స్వాధీనం చేసుకున్న బైకులను పరిశీలిస్తున్న పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా
సాక్షి, విశాఖపట్నం, ప్రకాశం : విశాఖ జిల్లాలో మోటర్ బైక్‌లు దొంగతనం చేస్తున్న ముఠాను నగర పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా పరచూరు మండలం దేవరాపల్లి గ్రామానికి చెందిన 37 ఏళ్ల వెలగ వీరయ్య చౌదరి ఇంటర్ చదివిన తర్వాత జల్సాలకు అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. 2005లో హైదరాబాద్‌లోని ఓ కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ కంప్యూటర్లు దొంగతనం చేసిన కేసులో జైలుకు వెళ్లాడు. జైలులో బైక్ మెకానిక్‌లైన పాత నేరస్తులతో పరిచయాలు పెంచుకున్న వీరయ్య విడుదలయ్యాక హైదరాబాద్‌లో బైక్ మెకానిక్‌గా పనిచేస్తూనే దొంగతనాలకు పాల్పడేవాడు. అక్కడి నుంచి 2011లో విశాఖ జిల్లాకు వచ్చి నగర శివార్లలో బైక్ మెకానిక్‌గా పనిచేసేవాడు. పలు ప్రాంతాల్లో పార్క్ చేసిన బైక్‌లను మారు తాళాలతో దొంగిలించడం ప్రారంభించాడు. అతనితో పాటు విశాఖకు చెందిన రాజన నాగేశ్వరరావు(32), ఒడిసా వాసి డొక్కినపల్లి బాబీ (37) కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడేవారు.
ఒకే కంపెనీకి చెందిన బైకులే లక్ష్యం..
ఒకే కంపెనీకి చెందిన బైకులు మాత్రమే దొంగిలించడం వీరి ప్రత్యేకత. దొంగిలించిన బైక్‌ల స్పేర్‌పార్టుల్ని విడదీసి అమ్ముకొని సొమ్ము చేసుకునేవారు. కమిషనరేట్ పరిధిలో ఏటా బైక్ దొంగతనాల కేసులు పెరుగుతుండటంతో కమిషనర్ ఆర్కే మీనా ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 8న స్టీల్‌ప్లాంట్ పరిధిలో బైక్ పోయిందంటూ ఒక వ్యక్తి ఫిర్యాదు చెయ్యడంతో పహరా కాసిన స్పెషల్ టీమ్ ఈ నెల 11న పరవాడలో ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన పోలీసులకు ఆరేళ్లుగా చేస్తున్న దొంగతనాల గురించి, దొంగిలించిన బైక్‌లను ఏయే ప్రాంతాల్లో దాచి పెట్టారో వివరించడంతో వాటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైక్‌లతో పాటు రూ.90 వేల నగదు, 5 బైక్ ఇంజిన్లు, రూ.5,01,000 విలువచేసే 167 చ.గజాల స్థలం డాక్యుమెంట్లు, 30 బాక్సుల బైక్‌ల విడిభాగాలు, నకిలీ నంబర్ ప్లేట్లు, తాళాలు స్వాధీనం చేసుకున్నారు.
కమిషనరేట్‌లో గురువారం మీడియా సమావేశంలో కమిషనర్ ఆర్కే మీనా చోరీల వివరాలు వెల్లడించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో 2002 నుంచి 2011 మధ్య కాలంలో ఏకంగా 118 నేరాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం కలిగి ఉన్నట్లు తమ విచారణలో తేలిందని సీపీ వివరించారు. 2013 నుంచి ఇప్పటి వరకు విశాఖ జిల్లాలో 130 బైక్ చోరీ కేసులు వీరయ్య చౌదరిపై నమోదయ్యాయని సీపీ వివరించారు. ముగ్గురు నిందితులతో పాటు స్పేర్‌పార్టులు కొనుగోలు, అమ్మకాలు చేస్తున్న మరో 14 మందిని అరెస్టు చేసినట్లు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment