మృతుడు నారాయణరెడ్డి
సాక్షి, కనిగిరి: మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో అందె వెంకట నారాయణరెడ్డి (50) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇదే ప్రమాదంలో ఆయన కారు డ్రైవర్, అంటెండర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కనిగిరి మండలం చల్లగిరిగిల్ల సమీపంలోని ఎస్సీ కాలనీ వద్ద గురువారం ఉదయం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. నారాయణరెడ్డి మార్కాపురం చెన్నకేశవస్వామి ఆలయ రెగ్యులర్ ఈవోగా, వెలుగొండ దేవాలయాల గ్రూపు, భైరవకొన, కనిగిరి గ్రూపు దేవాలయాలకు ఇన్‌చార్జి ఈవోగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. నారాయణరెడ్డి కారులో కనిగిరి నుంచి మార్కాపురానికి బయల్దేరారు.
కనిగిరి మండలం చల్లగిరిగిల్ల సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎస్సీ కాలనీ వద్ద చప్టాను ఢీకొంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఈవో ఏవీ నారాయణరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ ముప్పూరి సాయి తేజకు కాలు విరిగింది. అటెండర్ మల్లికార్జున్ తలకు బలమైన గాయాలయ్యాయి. క్షతగ్రాతులను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. ఈ మేరకు ఎస్‌ఐ జి.శివన్నారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
నేరుగా వెళ్లి ఉంటే మృత్యువు తప్పేదేమో?
ఉద్యోగరీత్యా కనిగిరి ఏరియాలోని దేవాలయలకు ఇన్‌చార్జి ఈవోగా పనిచేస్తున్న నారాయణరెడ్డి నాలుగు రోజులుగా కనిగిరిలోనే ఉంటున్నారు. బుధవారం ఉదయం దేవదాయ శాఖ కమిషనర్ పద్మతో కలిసి భైరవకొన ప్రాంత అభివృద్ధి పనుల పరిశీలనకు వెళ్లారు. రాత్రి బాగా పొద్దు పోవడంతో కనిగిరిలోనే బస చేశారు. ఈ క్రమంలో గురువారం ఉదయాన్నే కారులో మర్కాపురం బయల్దేరారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత గదిలో ఏటీఎం కార్డు మరిచిపోయినట్లు గుర్తుకొచ్చి వెంటనే కారును ఆపి వెనక్కి తిరిగి కనిగిరి వచ్చారు. నారాయణరెడ్డి తన గదిలో ఉన్న ఏటీఎం కార్డు తీసుకుని తిరిగి మార్కాపురం బయల్దేరారు. మార్గమధ్యంలో చల్లగిరిగిల్ల వద్ద మృత్యు ఒడికి చేరారు.
తిరిగి వెళ్లకుండా కనిగిరిలోనే ఆగి ఉన్నా.. లేకా తిరిగి వెనిక్కి రాకుండా మార్కాపురం వెళ్లి ఉన్నా మృత్యు ఘడియలు తప్పేవేమోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. నిన్నటి వరకు కనిగిరిలో ఈవోగా పనిచేస్తూ ఇటీవల బదిలీల్లో మార్కాపురం వెళ్లిన ఏవీ నారాయణరెడ్డి అందరికి సుపరిచుతుడే. స్నేహశీలిగా పేరొందారు. నారాయణరెడ్డి మృతదేహాన్ని పలువురు నాయకులు, అధికారులు సందర్శించి ఘన నివాళులర్పించారు. సంఘటన స్థలాన్ని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నారాయణరెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నారాయణరెడ్డి మృతదేహానికి త్వరగా పోస్టుమార్టం నిర్వహించాలని ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment