Sandlewood smuggling
-
రాళ్లతో దాడికి తెగబడి..
-
పట్టుకున్నారు... వదిలేశారు !
తొట్టంబేడు : ఓ లారీలో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నట్లు పక్కా సమాచారంతో అటవీ శాఖ సిబ్బంది మాటు వేసి పట్టుకున్నారు. ఆ లారీకి ఎస్కార్ట్‌గా ముందు వెళుతున్న ఇన్నోవా కారునూ పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాలనూ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఏమైందో ఏమో గానీ ఉదయానికల్లా లారీ, కారు మాయమయ్యాయి. నెల్లూరు వైపు నుంచి పిచ్చాటూరు మార్గంలో బియ్యం బస్తాల మాటున ఓ లారీలో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నట్లు ఆదివారం అర్ధరాత్రి శ్రీకాళహస్తి అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందింది. తొట్టంబేడు మండలం లక్ష్మీపురం సమీపంలో మాటు వేసి లారీని సిబ్బంది పట్టుకున్నారు. దాని ముందు ఎస్కార్ట్‌గా వెళుతున్న ఇన్నోవా కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఎస్టార్ట్ వాహనం స్విఫ్ట్ కారు సిబ్బంది కళ్లు కప్పి తప్పించుకుంది. పట్టుబడిన లారీ, కారును తొట్టంబేడు ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న అటవీ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. లారీలో 10 టన్నులకుపైగా చౌక దుకాణాల బియ్యం, ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. రాత్రి పూట లారీ పట్టుబడినందున రేంజర్ వచ్చాక లోడ్‌ను పరిశీలించి విషయం తెలియజేయనున్నట్లు అదేరోజు విలేకరులకు తెలిపారు. అయితే మరుసటి రోజు సోమవారం లారీ, కారును పంపేశారు. ఇదేమని అడిగితే సిబ్బంది పొంతన లేని సమాధానాలు తెలిపారు. దీనిపై స్థానిక ఫారెస్ట్ రేంజర్ వెంకటసుబ్బయ్యను వివరణ కోరగా ఈ సంఘటనకు సంబంధించి తనకేమీ తెలియదని, విచారిస్తానని తెలిపారు. -
మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్
కడప అర్బన్ : జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా, ఇతర నేరాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 16 ఎర్రచందనం దుంగలు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కడప అర్బన్ సీఐ కార్యాలయ ఆవరణలో సీఐ ఎస్ఎం అలీ గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ యు.సూర్యనారాయణ, అర్బన్ సీఐ ఎస్ఎం అలీ, చెన్నూరు ఎస్ఐ పెద్ద ఓబన్న జిల్లా ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. చెన్నూరు మండలంలోని కొండపేట వద్ద బుధవారం మధ్యాహ్నం ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న షేక్ సింపతి జాకీర్ అలియాస్ సింపతి లాల్‌బాషాతోపాటు మరో పది మందిని అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో చాపాడు మండలానికి చెందిన చిన్న దండ్లూరు మహమ్మద్ నాసీర్, జి.రజాక్‌వల్లీ, రైల్వేకోడూరు మస్తాన్, సీకే దిన్నె మండలానికి చెందిన నాగదాసరి మహేష్, తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా వాసులు తంగవేలు, కనకరాజ్, «సుబ్రమణి, ధర్మపురి జిల్లాకు చెందిన వెంకట్రామన్, లక్ష్మణ్, రఘు ఉన్నారు. వీరిలో ప్రధాన నిందితుడైన షేక్ సింపతి జాకీర్ గతంలో ఆటో నడిపే వాడు. చెడు అలవాట్లకు బానిసై దొంగతనాల కు పాల్పడే వాడు. క్రమేణా అంతర్జాతీయ స్మగ్లర్లతో కలిసి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడ్డాడు. ఇతనిపై జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లలో దాదాపు 60 కేసులు ఉన్నాయి. నిందితుల వద్ద నుంచి 16 ఎర్రచందనం దుంగలు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 31 లక్షలు ఉంటుంది. నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన ఎస్బీ సీఐ పుల్లయ్య, ఎస్ఐ మధుమల్లేశ్వర్‌రెడ్డి, ఏఆర్ ఎస్ఐ మురళి, హెడ్‌కానిస్టేబుళ్లు శివ, సాగర్, రాజేష్, రమణ, కొండయ్య, గోపి నాయక్, స్పెషల్ పార్టీ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
టాస్క్‌ఫోర్స్‌కు 'తంబీల' టెన్షన్
తిరుపతి అర్బన్: తమిళనాడు ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్కు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే తమిళనాడు నుంచి ఎర్ర స్మగ్లర్లు శేషాచలంలోకి చొరబడతారన్న టెన్షన్ టాస్క్‌ఫోర్స్ అధికారుల్లో మొదలైంది. వివరాల్లోకి వెళితే, లాక్డౌన్ నేపథ్యంలో రెండు నెలలుగా శేషాచలంలో ఎర్ర చందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. మే 31కి లాక్డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో తమిళనాడులో రవాణా మొదలవనుంది. ఈ నేపథ్యంలో తిరుఅన్నామలై ప్రాంతానికి చెందిన ఎర్రస్మగ్లర్లు జూన్‌లో జిల్లాలోని ఎర్ర అడవుల్లోకి చొరబడే ప్రమాదం ఉంది. దాంతో ముందస్తుగానే ఎర్రస్మగ్లర్లను జిల్లాలోకి అడుగుపెట్టనీయకుండా టాస్క్‌ఫోర్స్ ఎస్పీ రవిశంకర్ నేతృత్వంలో పలు బృందాలు సిద్ధం అవుతున్నాయి. అయితే తమిళనాడుకు చెందిన ఎర్రస్మగ్లర్లు పెద్ద ఎత్తున జిల్లాలోని శేషాచలం అడవుల్లోనూ, వైఎస్సార్ కడప జిల్లాలోని పాలకొండల్లో ఎర్రదుంగలను రవాణా కోసం లాక్‌డౌన్‌కు ముందే డంపింగ్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో టాస్క్‌ఫోర్స్ గాలింపు చర్యలు చేపట్టింది. ఇదే తరుణంలో పైలట్లుగా (పోలీసుల సమాచారం స్మగ్లర్లకు అందించేవారు) వ్యవహరిస్తున్న పాతస్మగ్లర్ల జాడ కోసం టాస్క్‌ఫోర్స్ విచారణ చేపడుతోంది. డంపింగ్‌ల వివరాలు పైలెట్లుగా పనిచేస్తున్న వారి వద్ద ఉన్నాయనే సమాచారంతో పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఈ సారి ఎర్రచందనం జోలికివస్తే పీడీ యాక్టులతోపాటు కఠిన మైన కేసులు తప్పవనే సంకేతాలు ఇస్తున్నారు. నెల్లూరులోనూ తాకిడి చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లాలో కొంతభాగంలో ఎర్రచందనం ఉండడంతో ఎర్రస్మగ్లర్ల తాకిడి ఈ ప్రాంతంలో ఎక్కువగా చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కోట్ల విలువైన ఎర్రచందనాన్ని అక్రమ రవాణాకు చెక్ పెట్టడం కోసం టాస్క్‌ఫోర్స్‌ను వెలుగులోకి తెచ్చారు. ఆ మేరకు అటవీశాఖకు అండగా ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఏకైక టాస్క్‌ఫోర్స్ కార్యాలయాన్ని ప్రభుత్వం 2016లో తిరుపతిలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఐదేళ్లలో చూస్తే 580 కేసులను నమోదు చేశారు. 330 మెట్రిక్ టన్నులు (12122 ఎర్రదుంగలు)ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నా రు. 1891 మందిని అదుపులోకి తీసుకున్నారు. 297 వాహనాలను సీజ్ చేశారు. అయినా ఎర్రచందనం అక్రమాలకు అడ్డకట్టపడ్డలేదు. అయి తే కోవిడ్–19తో వారి ఊసేలేకుండా పోయింది. మళ్లీ పూర్వ పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నంలో టాస్క్ ఫోర్స్ తలమునకలై పనిచేస్తోంది. స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరిస్తాం తమిళనాడు ప్రభుత్వం వాహనాల రవాణాకు అనుమతి ఇస్తే స్మగ్లర్ల తాకిడి తప్పేలా లేదు. దాంతో బుధవారం నుంచి పలు బృందాలను ఏర్పాటు చేసి.. వారిపై నిఘా పెట్టనున్నాం. లాక్‌డౌన్‌కు ముందుగా పలుచోట్ల ఎర్రస్మగ్లర్లు ఎర్రచందనంను డంపింగ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పాత స్మగ్లర్లు పైలెట్లుగా వ్యవహరిస్తున్నారు. వారి కోసం విచారణ చేస్తున్నాం. వారి వద్ద అదనపు సమాచారం ఉందని భావిస్తున్నాం. పాతస్మగ్లర్లు తమిళనాడు స్మగ్లర్లను ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ సారి చర్యలు తీవ్రంగా ఉంటాయి. ఎర్రస్మగ్లర్లపై కేసులు కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం.– రవిశంకర్, టాస్క్‌ఫోర్స్ ఎస్పీ, తిరుపతి -
47 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ప్రొద్దుటూరు టౌన్: ఖాజీపేట మండలం నాగసానిపల్లె అటవీ రేంజ్ పరిధిలో ఈ నెల 23న అర్థరాత్రి అటవీ సిబ్బంది దాడి చేసి 47 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారని డీఎఫ్ఓ గురుప్రభాకర్ తెలిపా రు. అలాగే 27 మంది ఎర్ర కూలీలు పట్టుబడ్డారని వెల్లడించారు. సోమవారం సాయంత్రం ప్రొద్దుటూరు డీఎఫ్ఓ కార్యాలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 23వ తేదీ రాత్రి అటవీ సిబ్బంది కాపు కాశారని అన్నారు. అర్థరాత్రి 12–1 గంట ప్రాంతంలో కూలీలు ఎర్రచందనం దుంగలను వాహనాల్లో తరలించేందుకు సిద్ధమయ్యారన్నారు. ఈ క్రమంలో తమ సిబ్బంది చాకచక్యంతో వారిని పట్టుకున్నారన్నా రు. ఈ దాడిలో తమిళనాడులోని కులవకుర్చి విల్లుపురం, వెల్లోరి జిల్లాలకు చెందిన 25 మంది తమిళకూలీలతో పాటు ప్రొద్దుటూరు మండల పరిధిలోని ఖాదర్‌బాద్‌కు చెందిన ఇద్దరిని పట్టుకున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో రూ.1.50 కోట్ల విలువ 47 ఎర్రచందనం దుంగలు మొదటి రకానికి చెందినవని డీఎఫ్ఓ తెలిపారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో 1.50 కోట్లని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్మగ్లర్ అబ్బాస్ కోసం వేట సాగిస్తున్నామన్నారు. ఈ దొంగలకు స్థానిక ఖాదర్‌బాద్‌కు చెందిన వారితో సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. అబ్బాస్‌తో పాటు, వీరిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. దొంగల వద్ద దొరికిన ఆధారాల మేరకు అబ్బాస్ నుంచి స్థానికులకు ఫోన్ కాల్స్ వచ్చాయని, వీరి నుంచి కూడా అబ్బాస్‌కు కాల్స్ వెల్లినట్లు తేలిందని వివరించారు. ఎర్ర దొంగలను పట్టుకున్న వారిలో డిప్యూటీ రేంజ్ అధికారి కరిముల్లా, డీబీఓ ఎమ్.లింగానాయక్, శ్రీనివాస్, రమేష్‌బాబు, రతన్‌రాజు, ఏబీఓలు గంగాధర్,బ్రహ్మయ్య బి.ఉషా, లింగారెడ్డి, గురు ఉన్నారు. -
‘ఎర్ర’దండు..శేషాచలం గుండు
చిత్తూరు, ఎర్రావారిపాళెం: ఎర్రచందనం అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపుతామని అటవీశాఖ ఉన్నతాధికారులు పదే పదే చెబుతున్నా దీనికి అడ్డుకట్ట పడటం లేదు. ఎర్రదుంగలను తరలిస్తూ తరచూ వాహనాలతో సహా పట్టుపడుతున్న స్మగ్లర్లు, కూలీలు ఉదంతాలే ఇందుకు నిదర్శనంగా ఉంటున్నాయి. పీడీ యాక్టు ప్రయోగించి జైళ్లకు పంపుతున్నా, శేషాచలంలో కూంబింగ్ విస్తృతంగా చేస్తున్నా స్మగ్లర్లు, కూలీలు వెరవడం లేదు. అక్రమ రవాణాకు సరికొత్త ఎత్తుగడలను అనుసరిస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. మరోవైపు ఇంటిదొంగలుగా గుట్టుగా ‘ఎర్ర’దొంగలకు సహకారం అందిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. కొంచెం రిస్క్ తీసుకుంటే చాలు..పెద్దమొత్తంలో ఆదాయం కళ్లజూస్తుండడంతో కూలీలుగా ప్రస్థానం మొదలై కోట్లకు పడగలెత్తిన స్మగ్లర్లూ లేకపోలేదు. చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం మండల అటవీ సరిహద్దు ప్రాంతాల్లో టీడీపీ హయాంలో స్మగ్లింగ్ విశ్వరూపం దాల్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేవలం ఈ రెండు మండలాల్లో దాదాపు రూ.300 కోట్లకు పైగా ఎర్రచందనం టీడీపీ హయాంలో పట్టుబడినట్లు లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా 417 కేసుల్లో 7559 దుంగలు, 232 వాహనాలను స్వాధీనం చేసుకోగా, 1718మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తమిళ కూలీలపైనే కేసులు, ఒకరిద్దరు స్థానికులపై నామమాత్రపు కేసులు నమోదు చేయడం తప్పితే సూత్రధారులు, పాత్రధారులు, ఇంటిదొంగల వైపు దృష్టి సారించడం లేదనే విమర్శలొస్తున్నాయి. కొత్తగా అధికారులు వచ్చినప్పుడల్లా హడావుడి చేయడం తప్పితే స్మగ్లింగ్‌కు పూర్తిస్థాయిలో చెక్ పెట్టే దిశగా సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. స్మగ్లింగ్‌లో పట్టుబడ్డ కూలీల విచారణలో తేటతెల్లమైన స్మగ్లర్ల కథాకమామీషు ఏమిటో అధికారులకే తెలియాలి. ఇక సాధారణ కేసుల్లో రిమాండులో ఉన్న ఖైదీలను పోలీస్ కస్టడీకి తీసుకొని మరీ విచారణ చేస్తారు. మరి ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో మాత్రం అలా చేయరెందుకో? టీడీపీ పాలనలో జిల్లా స్థాయి అధికారే స్మగ్లింగ్‌కు సహకారమిస్తున్నారని ఒక ఉన్నతాధికారి పత్రికా ముఖంగా వెల్లడించడం అప్పట్లో అదొక సంచలనం! ఎర్రచందనం తరలే ప్రాంతాలివే.. ⇒ శేషాచల అడవుల్లోంచి నరికి కూలీల తెచ్చిన దుంగలను తరలిస్తున్న ప్రాంతాలు ముఖ్యంగా నాగినేనివారిపల్లె సమీప మామిడితోట లు, దేవరకొండ చుట్టూ ఉన్న మామిడి తోట లు,పులిగోనుపల్లె సమీప మామిడి తోటలు. ⇒ భూతంవారిపల్లె సమీపంలోని గుట్టలు. గెద్దలబండ, సిద్ధలగండి–వలసపల్లె సమీప గుట్టలు. ⇒ తవ్వాండ్లపల్లె వద్ద కలుస్తున్న కొత్తరోడ్డు. బండకొండగుట్టలు ⇒ బుడ్డారెడ్డిగారిపల్లె–నెమలిగుండ్లు రోడ్డు ⇒ కొంగరవాండ్లపల్లె–బిజ్జేపల్లె రోడ్డు ⇒ ఉదయమాణిక్యం–కోటబైలు రోడ్డు. భాకరాపేట ఘాట్ రోడ్డు. భాకరాపేట–మంగళంపేట రోడ్డు. సిబ్బంది కొరత ఎర్రావారిపాళెం స్టేషన్లో 28 మంది ఉండాల్సిన సిబ్బంది 14 మంది, భాకరాపేట స్టేషన్లో 28 మందికి 21, చామల రేంజ్లో 22 మందికి గాను 8 మంది ఉన్నారు. చామల అటవీ రేంజ్ పరిధిలో సుమారు 2.70 లక్షల హెక్టార్లు ఉండగా 30వేల హెక్టార్లకు ఒకరు చొప్పున 22 మంది ఉండాల్సి సిబ్బంది కేవలం 8 మందే ఉన్నారు. ఎర్రావారిపాళెం పోలీస్ క్వార్టర్స్‌కు హెచ్ఆర్ఏ కట్ అవుతుండడంతో సిబ్బంది ఇక్కడకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఇకనైనా స్మగ్లింగ్‌ను నిరోధించడానికి, ఎర్రచందనం పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
భర్త కిడ్నాప్.. భార్య హత్య
వేలూరు: వానియంబాడిలో ఎర్రచందనం తీసుకెళ్లడంతో కూలీ డబ్బులు ఇవ్వనందుకు ఘర్షణ ఏర్పడడంతో భర్తను కిడ్నాప్ చేసి భార్యను హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వానియంబాడి సమీపంలోని ఆలంగాయం పూంగానత్తం గ్రామానికి చెందిన శ్రీనివాసన్ భార్య శాంతిప్రియలకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. శ్రీనివాసన్‌కు ఒడుగత్తూరుకు చెందిన అశోక్‌తో పరిచయం ఏర్పడడంతో ఎర్రచందనం నరికేందుకు కూలీకి వెల్లేవాడు. కొద్ది రోజుల క్రితం శ్రీనివాశన్ పూంగానత్తం నుంచి కృష్ణమూర్తి, పయణి, ఇళయరాజ, చిన్నరాయన్, సంజయ్, వెంకటేశన్ కలిసి కూలీ పనుల కోసం అశోకన్‌తో పంపాడు. వీరందరిని అశోకన్ ఆంధ్ర రాష్ట్ర్రంకు ఎర్రచందనం నరికేందుకు తీసుకెళ్లాడు. అడవిలో నరికిన ఎర్రచందనాన్ని తమిళనాడుకు తీసుకొచ్చి విక్రయించిన వెంటనే కూలీ డబ్బులు ఇస్తామని తెలిపి ఏడుగురిని పూంగానత్తం గ్రామానికి పంపి వేశారు. అయితే కూలీ పనులకు వెళ్లి వచ్చి పది రోజులు అవుతున్నా వీరికి కూలి డబ్బులు ఇవ్వలేదు. వీరు ఏడుగురు శ్రీనివాసన్ వద్ద కూలి డబ్బులు తీసి ఇవ్వాలని తెలిపారు. అయితే శ్రీనివాసన్ ఏజెంట్ అశోకన్ వద్ద నగదు తీసుకొని తమకు ఇవ్వలేదని ఆరోపిస్తూ ఏడుగురు బుధవారం రాత్రి శ్రీనివాసన్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో శ్రీనివాసన్‌కు, ఏడుగురు కూలీలకు వాగ్వివాదం ఏర్పడింది. దీంతో వారు ఏడుగురు కలిసి శ్రీనివాసన్‌ను కారులో కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లారు. ఆ సమయంలో అడ్డుకునేందుకు వచ్చిన శ్రీనివాసన్ భార్య శాంతిప్రియ, తల్లిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వెంటనే శాంతిప్రియను గ్రామస్తులు వానియంబాడి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ శాంతిప్రియ మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఆలంగాయం పోలీసులు శాంత ప్రియను హత్య చేసి భర్తను కిడ్నాప్ చేసిన ఏడుగురిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
స్మగ్లింగ్ రూట్ మారింది
సీతారామపురం: వాటర్ ట్యాంకర్ ద్వారా నీరు తరలిస్తున్నట్టుగా నమ్మించారు. అయితే ట్యాంకర్లో ఎర్రచందనం దుంగలను ఉంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మండలంలోని చింతోడు గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో బుధవారం సీతారామపురం పోలీసులు 92 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దుంగలను కావలి డీఎస్పీ రఘు పరిశీలించి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వింజమూరుకి చెందిన భీమిరెడ్డి ఓబుల్‌రెడ్డి, చింతోడుకి చెందిన రాచూరి రవి కొందరితో కలిసి చింతోడు అటవీ ప్రాంతంలో దుంగలు నరికించారు. సమీపంలో చెరువు దగ్గర వాటర్ ట్యాంకర్లో నీళ్లు నింపుతున్నట్లుగా నటించి అందులో దుంగలను ఉంచారు. ట్యాంకర్ ద్వారా ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నారని సీతారామపురం పోలీసులకు బుధవారం సమాచారం అందింది. ఎస్సై రవీంద్రనాయక్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాళ్లు విసిరి.. చెరువు వద్దకు చేరుకున్న పోలీస్ వాహనాన్ని చూసిన ఎర్రచందనం దొంగలు ట్యాంకర్, రెండు మోటార్‌బైక్‌లు, ఒక ఆటోని వదిలి పోలీసులపై రాళ్లు విసురుతూ పరిగెత్తారు. దీంతో పోలీసులు వెంబడించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన 11 మంది పరారయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ట్యాంకర్‌ను పరిశీలించగా అందులో 92 ఎర్రచందనం దుంగలున్నాయి. వాటిని, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దుంగల విలువ రూ.1.25 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ట్యాంకర్, బైక్‌లు, ఆటో ఖరీదు రూ.3 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న వారిని ఓబుల్‌రెడ్డి, పవన్‌కుమార్‌గా గుర్తించి వారిని విభిన్న కోణాల్లో విచారిస్తున్నారు. ఎర్రచందనం దొంగలను పట్టుకుని, దొంగలను స్వాధీనం చేసుకున్న ఎస్సై రవీంద్రనాయక్‌ను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ఉదయగిరి సీఐ ఉప్పాల సత్యనారాయణ, ఎస్సై ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. -
అటవీ సిబ్బందికి ఆయుధాలు
విశాఖపట్నం, నర్సీపట్నం: ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించేందుకు అటవీ సిబ్బందికి ఆయుధాలు అందజేస్తామని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ మహమ్మద్ ఇలియాస్ రిజ్వీ తెలిపారు. గురువారం ఆయన నర్సీపట్నం అటవీ డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. అనంతరం అటవీ రేంజ్ కార్యాలయం వద్ద విశాఖపట్నం, విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల డీఎఫ్‌వోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అటవీ సిబ్బందికి 125 రివాల్వర్లను ఇప్పటికే అందజేశామన్నారు. త్వరలో 250 వరకు డబుల్ బార్ గన్స్ అందజేయనున్నట్టు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్న కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముఖ్య అధి కారులతో త్వరలో ఉమ్మడి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎర్రచందనం రవాణా నిరోధానికి తీసుకోవలసిన చర్యలపై చర్చిస్తామన్నారు. పోలీసు, కస్టమ్స్, ఎక్సై జ్, రెవెన్యూ, అటవీశాఖ సమన్వయంతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధిస్తామని ఆయన స్ప ష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 శాతం అడవుల విస్తీర్ణం ఉందని, దీనిని 33 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకు కోసం రహదారులకు ఇరువైపులా, పాఠశాలలు, కాలు వ గట్లు, ప్రతి ఇంటి ముందు మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతరించిపోతున్న అటవీ వనాల అభివృద్ధికి ప్రత్యేక ప్లాంటేషన్లు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో 32 వేల హెక్టార్లలో రూ.27 కోట్లతో వనాల పెంపకం చేపడుతున్నామని వివరించారు. ఈ పర్యటనలో సీసీఎఫ్ రాహుల్‌పాండే పాల్గొన్నారు. -
ఎర్రచందనంతో పాటు స్మగ్లర్ అరెస్టు
చంద్రగిరి : శేషాచలంలో ఎర్రచందనం చెట్లను నేలకూల్చి అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్‌తో పాటు 14 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఎస్ఐ వాసు వివరాల మేరకు.. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో భాగంగా సోమవారం రాత్రి ఆర్ఎస్ఐ వాసు, డీఆర్ఓ నరసింహరావు బృందం శేషాచల అడవుల్లో కూంబింగ్‌ను ప్రారంభించింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈతగుంట, సచ్చినోడు బండ ప్రాంతాల్లో స్మగ్లర్ల అడుగు జాడలను పసిగట్టిన అధికారులు, మూడు బృందాలుగా విడిపోయి కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో శ్రీవారిమెట్టు సమీపంలోని జూపార్క్ వెళ్లే ముళ్లదారిలో స్మగ్లర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారిపై దాడులు చేపట్టడంతో స్మగ్లర్లు దుంగలను పడేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో తమిళనాడు జవ్వాదిమలైకు చెందిన అన్నామలైను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసు జాగిలాలతో తనిఖీలు చేయగా 14 ఎర్రచందనం దుంగలను లభ్యమైనట్లు తెలిపారు. సమచారం అందుకున్న డీఎస్పీ వెంకటరమణ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. -
సినీ ఫక్కీలో 30 మంది ఎర్రకూలీలు, స్మగ్లర్ల అరెస్ట్
చిత్తూరు, పీలేరు: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు వెళుతున్న 30 మంది తమిళ కూలీలను సినీ ఫక్కీలో అరెస్ట్ చేసిన సంఘటన గురువారం సాయంత్రం పీలేరు నాలుగు రోడ్ల కూడలిలో కలకలం సృష్టించింది. వివరాలు..ముందుగా అందిన సమాచారం మేరకు పీలేరు ఫారెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, సిబ్బంది కలకడ నుంచి ఈచర్ వాహనాన్ని వెంబడించారు. స్మగ్లర్లు, కూలీలను మారణాయుధాలతో తరలిస్తున్నారనే సమాచారం అందడంతో ఆద్యంతం అనుమానం రాకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. చాకచక్యంగా పీలేరు నాలుగు రోడ్ల కూడలిలో తుపాకులు ఎక్కుపెట్టి ఏపీ16 టీఎక్స్ 3615 నంబరు గల ఈచర్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో ఎటువంటి అనుమానం రాకుండా చుట్టూ టమోటా బుట్టలు పెట్టి లోన 30 మంది ఎర్ర కూలీలు, స్మగ్లర్లు ఉండటం గుర్తించారు. అలాగే అడవిలో వంట చేసేందుకు అవసరమైన వస్తు సామగ్రి, సరకులు అందులో ఉన్నాయి. తుపాకులతో చుట్టుముట్టడంతో వారి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. వారిని అటవీ కార్యాలయానికి తరలించారు. వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారో విచారణలో తెలియాల్సి ఉంది. అటవీ అధికారుల గోప్యత విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుపుతామంటూ అటవీ అధికారులు మీడియాకు చెప్పారు. డీఎఫ్ఓ నరసింహారావు ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు, సాయుధ పోలీసు సమక్షంలో విచారణ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఎర్రకూలీలు, స్మగ్లర్లను ఫారెస్ట్ అధికారులు పట్టుకోవడం పీలేరులో చర్చనీయాంశమైంది. -
రూటు మార్చిన ఎర్రచందనం స్మగ్లర్లు
కడప అర్బన్: రాయలసీమ జిల్లాల్లోని అటవీప్రాంతాలు ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం కలిగి ఉన్నాయి. ఈ ఎర్రచందనంను విదేశాలకు అక్రమంగా తరలిస్తూ జిల్లా స్థాయి నుంచి అంతర్ జిల్లా, అంతరాష్ట్ర, అంతర్జాతీయ స్మగ్లర్లుగా పలువురు ఎదిగారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఎంతో మం ది స్మగ్లర్లను అరెస్ట్ చేసి కటకటాల పాలు చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు, కటిగెనహళ్లి, తమిళనాడు రాష్ట్ర చెన్నై నగరం రెడ్‌హిల్స్, ఇతర ప్రాంతాల నుంచి జిల్లా వ్యాప్తంగా ఎర్రచందనం స్మగ్లర్లు, తమిళనాడు నుంచి వచ్చే వుడ్కట్లర్లు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో చొరబడి ఎర్రచందనం కొల్లగొట్టారు. అదే స్థాయిలో జిల్లా పోలీసు యంత్రాంగం వారిని ఆటకట్టించారు. ఆటకట్టిస్తున్నారు. అంతర్ రాష్ట్రాలకు తరలింపు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు, అక్కడి నుంచి షిప్‌లద్వారా విదేశాలకు తరలించేవారు. ఎక్కడికక్కడ పోలీసు యంత్రాంగం కృషితో ఎర్రచందనం స్మగ్లర్లను నియంత్రిస్తున్నారు. దీంతో పోలీసుల కళ్లుగప్పి ఎర్రచందనం స్మగ్లర్లు రూటు మార్చారు. రాయలసీమ జిల్లాల అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను నరికించి పశ్చిమగోదావరి జిల్లాకు తరలించడం పోలీసుల నిఘాకు చిక్కింది. అప్రమత్తమైన పోలీసులు పాత నేరస్థుల కదలికలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎప్పటికపుడు కనిపెట్టారు. జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) బి.లక్ష్మినారాయణ పర్యవేక్షణలో పాత నేరస్తుల జాడకోసం తమ వంతు పోలీసులు ప్రయత్నించారు. రాజంపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పుల్లంపేట మండలం తిప్పాయపల్లెకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ తోట మహేంద్రారెడ్డి గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డాడు. ప్రస్తుతం అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తే, పశ్చిగోదావరి జిల్లా ఏలూరు పరిధిలోకి తరచూ వెళ్లి వచ్చేవాడని, అక్కడి వారితో రెగ్యులర్‌గా ఫోన్లలో మాట్లాడుతూ వుండేవాడని విచారణలో తెలుసుకున్నారు. జిల్లాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ మహేంద్రారెడ్డి తన రూటును మార్చడంతో అతని కదలికలతో ఈనెల 21న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు బైపాస్‌లోని ఓ హోటల్ వద్ద అరెస్ట్ చేశారు. మహేంద్రారెడ్డి సమాచారంతో అదే రోజు రాత్రి నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5642 కిలోల బరువున్న 175 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
వేటాడుతున్నారు!
నెల్లూరు(క్రైమ్): జిల్లాలోని వెలుగొండ అటవీ ప్రాంతంలో నిఘా పాగా వేసింది. ఎర్రచందనం కొల్లగొడుతున్న దొంగల కోసం వేట ముమ్మరంగా సాగుతోంది. టాస్క్ఫోర్సు, స్థానిక పోలీసు అధికారులు మెరుపుదాడులు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున డక్కిలి పోలీసు డక్కిలి, వెంకటగిరి పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. 10 మంది అంతర్రాష్ట్ర ఎర్రస్మగ్లర్లను అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాలులో జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి విలేకరులకు వెల్లడించారు. దేవుడు వెల్లంపల్లిలో చేసిన దాడుల్లో డక్కిలి ఎస్సై నిందితుల నుంచి 78 ఎర్రచందనం దుంగలు, ఆరు సెల్ఫోన్లు, మూడు మోటారుబైక్‌లు, బరువు కొలిచే యంత్రం, రూ.900 నగదును స్వాధీనం చేసుకున్నారు. కోనమల్లేశ్వరకోనలో చేసిన దాడుల్లో వెంకటగిరి ఎస్సై తన సిబ్బందితో కలిసి నిందితులను అరెస్ట్‌చేసి 44 చందనం దుంగలు, ఆరు సెల్ఫోన్లు, మూడు మోటారుబైక్‌లు ఒక ఐచర్ వ్యాన్, 8.5 కిలోల ఎర్రచందనం పొడి, బరువు తూచే యంత్రం, రూ.1,200 నగదను స్వాధీనం చేసుకున్నారు. రెండు ఘటనల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎర్రదుంగలు, వాహనాలు విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.1.75 కోట్లు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయడంతోపాటు వారి ఆస్తులను సీజ్ చేస్తామని తెలిపారు. సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డులను అందజేశారు. సమాచారం అందించండి జిల్లా పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు, ఎర్రచందనం, ఇసుక, సిలికా, గుట్కా అక్రమరవాణాపై ప్రజలు 9390777727, డయల్ 100, క్రైమ్ స్టాఫర్ 1090కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. సమావేశంలో ఏఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ వెంకటరావు, డక్కిలి, వెంకటగిరి ఎస్సై వాసు, కొండపనాయుడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చైనా మార్కెట్‌కు.. డక్కిలి మండలంలోని దేవుడువెల్లంపల్లి కొండల్లో, వెంకటగిరి మండలంలోని కోన మల్లేశ్వరకోనల్లోని అటవీ ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర స్మగ్లర్లు పాగావేశారు. విలువైన ఎర్రచందనం దుంగలను నరికి రహస్య మార్గాల్లో చెన్నై, ముంబై, కొచ్చి, కాండ్లా, కోల్‌కత్తాలోని నౌకాశ్రయాలకు చేరుస్తున్నారు. అక్కడినుంచి అంతర్జాతీయ మార్కెట్‌కు తరలించి రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. కొందరు స్మగ్లర్లు దుంగలను హస్తకళా వస్తువులుగా మార్చి విమానాల ద్వారా చైనా మార్కెట్‌కు తరలిస్తున్నారు. గతేడాది.. గతేడాది 45 కేసులు నమోదు చేసి 222 మందిని అరెస్ట్ చేశారు. వారినుంచి రూ 13.91 కోట్లు విలువచేసే 13 టన్నుల బరువు కలిగిన 1,330 దుంగలు, 54 వాహనాలు, 193 సెల్ఫోన్లు, ఐదు తుపాకులు, ఆరు గొడ్డళ్లు, రూ.75 వేల నగదు, 800 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది స్మగ్లర్లపై పీడీయాక్ట్‌లు నమోదు చేశారు. ఎర్రచందనం అక్రమరవాణాను పూర్తిస్థాయిలో కట్టడిచేసే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా జిల్లాలోని వెలుగొండ అటవీ, సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్, వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. కాగా ఓ వైపు పోలీసులు దాడులు చేసి స్మగ్లర్ల ఆటలు కట్టిస్తున్నా మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాల్లో విలువైన ఎర్రసంపదను సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. వందేళ్లకు పైబడిన.. పోలీసులు స్వాధీనం చేసుకున్న దుంగల్లో 100 సంవత్సరాలకు పైబడిన 192 కిలోల బరువున్న వేరుముద్ద ఉంది. ప్రస్తుతం జిల్లా నుంచి ప్రత్యేకంగా ఎర్రచందనం వేరుముద్దల అక్రమరవాణా జోరుగా సాగుతోంది. వాటికి చైనా, సింగపూర్, మలేసియా, జపాన్, హాంకాంగ్‌తోపాటు అరబ్ దేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఈ దేశాల ప్రజలు ఈ వేరుముద్దలతో తయారుచేసిన వస్తువులకు అతీంద్రియ శక్తులు ఉంటాయని బలంగా నమ్ముతారు. ఈ నేపథ్యంలో వీటిపై ఎర్రస్మగ్లర్లు దృష్టి సారించారు. -
అంతర్జిల్లా ఎర్ర దొంగల ముఠా అరెస్ట్
నెల్లూరు(క్రైమ్) : ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 8 మంది అంతర్జిల్లా ఎర్రచందనం దొంగల ముఠాను మర్రిపాడు ఎస్ఐ, టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.55లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి నిందితుల వివరాలను వెల్లడించారు. గత కొంతకాలంగా ఎర్రదొంగల కదలికలపై నిఘా ఉంచామన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతాల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. శుక్రవారం వేకువన మర్రిపాడు మండల పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం అందిందన్నారు. మర్రిపాడు ఎస్ఐ తిరుపతయ్య, ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఇన్చార్జి వెంకటరావు తన సిబ్బందితో కలిసి పడమటినాయుడిపల్లి ట్యాంక్ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారన్నారు. మారుతీ ఓమిని వ్యాన్‌లో కొందరు అనుమానాస్పదంగా కనిపించగా తనిఖీ చేశామన్నారు. ఈ క్రమంలో దుండగులు పోలీసు సిబ్బందిని నెట్టివేసి పరారయ్యేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారన్నారు. వారి వద్ద నుంచి రూ.55లక్షల విలువచేసే ఒకటిన్నర టన్నుల బరువు కలిగిన 18 ఎర్రదుంగలు, మారుతీకారు, నాలుగు ద్విచక్రవాహనాలు, తొమ్మిది సెల్ఫోన్లు, రూ.4,100నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొంతకాలంగా అక్రమ రవాణా వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలం దాసరిపాళేనికి చెందిన ఎం.నరహరి, బ్రహ్మంగారి మఠం రేకులకుంటకు చెందిన వెంకటేష్ కొంత కాలం నుంచి ఎర్రస్మగ్లర్లుగా అవతారమెత్తారని ఎస్పీ తెలిపారు. బద్వేల్ మండలం బాలాయపల్లికి చెందిన ఎన్. చంద్రశేఖర్(పైలెట్), పోరుమామిళ్ల మండలం రేపల్లికి చెందిన ఏ ప్రభాకర్(ఉడ్ కట్టర్), కలతసాడు మండలం చెన్నుపల్లికి చెందిన చంద్రశేఖర్(ఉడ్కట్టర్), రాయచోటి నియోజకవర్గం మోతకట్లకు చెందిన జె.వెంకటేశ్వర్లు(పైలెట్), నెల్లూరు జిల్లా దగదర్తి మండలం తడకలూరు గ్రామానికి చెందిన జె.విజుæ(వాహన యజమాని, పైలెట్), కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా కొండషెత్తల్లికి చెందిన అక్రమ్పాషాల(డ్రైవర్)తో కలిసి ముఠాగా ఏర్పడినట్లు తెలిపారు. నెల్లూరు, కడప జిల్లాల్లో ఎర్రచందనం దుంగలను నరికించి చెన్నై, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకునేవారని వివరించారు. పైఅందరిపై చార్జిషీట్లు తెరవనున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు. ఏఎస్పీ పీ పరమేశ్వర్‌రెడ్డి, ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఇన్చార్జి వెంకటరావు, మర్రిపాడు ఎస్సై తిరుపతయ్య పాల్గొన్నారు. -
తరలిపోతున్న ఎర్రసంపద..!
ఎర్ర స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు.. నిత్యం ఎర్రచందనాన్ని భారీగా తరలిస్తున్నారు. రోజూ టన్నుల కొద్దీ ఎర్రసంపద పట్టుపడుతుండడమే ఇందుకు తార్కాణం. ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే రహదారుల వెంబడి భారీ బందోబస్తు ఉంటుంది. దీంతో అక్రమరవాణాకు వీలుపడదని గ్రహించిన స్మగ్లర్లు ఇప్పటి నుంచే బరితెగిస్తున్నారు. రెండు నెలల్లో వీలైనంత అక్రమంగా తరలించి సొమ్ము చేసుకొనే ప్రయత్నంలో ఉన్నారు. అక్రమరవాణాకు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెదుకుతూనే ఉన్నారు. అక్రమరవాణాను అడ్డుకోవడం అధికార యంత్రాంగానికి కత్తిమీద సాములా మారింది. చిత్తూరు ,పుత్తూరు : జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా నిత్యకృత్యమైపోయింది. అడ్డుకునేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా, ప్రతిరోజు టన్నుల కొందీ ఎర్రదుంగలు పట్టుబడుతూనే ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్, అటవీశాఖ, పోలీసులు నిత్యం వెయ్యికళ్లతో తనిఖీలు చేస్తున్నా స్మగ్లర్లు బేఖాతర్ చేస్తున్నారు. మరోవైపు స్మగ్లర్ల బరితెగింపు పతాకస్థాయికి చేరింది. ఏకంగా అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడం అధికారులకు సవాల్‌గా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బరితెగిస్తున్న స్మగ్లర్లు... గతంలో ఎన్నడూ లేని విధంగా ఎర్రచందనం స్మగ్లర్లు అధికార యంత్రాంగానికి సవాల్ విసురుతున్నారు. అధికార వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఎన్నికల సమయంలో మద్యం, డబ్బును అడ్డుకునేందుకు రహదారుల వెంబడి చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేస్తారు. నిత్యం పహారా ఉండడంతో ఎర్రచందనం అక్రమ రవాణా దుర్లభం. దీంతో స్మగ్లర్లు డిసెంబర్, జనవరిలోనే వీలైనంత వరకు అక్రమంగా తరలించేందుకు ఎంతటికైనా బరితెగిస్తున్నారు. ఈ క్రమంలో దాడులకు సైతం వెనుకాడడం లేదు. అరుదైన ఎర్రచందనం రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటకుండా స్మగ్లర్ల పీచమణచాలనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పట్టుబడుతున్న ఎర్రచందనం.. జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వరుసగా దాడులు చేస్తున్నా స్మగ్లర్లు చెలరేగుతూ నే ఉన్నారు. ఒక్క డిసెంబర్లోనే 14 చోట్ల టన్ను ల కొద్దీ ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ అక్రమ రవాణాను పూర్తి అడ్డుకో లేకపోతున్నారనే మాటలు వినబడుతున్నాయి. ♦ ఒక్క పుత్తూరు అటవీశాఖ అధికా>రులే ఈ నెలలో సుమారు రెండు టన్నుల ఎర్రచంద నం స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 9న 64, 26న 77 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ♦ భాకరాపేట పరిధిలో ఈ నెల 23న 58 దుంగలు, 24న ఏకంగా రూ.కోటి విలువచేసే ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. ♦ వడమాలపేట పరిధిలో ఈ నెల 22న 95, 12న పూడి సమీపంలో 26 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ♦ శేషాచలం పరిధిలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఈ నెల 1న 58, 12న 10 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో స్మగ్లర్లు సిబ్బందిపై దాడికి కూడా పాల్పడ్డారు. ♦ ఇవేకాకుండా జిల్లాలోని ఏర్పేడులో 14 దుంగలు, యర్రావారిపాళెంలో 31, పిచ్చాటూరులో, చంద్రగిరిలో 11, తొట్టంబేడులో రూ.2 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. -
తెల్లబోయే ఎర్ర నిజాలు
అడవులు స్మగ్లర్ల గొడ్డలి వేటుకు అంతరించి పోతున్నాయి. ప్రపంచాన్నే తన వైపు తిప్పుకునే శేషాచలంలో అటవీ సంపద హరించుకుపోతోంది. స్వార్థపరుల వ్యాపార దాహానికి ఇక్కడి అరుదైన ఎర్రచందనం వృక్షాలు నేలకొరిగిపోతున్నాయి. దుర్భేద్యమైన అడవుల్లో స్మగ్లర్లు అమూల్య వనరులను కాజేస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, దేశ సరిహద్దులను దాటిస్తున్నారు. వన సంపద దొంగల పాలవడమే కాకుండా పర్యావరణానికి కూడా పెనుముప్పు వాటిల్లుతోంది. రోజుకో వాహనం, పదుల సంఖ్యలో ఎర్ర కూలీలు పట్టుబడుతున్నా.. దీనికి ఎక్కడా పుల్‌స్టాప్ పడడం లేదు. చిత్తూరు, భాకరాపేట: అమూల్యమైన సంపదను కాపాడాల్సిన అటవీ శాఖకు ఖాళీ పోస్టుల సమస్య సవాలు గా మారింది. ఎర్రచందనం వృక్షాలున్న ప్రాంతా ల్లో సైతం పోస్టులు భర్తీ కావడం లేదు. తిరుపతి వన్యప్రాణి విభాగం డీఎఫ్ఓ పరిధిలో చామల, బాలపల్లె అటవీ రేంజ్‌లు ఉన్నాయి. చిత్తూరు జిల్లా చామల, వైఎస్ఆర్ జిల్లా బాలపల్లె రేంజ్లో 28 బీట్లు ఉన్నాయి. ఇందులోని 18 బీట్లలో భారీ ఎత్తున ఎర్రచందనం ఉంది. ఈ ప్రాంతాల్లోనే ఎర్రదండు తరుచూ చొరబడుతోంది. ఇక్కడ సుమారు 50 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ ప్రాంతంలో పనిచేయడానికి సిబ్బందెవరూ ముందుకు రావడంలేదు. దీంతో స్థానికంగా ఉం డే 90 మందిని ప్రొటెక్షన్ వాచర్లుగా తీసుకున్నా రు. వీరి ఏంపికలో అధికారులు అవలంబిస్తున్నతీరుపై విమర్శలున్నాయి. వీరి నియామకం వెనుక ఎర్ర స్మగ్లర్లు, నాయకుల హస్తముందనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులకు పట్టుబడ్డ తరువాతే.... దొరికితే దొంగలన్న చందంగా ఎవరైనా అటవీ శాఖకు చెందిన వారు ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడ్డ తరువాతే ఆ శాఖ స్పందించి చర్యలు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. చామలరేంజ్ పరిధిలో ఇటీవల ఎర్రావారిపాళెం మండలం నెరబైలు సెక్షన్లోనే ఆరుగురు వాచర్లు పట్టుబడ్డారు. వాహనాలను, దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రాబట్టి న సమాచారంతో ఎఫ్‌బీవో చొక్కలింగాన్ని సస్పెం డ్ చేశారు. భాకరాపేట ఫారెస్టు కార్యాలయంలోని గౌడన్ల నుంచి దుంగలు గోడపై నుంచి దాటవేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మదనపల్లెకు చెందిన ఓ స్మగ్లర్‌ను వాచర్‌గా పెట్టుకుని అభాసుపాలయ్యారు. ఇలా పట్టుబడ్డాక చర్యలు తీసుకునే కంటే వారిపై ముందుగానే నిఘావేయాల్సి ఉంది. అటవీ శాఖకు ఆయుధాలు కొరత.. ఆయుధాలు కొరత కూడా సమస్యగా తయారైనట్లు తెలిసింది. ఇద్దరు అధికారులు స్మగ్లర్ల చేతిలో హతమయ్యాక ఎర్రకూలీలను అడ్డు కోవాలంటే వారికి అత్యాధునికి ఆయుధాలు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. అమెరికా నుంచి 200 అధునాతన ఆయుధాలను దిగుమతి చేసుకుంది. ఇవి ఇక్కడకు చేరలేదు. ఢిల్లీలోనే ఇవి తుప్పుబడుతున్నాయని తెలిసింది. ఎర్రచందనం అమ్మి భారీగా నగదును ప్రభుత్వ ఖజానాకు జమ చేసుకున్న ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీకి రూ.29 లక్షలు చెల్లించనందుకు అవి విమానాశ్రయం దాటలేదని భోగట్టా. కాగా అటవీశాఖలో జరిగే అవినీతికి యువ ప్రొటెక్షన్ వాచర్లను తమకు రక్షణ కవచంగా అటవీ అధికారులు మల్చుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఏదో ఒక ఉద్యోగం అనుకుని చేరి చివరికి జైలు ఊసలు లెక్కపెడుతున్నారు చాలా మంది యువకులు. అటవీ అధికారులే వారిని ఆ విధంగా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నెరబైలు సెక్షన్లో పట్టుబడ్డ వాచర్లు తమ అధికారుల తీరును తప్పుబట్టినట్లు తెలిసింది. పట్టించుకోని ప్రభుత్వం.. అటవీశాఖలో అవినీతిని ప్రభుత్వం ఏమాత్రం పట్టిం చుకోవడంలేదు. టెండర్ల ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించడంలో ఉన్న శ్రద్ధ ఎర్రచందనం కాపాడడంలో లేదు. అమ్మకంలో వచ్చిన ఆదాయంలో 30 శాతం రక్షణకు వెచ్చిస్తున్నట్లు చెబుతున్నా ఆమేరకు నిధులు విడుదల కావడం లేదు. రోజు పదుల సంఖ్యలో ఎర్ర కూలీలు పట్టుబడుతున్నారు. వీరి నుంచి సమాచారాన్ని రాబట్టి కోర్టుకు హాజరు పరిచేలోపు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇందుకు ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకపోవడం కూడా అవినీతికి కారణంగా భావిస్తున్నారు. -
ఎర్రచందనం స్మగ్లర్లపై ప్రత్యేక నిఘా
నెల్లూరు ,సంగం: జిల్లాలో ఎర్రచందనం అక్రమంగా తరలి వెళ్లకుండా స్మగ్లర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా అటవీశాఖ అధికారి సి.వేణుగోపాల్‌రావు తెలిపారు. మండల కేంద్రమైన సంగం కొండపై ఎన్ఆర్జీఎస్ పథకం కింద నాటిన మొక్కలను బుధవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నెల్లూరు – ముంబై జాతీయ రహదారి పక్కనే ఉన్న సంగం కొండపై 50 హెక్టార్ల విస్తీర్ణంలో ఎన్ఆర్జీఎస్ పథకం కింద మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 10 హెక్టార్లలో మొక్కలు నాటడం పూర్తైందన్నారు. 50 హెక్టార్లలో తాము నాటించే మొక్కలు పెరిగితే సంగం గ్రామం పర్యాటక కేంద్రంగా కూడా ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటికే ఎర్రచందనం అక్రమంగా తరలించే నేరస్తులపై పోలీసులు, అటవీ శాఖ కలిసి ఉక్కుపాదం మోపి పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టేలా చేశామన్నారు. అంతేకాకుండా ఎర్రచందనం ఉన్న ప్రాంతాల్లో అటవీ సిబ్బందికి త్వరలో రివాల్వర్లు అందజేస్తామన్నారు. ఆ ప్రాంతంలో క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సంగం ప్రాంతంలో కాంటూరు కందకాలు, ఫారంపాండ్స్ తదితరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు మంగమ్మ, ఎస్డీ బాబు, హరి, రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
44 ఎర్ర దుంగలు స్వాధీనం
చిత్తూరు, పిచ్చాటూరు: రెండు వాహనాలు సహా 44 ఎర్రచందనం దుంగలు, స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు వ్యక్తులు పట్టుబడ్డ సంఘటన మండలంలోని రెప్పాలపట్టు వద్ద చోటు చేసుకుంది. వివరాలను ఏఎస్పీ (ఆపరేషన్) క్రిష్ణార్జునరావు పిచ్చాటూరు పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. మంగళవారం సాయంత్రం రెప్పాలపట్టు వద్ద మండల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో కేవీబీ పురం నుంచి వస్తున్న రెండు వాహనాలను తనిఖీ చేశారు. అందులో 44 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. వీటిని తరలిస్తున్న తమిళనాడు కాంచీపురంవాసులు యం.భాస్కర్(34), పుగయేంది(30), బి.ప్రభు (35), జె.హుస్సేన్ (32) నలుగురిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఏఎస్పీ, పుత్తూరు రూరల్ సీఐ దైవప్రసాద్లు స్టేషన్‌కు చేరుకొని దుంగలను పరిశీలించారు. దాడిలో పాల్గొన్న పోలీసు సిబ్బంది భరత్, మణి, గణేష్‌లతో పాటు సీపీఓ లోకలకు ఏఎస్పీ రివార్డులు అందించి అభినందించారు. స్మగ్లర్లపై కేసు నమోదు చేసి బుధవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. మావేశంలో ఎస్ఐలు రామాంజనేయులు, మల్లి ఖార్జున, వీరేష్, సిబ్బంది రామయ్య, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. ఎర్రచందనం స్వాధీనం చంద్రగిరి: శేషాచలం నుంచి అరుదైన ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసేందుకు యత్నించిన స్మగ్లర్ల నుంచి 11 దుంగలను టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఎస్ఐ వాసు కథనం మేరకు... స్మగ్లర్ల ఉన్నట్లు రహస్య సమాచారంతో సోమవారం రాత్రి ఆర్ఎస్ఐ బృందం కూంబింగ్ ప్రారంభించింది. మండల పరిధిలోని శేషాపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున స్మగ్లర్ల జాడను టాస్క్‌ఫోర్స్ బృందం గుర్తించారు. అక్కడ నుంచి బయటకు వచ్చే మార్గంలో మరో బృందాన్ని పంపించారు. బీమవరం బీట్ నిలవరాతి కోన వద్ద స్మగ్లర్లు దుంగలు తీసుకెళ్లడం గమనించారు. అధికారులను గుర్తించిన స్మగ్లర్లు దుంగలను వెంటనే పడేసి పరుగులు తీశారు. సిబ్బంది 11 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఐజీ కాంతారావు సంఘటన స్థలానికి చేరుకుని స్వాధీనం చేసుకున్న ఏ గ్రేడ్ దుంగలను పరిశీలించారు. చంద్రగిరి పట్టణానికి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. సిబ్బందిని డీఐజీ అభినందించారు. కార్యక్రమంలో ఏసీఎఫ్ కృష్ణయ్య, ఆర్ఐ చంద్రశేఖర్, సీఐ కొండయ్య, ఎఫ్ఆర్ఓలు లక్ష్మిపతి, ప్రసాద్, ఎస్ఐ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ రెచ్చిపోయిన ఎర్ర స్మగ్లర్లు
చిత్తూరు ,భాకరాపేట : భాకరాపేట ఘాట్ రోడ్డు మార్గంలోని అడవుల్లో తమిళ స్మగ్లర్లు భారీ స్థాయిలో విరుచుకుపడినట్లు టాస్క్ పోర్స్ ఐజీ కాంతారావు పేర్కొన్నారు. ఆయన కథనం..రహస్య సమాచారం మేరకు శనివారం అర్ధరాత్రి తిరుపతి టాస్క్ ఫోర్స్ బృందం, ఆర్ఎస్ఐ వాసు బృందం భాకరాపేట ఘాట్ రోడ్డుకు చేరుకుంది. వాహనాలు తనిఖీలు చేస్తూ అటవీ ప్రాంతాన్ని నిశితంగా గమనించసాగారు. అయితే అడవిలో నుంచి మినుకు మినుకు మంటూ వెలుతురు వస్తుండడంతో అనుమానించారు. ఆ వైపు వెళ్లి పరిశీలించారు. 30 మంది వరకు అడవిలో నడుస్తూ వెళుతున్నట్లు గుర్తించి, వారిని పట్టుకునేందుకు యత్నించారు. వారు దుంగలు పడేసి పారిపోయేందుకు యత్నించారు. దీంతో దుంగల వద్ద కొంతమంది సిబ్బందిని కాపలా ఉంచి వారిని వెంబడించారు. మరో వైపు నుంచి శబ్దం రావడంతో అటుకేసి పరుగులు తీశారు. సుమారు 40–50 మంది వరకు ఉన్న స్మగ్లర్లు టాస్క్ఫోర్స్పై దాడికి తెగబడ్డారు. రాళ్లు, గొడ్డళ్లు, కత్తులు విసరడంతో టాస్క్ ఫోర్స్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపింది. దీంతో స్మగ్లర్లు పారిపోయారు. సంఘటన స్థలంలో 55 దుంగలను స్వాధీనం చేసుకున్నారన్నారు. పరిసర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ మరో 3 దుంగలను గుర్తించింది. ఇవన్నీనూ ఏ–1 గ్రేడ్ కలిగినవి కావడం గమనార్హం! కొనసాగుతున్న కూంబింగ్ పరారైన స్మగ్లర్లను పట్టుకునేందుకు శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా శేషాచలం అటవీ సరిహద్దు గ్రామాలు, భాకరాపేట, ఎర్రావారిపాళెం మండలాల్లోని చెక్ పోస్టులు, సీసీ కెమెరాల పుటేజీలను ఎప్పటికప్పుడు తీసుకుని వాటిని పరిశీలిస్తున్నట్లు ఐజీ తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ వెంకటరమణ, ఏసీఎఫ్ కృష్ణయ్య, ఎఫ్ఆర్ఓలు లక్ష్మీపతి, ప్రసాద్, సీఐ కొండయ్య, ఆర్ఐ భాస్కర్, ఎస్ఐ సోమశేఖర్‌తోపాటు డాగ్ స్క్వాడ్, నైట్ పెట్రోలింగ్ స్క్వాడ్, వాసు బృందం పాల్గొంది. స్మగ్లర్ల సంచుల్లో వన్య ప్రాణులకళేబరాల అవశేషాలు! స్మగ్లర్లు ఎప్పుడు పట్టుబడినా ఆహార పదార్థాలు, బట్టలు లభించేవి..అయితే ప్రస్తుతం బ్యాగుల్లో జంతు కళేబరాల అవశేషాలు (కొండముచ్చు కాళ్లు, చిన్న కోతి చర్మం, బెట్లుడత తోక), వీటితో పాటు తుపాకీ గుండ్లకు ఉపయోగించే సీసం స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే స్మగ్లర్లు, ఎర్రకూలీలు మారణాయుధాలతో సంచరిస్తూ వన్యప్రాణులను కూడా వేటాడుతున్నట్టు తేలింది. -
పెళ్లి కారులో ఎర్రచందనం
తిరుపతిసిటీ: పెళ్లికి ముస్తాబు చేసిన కారులో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న నలుగురు స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐ వాసు కథనం మేరకు.. కరకంబాడి రోడ్డులోని మంగళం క్వార్టర్స్ గృహాల మధ్య కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు నిర్మానుష్య ప్రాంతంలో పెళ్లికి ముస్తాబు చేసిన స్క్వాడా కారు కనిబడింది. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తనిఖీ చేశారు. ఎర్రచందనం దుంగలు కనిపించాయి. నలుగురు వ్యక్తులు వుండడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిండ్ర మండలానికి చెందిన దొరవేలు, మంగళంకు చెందిన దిలీప్‌కుమార్, తేజ, నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలానికి చెందిన మస్తాన్‌లుగా గుర్తించారు. -
ఎర్రచందనం అక్రమరవాణాకు పచ్చ కార్పెట్
అధికారపార్టీ నేతలు అక్రమార్జనే పనిగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఏ అవకాశాన్నీ వదులు కోవడం లేదు. కొందరు ఎర్రచందనం అక్రమ రవాణాను ఎంచుకున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ కార్యకలాపాలను పెంచేశారు. పోలీసు అధికా రుల మద్దతుతో రెచ్చిపోతున్నారని తెలిసింది. స్మగ్లర్ల ముసుగులో ఎర్రబంగారాన్ని సరిహద్దులు దాటిస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి. తద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇటీవల జరిగిన సంఘటనలే ప్రబలసాక్ష్యాలు. సాక్షి, తిరుపతి: జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాలో టీడీపీ నాయకుల పాత్ర అధికంగా కనిపిస్తోంది. కురబలకోట పరి«ధిలో ఇటీవల 170 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ.3 కోట్లు విలువచేసే దుంగలు ఒకేసారి పట్టుబడటం వెనుక కొందరు పోలీసుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పట్టుబడ్డ ఎర్రచందనం లారీకి ఎస్కార్ట్ ఓ పోలీసు వాహనం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ దృష్టిలో తాము బాగా పనిచేస్తున్నామనిచెప్పుకునేందుకు ఇలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకేసారి అన్ని విలువైన దుంగలు పట్టుబడ్డటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా కొందరు పోలీసులు పనికట్టుకుని ఏర్పాటు చేసిందేనని భోగట్టా. దుంగలన్నీ టీడీపీ నేతలు, పోలీసులు కలిసి దాచిపెట్టిన వాటిలో కొన్ని మాత్రమేనని తెలిసింది. డంప్‌చేసిన ఎర్రచందనంలో 25శాతం దుంగలే. ♦ ఎర్రావారిపాళెం చెరుకువారిపల్లి పరిధిలో 15 రోజుల క్రితం పట్టుబడిన స్మగ్లర్లను విచారిస్తే చిన్నగొట్టిగల్లుకు చెందిన ఇద్దరు టీడీపీ నాయకుల పేర్లు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులకు ఫోన్ కాల్స్ రావడంతో ఆ ఇద్దరినీ విచారణ నుంచి మినహాయించారు. స్మగ్లర్లను విడిచిపెట్టకుండా పీలేరు సబ్‌జైలుకు తరలించారు. వారిని విడిచిపెడితే టీడీపీ నేతల పేర్లు బహిర్గతమవుతాయని ఇలా చేసినట్లు తెలిసింది. ♦ ఎర్రావారిపాళెం మండలంలో 13 రోజుల క్రితం ఎర్రచందనం అక్రమ రవాణాకు ఎస్కార్ట్‌గా వెళుతున్న ఇన్నోవా కారును అధికారులు పట్టుకున్నారు. కారు యజమాని అధికార పార్టీ నేత. అతను పలుకుబడిని ఉపయోగించి కేసు నుంచి తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేపట్టారు. అందరికీ తెలిసిపోయిందని, తామేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేసినట్లు తెలిసింది. చివరికి కారు ఇవ్వకపోయినా ఫర్వాలేదని, కేసులో లేకుండా చేయమని ఒత్తిళ్లు చేయించినట్లు తెలిసింది. బహుమతిగా ఆ కారును తీసుకోమని పోలీసులకు ఆఫర్ చేసినట్లు సమాచారం. కారు విషయం గానీ, ఆ వాహనం యజమానిపై ఎక్కడా కేసు నమోదు కాకపోవటంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ♦ శేషాచలం అటవీ సరిహద్దు మండలాలు టీడీపీ నేతల ఎర్రచందనం వ్యాపారానికి కేరాఫ్‌గా మార్చుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు కొంతకాలంగా పీలేరు, ఎర్రావారిపాళెం, బాకరా పేట, చిన్నగొట్టిగల్లు వైపు దృష్టి సారించటం లేదు. ఇందుకు టీడీపీ నేతల ఒత్తిళ్లే కారణమని తెలిసింది. ♦ కొంతకాలంగా పీలేరు రూరల్ సర్కిల్ (భాకరాపేట) పరిధిలో కొంతమంది ఆటోడ్రైవర్లు, వివిధ వాహనాల డ్రైవర్లు రాత్రి సమయాల్లో ఇసుక రవాణా చేస్తున్నారు. ఇందులో ఎర్రచందనం దుంగలను సరిహద్దు దాటిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులు రూట్ క్లీయర్ చేసి పంపుతున్నట్లు సమచారం. తూతూ మంత్రంగా అమాయకులపై కేసులు .... ఎర్రచందనం రవాణాలో ఎవరైనా పట్టుబడితే వారు ఎవరు? ఏ పార్టీకి చెందిన వారు? అని విచారించిన మీదటే కేసు నమోదు చేయాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటున్నారు. అధి కార పార్టీకి చెందిన వారైతే విడిచిపెడుతున్నారని భోగట్టా. వారి స్థానంలో అమాయకులను తీసుకొచ్చి కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందనే ఆరోపణలున్నాయి. ఈ మధ్య పీలేరు రూరల్ సర్కిల్ పరిలో పట్టుబడిన వారిని తప్పించి అమాయకులను తీసుకొచ్చి కేసులుపెడుతున్నారని తెలిసింది. ఎవరైనా పట్టుబడినట్లు బయటకు తెలిస్తేనే మీడియాకు తెలపాలని కొందరు పోలీసులు కిందిస్థాయి వారికి హుకుం జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పట్టుబడ్డ వారిలో అధికార పార్టీ వారు అయితే సంబంధిత టీడీపీ నాయకుడికి చెప్పి పంపించమని ఆదేశాలున్నట్లు చెబుతున్నారు. -
ఎర్ర స్మగ్లర్ అరెస్ట్
చిత్తూరు, చంద్రగిరి: శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రస్మగ్లర్‌ను అరెస్టు చేసినట్టు ఆర్ఎస్ఐ వాసు తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఎర్రస్మగ్లర్లు అధిక సంఖ్యలో శేషాచలంలోకి ప్రవేశించినట్లు సమాచారం అందిందన్నారు. తాను బృందంతో కలిసి గురువారం ఉదయం కూంబింగ్ చేపట్టామన్నారు. స్మగ్లర్ల అడుగు జాడలను బట్టి రెండు బృందాలుగా విడిపోయి కూంబింగ్ చేపట్టామని తెలిపారు. తమ రాకను పసిగట్టిన స్మగ్లర్లు ఒక్కసారిగా రాళ్లు, గొడ్డళ్లతో దాడికి యత్నించారని పేర్కొన్నారు. పీసీలు శీను, ముత్యాలు స్వల్పంగా గాయపడ్డారని తెలిపారు. దీంతో గాలిలోకి ఒక రౌండ్ కాల్పులు జరపడంతో దుండగులు తలోదిక్కుకు పారిపోయేందుకు ప్రయత్నించారని వివరించారు. ఈ సమయంలో సేలం జిల్లాకు చెందిన సుబ్రమణిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఆయుధాలు, నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
