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని అంకిరెడ్డిపాలెంలో గురువారం వెలుగులోకి వచ్చింది. నల్లపాడు సీఐ కె.వీరాస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వాకా వెంకటేశ్వరరెడ్డి (40) అలియాస్‌ పిల్లారెడ్డి మిర్చియార్డులో కమీషన్‌ కొట్టు ద్వారా తన అన్నతో కలిసి వ్యాపారం చేస్తుండేవాడు. పదేళ్ల కిందట నగరంలోని హౌసింగ్‌ బోర్డుకు నివాసాన్ని మార్చుకున్నాడు. ఈ క్రమంలో బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. ఏడాది క్రితం బెట్టింగ్‌లో మధ్యవర్తిత్వం చేస్తూ పల్నాడు, మిర్చియార్డు తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల నుంచి నగదును బెట్టింగ్‌ కోసం వసూలు చేశాడు. ఆ నగదును మార్కాపురానికి చెందిన సానికొమ్ము సుబ్బారెడ్డి అనే వ్యక్తితో బెట్టింగ్‌ పెట్టి సుమారు రూ.1.75 కోట్లు ముట్టజెప్పాడు.

ఈ క్రమంలో బెట్టింగ్‌లలో ఓడిపోయాడు. అనంతరం వెంకటేశ్వరరెడ్డి వద్ద బెట్టింగ్‌ పెట్టిన వ్యక్తులు బెట్టింగ్‌లో తాము గెలిచినందున నగదు ఇవ్వాలని వెంకటేశ్వర్‌రెడ్డిని ఒత్తిడి చేశారు. వెంకటేశ్వర్‌రెడ్డి సుబ్బారెడ్డిని ఒత్తిడి చేశాడు. సుబ్బారెడ్డి ఎంతకూ తిరిగి నగదు ఇవ్వక పోవడంతో మార్కాపురంలో సుబ్బారెడ్డిపై వెంకటేశ్వర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆతడిని పిలిపించి సుబ్బారెడ్డి నుంచి సుమారు కోటి రూపాయల వరకూ తిరిగి ఇప్పించారు. మిగిలిన రూ.75 లక్షల్లో వెంకటేశ్వర్‌రెడ్డి సుమారు రూ.20 లక్షలకుపైగా తన ఆస్తులను అమ్ముకుని బెట్టింగ్‌ రాయుళ్లకు ముట్ట జెప్పాడు. మిగిలిన వ్యక్తులు నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్న తరుణంలో నగదుకు వడ్డీ కలిపి మరింత పెరిగింది.

ఈ క్రమంలో మిగిలిన నగదు ఇవ్వాలని వెంకటేశ్వర్‌రెడ్డి సుబ్బారెడ్డిని కోరగా ఆయన తప్పించుకుని తిరుగుతున్నాడు. వెంకటేశ్వర్‌రెడ్డి వద్ద బెట్టింగ్‌ పెట్టిన వ్యక్తులు తమకు రావాల్సిన నగదుకు వడ్డీతో కలిపి వెంటనే ఇవ్వాలని ఒత్తిడి చేయటం ప్రారంభించారు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం ఉదయం స్థానిక బార్‌లో మద్యం తీసుకుని అంకిరెడ్డిపాలెం సమీపంలోని పొలాల్లోకి వెళ్లి మద్యంలో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు కారణం బెట్టింగ్‌ పెట్టిన వ్యక్తులు, సుబ్బారెడ్డి కారణమని సూసైడ్‌ లెటర్‌ సైతం రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి భార్య కొండమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement