తలను గోడకేసి కొట్టటంతో తీవ్రంగా గాయపడిన సుబ్బరాజమ్మ (ఫైల్)
ప్రకాశం, చీమకుర్తి రూరల్: వంటగదిలో వంట చేసుకుంటున్న వృద్ధురాలు చేబ్రోలు ధనలక్ష్మిపై అగంతకుడు బలమైన ఆయుధంతో తలపగలకొట్టాడు. రెండు బంగారు గొలుసులు, చేతులకున్న ఆరు గాజులు తీసుకొని దొంగ పట్టపగలు పారిపోయాడు. గతేడాది పట్టణంలోని మెయిన్ రోడ్డుకు సమీపంలో ఉన్న కొత్తపేట బజారులో జరిగిన సంఘటన అప్పట్లో స్థానికుల్లో కలవరం పుట్టించింది. అదే బజారుకు ఎదురుగా ఉన్న పాత పోలీసుస్టేషన్ బజారులో ఇంట్లో ఉన్న మరో వృద్ధురాలు పోకూరి సుబ్బరాజమ్మ తల గోడకేసి కొట్టి మెడలో ఉన్న బంగారు దండ, చేతులకున్న నాలుగు గాజులను దొంగలు లాక్కొని వెళ్లిన సంఘటన ఇప్పటికీ ఆ బజారులో నివశించే వారి మదిలో చెరిగిపోని పీడకలగా గుర్తుండిపోయింది. సూదివారి బజారులో పోకూరి తిరుపతమ్మ నడిచి ఇంటికి వెళ్తున్న సమయంలో పట్టపగలే ఆమె మెడలో ఉన్న 3 సవర్ల దండను లాక్కొని పారిపోతే దిక్కుమొక్కూ లేదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. చీమకుర్తిలో జరిగిన నేరాల చిట్టా శాంతాడంత. రెండు రోజుల క్రితం చీమకుర్తిలోని కోటకట్ల వారి వీధిలో అతి కిరాతకంగా దంపతులను దారుణంగా హత్య చేసి ఇంట్లో 30 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకుపోవడం జిల్లాలోనే సంచలనం సృష్టించింది. అప్పుడెప్పుడో 2015లో నాగులుప్పలపాడు మండలంలో వృద్ధ దంపతులను ఒకేసారి గొంతులు కోసి చంపారనే వార్త అప్పట్లో దావానలంలా వ్యాపించటంతో నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. అలాంటి క్రూర సంఘటనలు మరిచిపోతున్న తురణంలో ఇలా దంపతుల దారుణమైన హత్యలతో చీమకుర్తి నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
ఇవి..మచ్చుకు కొన్నే
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 13 సంఘటనలు జరిగినట్లు పోలీసుస్టేషన్లలో రికార్డులు ఉన్నాయి. పోలీసుల నుంచి సేకరించిన ఆధారాల ప్రకారం బూదవాడలో ఓ లారీ అపహరణకు గురైంది. నాలుగు మోటర్ సైకిళ్లు మాయమయ్యాయి. హరిహరక్షేత్రంలో ఇటీవల జరిగిన కుంభాబిషేకంలో రెండు మూడు రోజుల్లో ఆరు సంఘటనల్లో పలువురుకు చెందిన దాదాపు రూ.2.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. గతేడాది చీమకుర్తి మెయిన్ రోడ్డులో మాజేటి సత్యనారాయణ దుస్తుల దుకాణంలో రూ.2 లక్షల విలువ చేసే బంగారు దండను లాక్కొని వెళ్లారు. ఆంధ్రా బ్యాంక్ ఎదుట ఉన్న ఇంట్లో పోలీసుస్టేషన్‌కు పక్క వీధిలోనే సుమారు రూ.2 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఇంటి తలుపులు పగలకొట్టి తీసుకెళ్లారు. పోలీసుస్టేషన్‌కు సమీపంలోనే ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఒకరి ఇంట్లో దొంగలు 2 సవర్ల బంగారం, రూ.26 వేల నగదు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
అన్నిటికంటే ముఖ్యంగా చీమకుర్తిలోని హిమగిరి కాలనీకి చెందిన 8 మంది యువకులు చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు ప్రాంతాల్లో మహిళలపై ఆఘాయిత్యాలకు పల్పడటం, వంటిపై ఉన్న నగలు దోచుకోవడం, అడ్డం తిరిగిన మహిళలను వాడుకోవడం, కుదరకపోతే లేపేయడం వంటి నేరాలు చేసి అడ్డంగా దొరికి జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చీమకుర్తిలో ఏటికేడు పెరుగుతూ నేరాలకు అడ్డాగా మారటాన్ని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రానైట్ వనరులు పుష్కలంగా ఉండటం, ఆదాయ వనరులు పెరగటం, దేశంలోని ఏనిమిది రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్మికులు చీమకుర్తి, దాని పరిసర ప్రాంతాల్లోనే నివశిస్తుండటంతో దొంగలకు, దొంగలు కాని వారికి మధ్య వ్యత్యాసాలు గమనించకపోవడంతో లేనిపోని అరాచకాలు జరిగేందుకు అవకాశం ఎక్కువుగా ఉందని స్థానికులు వాపోతున్నారు. బంగారు దోచుకోవడమే కాకుండా చివరకు ప్రాణాలను కూడా అతి కర్కశకంగా తీసేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
సీసీ కెమెరాలు పెట్టినా ఫలితం లేదు:నేరాలు అదుపు చేసేందుకు చీమకుర్తి పట్టణం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా నేరాలు తగ్గడం లేదు. ఇటీవల బార్యాభర్తలను దారుణంగా చంపడం స్థానికుల్లో భయాందోళనలు కలిగించాయి. పోలీసుల నిఘా పెంచాల్సిన అవసరం ఉంది.బి.మల్లికార్జున, చీమకుర్తి
3రౌండ్‌ది క్లాక్ గస్తీ:చీమకుర్తిలో వరుసగా జరుగుతున్న సంఘనలను దృష్టిలో ఉంచుకొని ముఖ్య ప్రాంతాల్లో రౌండ్‌ది క్లాక్ గస్తీ పెంచుతున్నాం. ఇప్పుడున్న కెమెరాలతో పాటు మరికొన్ని కెమెరాలు కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దంపతుల దారుణ హత్యలకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నాం. త్వరలో నిందితులను పట్టుకుంటాం.జీవీ చౌదరి, ఎస్‌ఐ, చీమకుర్తి
Comments
Please login to add a commentAdd a comment