
విలపిస్తున్న మృతుడి భార్య లక్ష్మీప్రసన్న(ఇన్‌సెట్లో) ఆదినారాయణ (ఫైల్)
దర్శి (ప్రకాశం): పట్టణానికి చెందిన బంగారం వ్యాపారి ఒగ్గు వెంకట ఆదినారాయణ (37) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల 14వ తేదీన కిడ్నాపైన ఆదినారాయణ మృతదేహాన్ని త్రిపురాంతకం మండలం మేడపి సమీపంలో అన్నగారి చెరువు గట్టు కింద ముళ్ల చెట్లలో ఆదివారం ఉదయం గుర్తించారు. శరీరం పూర్తిగా చీకిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. మృతదేహంపై పెట్రోల్ పోసి కాల్చినట్లు తెలుస్తోంది. మృతుడి కుటుంబ సభ్యులను పోలీసులు ఆదివారం ఆ ప్రాంతానికి తీసుకెళ్లి ముళ్లచెట్లలో ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహానికి ఉన్న వాచ్, బెల్ట్, జేబులో ఉన్న గోల్డ్ షాపునకు చెందిన కొంత వరకు కాలిన చీటీల ఆధారంగా ఆదినారాయణ మృతదేహంగా కుటుంబ సభ్యులు, పోలీసులు నిర్ధారించుకున్నారు. మృతదేహం అక్కడికి ఎలా వచ్చింది, మృతదేహం సమాచారం ఎవరిచ్చారన్న విషయాలు పోలీసులు వెల్లడించలేదు. మృతదేహాన్ని చూస్తే నాలుగైదు రోజుల క్రితం చంపి పడేసినట్లుగా అర్థమవుతోంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని త్రిపురాంతకంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
హంతకుల కోసం గాలింపు
ఈ కేసులో హంతకుల ఆచూకీ పోలీసులకు తెలిసినట్లు సమాచారం. అందులో భాగంగా దర్యాప్తు చేస్తున్న మూడు టీమ్‌ల్లో ఒక టీమ్ హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. ప్రధాన నిందితుడు మండల పరిధిలోని పోతవరం గ్రామానికి చెందిన మల్లేశ్వరరావుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అనుమానితుడిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి అనే మరో వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ప్రధాన సూత్రదారి ఫోన్ నంబర్ కూడా పోలీసులు ట్రేస్ చేసినట్లు తెలుస్తోంది. ఆదినారాయణ ప్రయాణించిన కారును పామూరులో స్వాధీనం చేసుకున్నారు. పామూరులో ఆదినారాయణను హత్య చేసి మేడపి సమీపంలోని అన్నగారి చెరువు వద్దకి తీసుకెళ్లి పడేశారా..? లేక చెరువు వద్దే హత్య చేసి పడేశారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ కేసులో నేరస్తులు, సూత్రధారులను పట్టుకుంటేనే పూర్తి వివరాలు తెలుస్తాయి. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు ఆదినారాయన మృతి చెందిన వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. హత్యకు గురయ్యాడని తెలియడంతో బంధువుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment