భార్య, పిల్లలతో జగన్
ప్రకాశం , కంభం: కంభంలో సంచలనం రేకెత్తించిన అర్ధవీడు మండలం నాగులవరానికి చెందిన నులక జగన్ కిడ్నాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. జగన్ కిడ్నాప్ వ్యవహారంలో కంభం మండలం ఎల్.కోటకు చెందిన వైద్యుడు, ఓ కొత్త పార్టీ నేత హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డు తొలగించుకునేందుకు ఆయన భార్య.. ఆ డాక్టర్‌తో కలిసి పథకం ప్రకారం కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందిన సమాచారం ప్రకారం.. జగన్ జేసీబీలు, ట్రాక్టర్‌లు, డ్రోజర్లు అద్దెకిస్తూ పిల్లలను చదివించుకునేందుకు స్వగ్రామం నుంచి వచ్చి కంభంలో భార్య రజనితో కలిసి నివాసం ఉంటున్నాడు. కిడ్నాపైన జగన్ భార్యతో ఆ డాక్టర్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముందుగా సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం.. మంగళవారం రాత్రి వైద్యుడి బంధువు జగన్ ఇంటికి వచ్చాడు. ఆయన తాను కర్నూలులో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నానంటూ పరిచయం చేసుకొని డాక్టర్‌కు నీకు మధ్య ఉన్న సమస్యను చర్చల ద్వారా పరిష్కరిస్తానని నమ్మించి తనతో పాటు కారులో బయటకు తీసుకెళ్లాడు.
ఈ విషయం సీసీ టీవీ పుటేజీల ఆధారంగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మార్గంమధ్యలో వైద్యుడు కారులో ఎక్కినట్లు తెలిసింది. రావిపాడు రోడ్డు మీదుగా గొట్లగట్టు వైపు వెళ్లే మార్గంలో వెళ్లినట్లు సమాచారం. వైద్యుడు బుధవారం తెల్లవారు జామున తిరిగి జగన్ ఇంటికి వెళ్లి వచ్చినట్లు బయట ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మధ్యాహ్నం వరకు జగన్ కనిపించక పోవడంతో ఆయన తండ్రి నారాయణరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న ఎస్‌ఐ శ్రీహరి సీసీ టీవీ పుటేజీలు, కాల్‌డేటా ప్రకారం వైద్యుడే కిడ్నాప్‌నకు పథకం రచించాడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బుధవారం రాత్రి పోలీసులు వైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బందిని తమదైన శైలిలో విచారించగా వైద్యుడు గుంటూరులో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు డాక్టర్‌ను పట్టుకొని పెద్దారవీడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. జగన్ భార్యను కూడా పెద్దారవీడు పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ఇద్దరినీ విచారించారు. డాక్టర్ బంధువు, కానిస్టేబుల్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారిస్తున్నట్లు సమాచారం. జగన్‌కు ఇద్దరు కుమరులు ఉన్నారు. కంభం, అర్ధవీడు పరిసర ప్రాంతాల్లో జగన్‌కు సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరుంది. విషయం తెలుసుకున్న అన్ని సామాజిక వర్గాల ప్రజలు అయ్యో పాపం..అంటున్నారు. అనుమానితులను కంభం, పెద్దారవీడు పోలీసుస్టేషన్‌లలో విచారిస్తున్నారన్న సమాచారం రావడంతో జగన్ బంధువులు, గ్రామస్తులు, మిత్రులు భారీ స్థాయిలో ఆయా పోలీసుస్టేషన్‌ల వద్దకు చేరుకున్నారు.
ప్రత్యేక బలగాల మోహరింపు
ఈ నేపథ్యంలో కంభంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ శ్రీహరి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించారు. స్థానిక వెంకట రమణ హాస్పిటల్ వద్ద, వైజంక్షన్, కందులాపురం సెంటర్, పోలీసుస్టేషన్ సమీపంలో పోలీసులు మోహరించారు. జగన్ బంధువులు కోపంతో ఎటువంటి ప్రతీకార చర్యలకు పాల్పడకుండా పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment