
మృతదేహాన్ని పరిశీలిస్తున్న టూటౌన్ ఎస్‌ఐ కోటయ్య
ప్రకాశం, చీరాల రూరల్: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం స్థానిక కారంచేడు రోడ్డులోని లారీ యూనియన్ కార్యాలయం ఎదుట చిల్లచెట్ల మధ్య ఉన్న కాలువలో వెలుగు చూసింది. మృతుని జేబులో దొరికిన ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు గుంటూరు జిల్లా లక్కరాజు గార్లపాడుకు చెందిన కట్టవరపు వీరాంజనేయులుగా గుర్తించినట్లు టూటౌన్ ఎస్‌ఐ కోటయ్య తెలిపారు. సుమారు 35 నుంచి 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం కారంచేడు రోడ్డులోని లారీ యూనియన్ కార్యాలయానికి ఎదురుగా చిల్లచెట్ల మధ్య కాలువలో పడి ఉందనే సమాచారంతో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించినట్లు ఎస్‌ఐ చెప్పారు.
మృతుని జేబులో ఆధార్ కార్డు దొరికిందని, దాని ఆధారంగా మృతుడు గుంటూరు జిల్లా లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన కట్టవరపు వీరాంజనేయులుగా గుర్తించినట్లు చెప్పారు. వీరాంజనేయులు మూడు రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని, మృతదేహం కుళ్లి దుర్వాసన వస్తున్నట్లు తెలిపారు. మృతదేహానికి సమీపంలో హెచ్‌డీ మద్యం సీసాతో పాటు పురుగుమందు సీసాను గుర్తించినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీఆర్వో జోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.