పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయిల్ ట్యాంకర్ (ఫైల్)
ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు తమ పని పూర్తి చేసుకుంటున్నారు. శేషాచలం అడవుల నుంచి నెల్లూరు జిల్లా మీదుగా కోల్‌కతా, ఇటు నాలుగో నెంబరు జాతీయ రహదారి మీదుగా కర్ణాటకకు దుంగలను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు లారీలు, టెంపోల్లో తరలిస్తున్న దుండగులు ఇప్పుడు ఏ మాత్రం అనుమానం రాకుండా టమాటా లారీలు, ట్యాంకర్లు, కొరియర్ వాహనాలు, ఆంబులెన్స్‌లు, లగేజీ ఆటోల్లో దుంగలను తరలిస్తున్నారు. దీన్నిబట్టి వీరికి ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. పక్కా సమాచారం ఉంటే తప్ప పోలీసులు ఈ వాహనాలను గుర్తించలేకపోతున్నారు.
చిత్తూరు, పలమనేరు: కర్ణాటకాలోని కోలారు, బెంగళూరు, జిల్లాలోని మదనపల్లి, పలమనేరు ప్రాంతాల నుంచి నిత్యం వందలాది లారీల ద్వారా టమాటాల ను కలకత్తాకు ఎగుమతి అవుతున్నా యి. ఈ లారీలు ఎర్రచందనం దుంగల రవాణాకు సురక్షితమని భావించిన స్మగర్లు జిల్లా సరిహద్దులో కాపుకాచి డ్రైవర్లతో మాట్లాడుకుని టమాటా బా క్సుల కింద దుంగలను అమరుస్తున్నారు. మామూలుగా టమాటా లోడు తీసుకెళితే లారీ యజమానికి ఖర్చులు పోను రూ.పది వేలు మిగులు తోంది. ఎర్రచందనం దుంగలను టమాటాలతో కలిపి తీసుకెళితే రూ.5 లక్షలు మిగులుతుందనే ఆశ పడుతున్నారు. ఇటీవల పలమనేరు పట్టణా నికి చెందిన టమాటా లారీలో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా ఆత్మకూరు అటవీ శాఖ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే.
దురాశకు పోయి దొరికిపోతున్నారు
పలమనేరు, పుంగనూరు, వీకోట, కర్ణాటకలోని ముళబాగిళు, కోలారు, బంగా ర్‌పేట్ తదితర ప్రాంతాల్లో టమాటాలు తోలే లారీలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్నాళ్లు డ్రైవర్లుగా ఉన్న వారు ఫైనాన్స్‌లో లారీలు కొని త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈ రొచ్చులోకి దిగుతున్నారు. స్మగర్లు సైతం సరుకు లారీలో వేసుకుంటే రూ.5 లక్షల వరకు స్పాట్ పేమెంట్ ఇస్తూ బంపర్ ఆఫర్ పెట్టినట్టు తెలిసింది. ఆత్మకూరులో పట్టుబడిన పలమనేరుకు చెందిన డ్రైవర్ నాలుగు నెలల క్రితం ఆ లారీని తమిళనాడులోని గుడియాత్తంలో ఫైనాన్స్‌లో కొన్నట్టు తెలిసింది.
అనుమానం రాకుండా..
చిత్తూరు జిల్లా నుంచి కర్ణాటకలోకి గానీ లేదా నెల్లూరు జిల్లా మీదుగా ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించాలంటే ఎక్సైజ్, ఫారెస్ట్, ఆర్‌టీవో, అగ్రికల్చర్ చెక్‌పోస్టులను దాటాలి. ఎవరికీ అనుమానం రాకుండా అనేక ఎత్తుగడలు వేస్తున్నారు. జిల్లా నుంచి కోల్‌కతాకు విత్తన కోడిగుడ్ల (హ్యాచరీ ఎగ్స్)ను తరలించే పలు ఏసీ కంటైనర్లు ఉన్నాయి. వీరు కోల్‌కతాలో ఎగ్స్‌ను దింపి అక్కడి నుంచి చెన్నైకి మాంసాన్ని తీసుకొస్తారు. ఇలాంటి ఏసీ వాహనాల్లోనూ దుంగలను తరలిస్తున్నట్టు సమాచారం. గతంలో పలమనేరు చెక్‌పోస్టు వద్ద పార్సిల్ కొరియర్ వాహనంలో ఎర్రచందనం దుంగలను పట్టుకున్న విషయం తెలిసిందే. ట్యాంకర్‌లో ఎర్రదుంగలను పెట్టి రవాణా చేస్తుండగా స్థానిక పోలీసులు పట్టుకున్నారు. దీంతో పాటు ఖరీదైన కార్లను స్మగ్లర్లు వాడుతుండడం గమనార్హం. ఇదే రీతిలో శుక్రవారం పుంగనూరులో ఓ ఖరీదైన కారులో రవాణా అవుతున్న దుంగలను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. మరికొందరు ప్రైవేటు అంబులెన్స్‌లలో సైతం సైరన్ మోగిస్తూ దుంగలను తరలిస్తున్నట్టు సమాచారం. ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాను అరికట్టేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్, ఫారెస్ట్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు మాత్రం దుంగలను వెస్ట్‌బెంగాల్, కర్ణాటకకు తరలిస్తుండడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment