
మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ ప్రభాకర్
ప్రకాశం, సతుకుపాడు (సింగరాయకొండ): కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను ఓ భర్త హతమార్చాడు. నల్లగట్ల రెడ్డెమ్మ (48)ను ఆమె భర్త కోటేశ్వరరావు హత్య చేసిన సంఘటన సోమవారం రాత్రి జరుగుమల్లి మండలం సతుకుపాడు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నల్లగట్ల కోటేశ్వరరావుకు ముగ్గురు భార్యలు. రెడ్డెమ్మ అతని రెండో భార్య. కొంతకాలంగా కోటేశ్వరరావు తన రెండో భార్య రెడ్డెమ్మను పట్టించుకోకుండా మూడో భార్యతోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. దీంతో రెడ్డెమ్మ నెల రోజుల క్రితం భర్తతో గొడవపడి దూరంగా ఉంటుంది. ఈ నేథ్యంలో సోమవారం రాత్రి రెడ్డెమ్మ వద్దకు వచ్చిన కోటేశ్వరరావు ఆమెతో మాట్లాడుతూనే కత్తితో పొడిచి చంపేశాడు. అయితే స్థానికుల కథనం మరో విధంగా ఉంది.
కోటేశ్వరరావు స్వతహాగా దొంగతనాలకు పాల్పడుతుంటాడని అనేక కేసుల్లో ముద్దాయి అని తెలిపారు. ఇతనికి ఇద్దరు భార్యలు కాగా రెడ్డెమ్మ మొదటి భార్య అని తెలిపారు. ఈమెకు పిల్లలు లేకపోవటంతో ఒక కుర్రాడిని పెంచుకుని వివాహం కూడా చేసింది. అయితే రెడ్డెమ్మ తన అన్న కొడుకుతో చనువుగా ఉండటంతో వారి ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో కోటేశ్వరరావు ఈ హత్యకు పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. రెడ్డెమ్మను కత్తితో పొడవగానే ఆమె బాధతో పెద్దగా కేకలు వేయడంతో ఇంటిలో ఉన్న కోడలు సుహాసిని వెంటనే తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పొలంలో కాపలాకి వెళ్లిన అతను హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో 108కు సమాచారం అందించారు. వారు వచ్చేసరికి సుమారు గంటకు పైగా సమయం పట్టింది. రెడ్డెమ్మను పరీక్షించి చనిపోయిందని ధ్రువీకరించుకుని వెనుతిరిగారని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని సింగరాయకొండ సీఐ బనగాని ప్రభాకర్, ఎస్‌ఐ సోమశేఖర్ పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు రిజిష్టరు చేసి దర్యాప్తు చేస్తున్నామని కోటేశ్వరరావు కోసం గాలిస్తున్నామని వివరించారు
Comments
Please login to add a commentAdd a comment