
కారులో నాగరాజు మృతదేహం నాగరాజు తాగిన పురుగుమందు
పది రోజుల క్రితం భార్య హైదరాబాద్‌లో ఆత్మహత్య
ప్రకాశం, కందుకూరు రూరల్: కుటుంబ కలహాలతో కారులో పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలో పంటవారిపాలెం రోడ్డు వద్ద శానంపూడి వెళ్లే రోడ్డులో ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. సింగరాయకొండ మండలం శానంపూడికి చెందిన కె.నాగరాజు (34) తన ఇద్దరు పిల్లలతో సొంత కారులో శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. పురుగుమందు కొనుగోలు చేసి ఓవీ రోడ్డులోని పంటవారిపాలెం రోడ్డు వద్ద శానంపూడి రోడ్డులోకి వెళ్లారు. రాత్రి కావడంతో కారులోనే పురుగుమందు తాగాడు. ఆ తర్వాత ఇద్దరి పిల్లలైన ఏడేళ్ల దివ్య రఘునంద్, ఐదేళ్ల సహస్త్రలను చంపేందుకు ప్రయత్నించాడు. అప్పటికే పురుగు మందు తాగిన నాగరాజు పిల్లలు కారు దిగడంతో అందులోనే ఉండిపోయాడు. కారు బయట కాసేపుండిన పిల్లలు నాన్న నిద్రపోతున్నాడులే అని వారు కూడా కారులో పడుకొని నిద్రపోయారు. తెల్లవారిన తర్వాత నాన్న ఎంతకూ లేవలేదు. నిద్రపోతున్నాడులే అనుకున్న చిన్నారులు కాసేపు రోడ్డు మీద తిరిగారు. ఎంతకూ నాన్న లేవకపోవడంతో ఓవీ రోడ్డు మీదకు వచ్చారు. కొందరు విద్యార్థులు కనిపించడంతో వారితో తమ బంధువులకు ఫోన్ చేయించారు. ఆ తర్వాత నాన్న కారులో ఉన్నాడని చెప్పడంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా నాగరాజు మృతదేహం కనిపించింది. కందుకూరు రూరల్ ఎస్‌ఐ కె.ప్రభాకర్‌రావు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.
నాన్న నిద్రపోయాడనుకున్నాం..
నాన్న తన గొంతుకు కండువా వేసి లాగాడని, అలాగే చెల్లి గొంతుకు కూడా వేసి లాగాడని మృతుడి కుమారుడు దివ్య రఘునంద్ చెప్పాడు. ఆ రాత్రి నాన్నతో పాటు తాము కూడా కారులోనే పడుకున్నామన్నారు. బాలుడు పూస గుచ్చినట్లు చెప్తున్న మాటలకు బంధువులు, చూపరులు కంటతడి పెట్టారు. పది రోజుల క్రితమే తల్లి వీణాకుమారి చనిపోయింది. తల్లిదండ్రులు మృతి చెందడంతో పిల్లలు అనాథలుగా మిగిలారని బంధువులు రోదిస్తున్నారు. భార్య మృతితో మనస్తాపం చెందే నాగరాజు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని బంధువులు చెబుతున్నారు.