భారీగా ఎర్రచందనం పట్టివేత
కురబలకోట: కురబలకోట మండలంలోని రైల్వే స్టేషన్ బస్టాప్ సమీపంలో లారీలో తరలిస్తున్న ఎ ర్రచందనాన్ని ముదివేడు పోలీసులు పట్టుకున్నారు. గురువారం కడప నుంచి బెంగళూరుకు ఎర్రచందనంతో వెళుతున్న ఈలారీని హైజాక్ చేసేందుకు బొలెరోలో వచ్చిన మరికొందరు స్మగ్లర్లు ప్రయత్నిస్తుండగా ఊహించని విధంగా పోలీసులకు చిక్కారు . 4,253 కిలోల బరువున్న 146 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ముగ్గురు స్మగ్లర్లు పరారు కాగా డ్రైవర్ పోలీసులకు చిక్కాడు. జిల్లాలో పెద్ద ఎత్తున ఎర్రచందనం పట్టుకోవడంతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సీఐ మురళీ కృష్ణ, ఎస్ఐ నెట్టి కంఠయ్య, స్థానిక పోలీసులను అభినందించారు. గురువారం రాత్రి ఆయన ముదివేడు స్టేషన్‌లోని ఎర్రచందనాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘కడప నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్నట్లు ముదివేడు పోలీసులకు సమాచారం వచ్చింది. కురబలకోట రైల్వే స్టేషన్ బస్టాప్ సమీపంలో లారీని పట్టుకున్నారు. లారీ డ్రైవర్ ఎన్. రాజును అరెస్టు చేశాం. ఇతను కర్ణాటకలోని అత్తులూర్లోని నార్త్కోడ్కు చెందినవాడు. ఎర్రచందనం తరలిస్తున్న లారీ నంబరు కూడా కర్ణాటకకు చెందినదే. లారీని సీజ్ చేసి స్మగ్లర్ల కోసం దర్యాప్తు చేస్తున్నాం’ అని ఎస్పీ పేర్కొన్నారు. హైజాక్ చేసి... కడప నుంచి బెంగళూరు వెళుతున్న ఎర్రచందనం లారీని బొలోరా వాహనంలో వెంటాడిన స్మగ్లర్లు హైజాక్ చేసేందుకు ప్రయత్నించారు. కురబలకోట రైల్వే బస్టాప్ సమీపంలో ఈ లారీకి బొలెరో వాహనాన్ని అడ్డుపెట్టి హైజాక్ చేశారు. అదే సమయంలో ఖాకీ డ్రస్సులో డ్యూటీకి వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను పోలీసుగా భావించి అటు లారీలోని వారు ఇటు బొలేరోలో వచ్చిన హైజాక్ ముఠా పరారయ్యారు. విషయాన్ని పసిగట్టి ఆర్టీసీ డ్రైవర్ ముదివేడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి లారీని తనిఖీ చేయగా ఎర్రచందనం బయటపడింది. జిల్లా ఎస్పీకి తొలికేసు..!! జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం చిత్తూరులో బాధ్యతలు స్వీకరించారు. తొలి రోజే భారీ ఎర్రచందనం లారీ ముదివేడు పోలీసులకు పట్టుబడింది. ఇంత భారీ స్థాయిలో ఎర్రచందనం పట్టుబడటం ఇదే తొలిసారని పోలీస్ అధికారులు చెబుతున్నారు. -
తరలిపోతున్న ఎర్ర బంగారం
తిరుపతి సిటీ: రాష్ట్రంలో ఐదు జిల్లాల్లోని అడవుల్లో ఉన్న అరుదైన ఎర్రచదనం స్మగ్లర్ల పాలవుతోంది. ఈ అక్రమ రవాణా గత 30 ఏళ్లకు పైగా జరుగుతూనే వుంది. ఎక్కువగా తమిళనాడు రా ష్ట్రం జవ్వాదిమలై కొండల్లోని గిరిజన తెగలకు చెం దిన వేల కుటుంబాలు ఈ చెట్లను నరుకుతున్నట్లు సమాచారం. ఎర్రచందనం అక్రమ రవాణాకు ఎం తోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏస్థాయిలో ఏవిధంగా ఎలాంటి వారు ఈ రవాణాలో పాల్గొంటారనే దానిపై స్పష్టత రావడం లేదు. ఎర్రచందనానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పడిన తర్వాత కొంతవరకు అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. అయితే స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్తమార్గాలను అన్వేషిస్తూ.. ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ ఐజీ డాక్టర్ మాగంటి కాంతా రావు ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి దశలవారీగా అక్రమ రవాణా మూలాలను గుర్తించారు. ఆ వివరాల ప్రకారం ఎర్రచందనం సంపద ఏడు దశల్లో స్మగ్లర్లు నిర్వహిస్తున్నారు. రవాణా ఇలా.. మొదటిదశలో తమిళనాడులోని అటవీప్రాంతాల్లో చెట్లను నరకడంలో సిద్ధహస్తులైన గిరిజన తెగలకు చెందినవారికి నగదు ఆశ చూపించి ఇక్కడికి రప్పిస్తారు. రెండవ దశలో గిరిజన తెగలకు చెందిన వారు నరికిన దుంగల బరువుకు తగిన విధంగా అడవుల్లోనే నగదు చెల్లింపులు చేస్తారు. ఈ దశలో మేస్త్రి కీలకపాత్ర పోషిస్తాడు. మూడవ దశలో నరికిన దుంగలను మేస్త్రి చెప్పినచోటకు చేర్చి అక్కడ ఏర్పాటు చేసిన వాహనంలో లోడ్ చేయడంతో తమిళనాడు స్మగ్లర్ల పని సమాప్తమవుతుంది. లోడ్ చేసిన వాహనాన్ని అనుకున్న చోటకు చేర్చడంలో వాహన డ్రైవర్‌కు.. పైలెట్‌గా వ్యవహరించే వ్యక్తి సమాచారం అందిస్తారు. నాల్గవ దశలో వాహనాన్ని తీసుకెళ్లడం, లోడ్ చేసిన వాహనాన్ని గమ్యస్థానం చేరేవరకు వివిధ రకాల వ్యూహాలను అనుసరించే ట్రాన్స్పోర్టర్ ముఖ్య పాత్ర పోషిస్తాడు. ఐదవదశలో వాహనంలో వచ్చిన ఎర్రచందనం దుంగలను గోడౌన్లలో భద్రపరచడం, వాటిని కాపలా కాసే వ్యక్తి గోడౌన్ కీపర్‌గా వ్యవహరిస్తాడు. ఆరవ దశలో గోడౌన్ నుంచి విదేశాలకు పంపేందుకు కావాల్సిన అనుమతులు సృష్టించడం, దానికోసం లంచాలు ఇచ్చి విదేశాలకు ఎగుమతి చేయడంలో ఎక్స్‌పోర్టర్ కీలకపాత్ర పోషిస్తాడు. ఇక ఏడవ దశలో ఎక్స్‌పోర్టర్ పంపిన దుంగలను అందుకుని వాటిని విక్రయిం చే ఇంటర్నేషనల్ స్మగ్లర్ చివరగా పని పూర్తి చేస్తాడు. ఈ విషయాన్ని టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు తన బృందంతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక రూపొందించారు. దుంగలను స్మగ్లింగ్ చేసే క్రమంలో ఒకవ్యక్తికి.. మరో వ్యక్తి ప్రత్యక్ష సంబంధం లేకపోవడం ఇందులో గమనించాల్సి అంశమని టాస్క్ఫోర్సు పోలీసులు చెబుతున్నారు. అర్ధరాత్రి అడవుల్లోవాహనాలు కనపడితే.. శేషాచల అటవీ శివార్లు, కరకంబాడీ, మామండురు, జూపార్క్ రోడ్డు, శ్రీవారి మెట్టు, భాకరాపేట తదితర చోట్ల తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబరు కలిగిన వాహనా లు కనపడితే ఆయా ప్రాంతాల్లో మాటువేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అప్రమత్తం అవుతా రు. కూంబింగ్ చేస్తున్న సిబ్బంది వెంటనే ఆ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించడం, ఆ వాహనాలు ఎక్కడికి వెళ్తున్నాయనే దిశగా పూర్తిస్థాయి నిఘా పెడుతున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా.. వెంటనే తమ అధీనంలోకి తీసుకుని సోదాలు చేసి అరెస్టు చేశారు. ఇటీవల అనుమానం వచ్చిన నాలుగైదు వాహనాలను సోదాలు చేయడంతో.. ఎర్రచందనం దుంగలు భారీగా పట్టుబడ్డాయి. ఒక వాహనానికి బీటెక్ చదివిన యువకుడు డ్రైవర్‌గా వచ్చి పోలీసులకు చిక్కాడు. గతంలోనూ డీగ్రీ, పీజీ చదివిన యువకులు స్మగ్లింగ్ కోసం వచ్చి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు దొరికిపోయారు. -
ఎర్రచందనం రవాణాకు స్మగ్లర్ల బంపర్ ఆఫర్
ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు తమ పని పూర్తి చేసుకుంటున్నారు. శేషాచలం అడవుల నుంచి నెల్లూరు జిల్లా మీదుగా కోల్‌కతా, ఇటు నాలుగో నెంబరు జాతీయ రహదారి మీదుగా కర్ణాటకకు దుంగలను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు లారీలు, టెంపోల్లో తరలిస్తున్న దుండగులు ఇప్పుడు ఏ మాత్రం అనుమానం రాకుండా టమాటా లారీలు, ట్యాంకర్లు, కొరియర్ వాహనాలు, ఆంబులెన్స్‌లు, లగేజీ ఆటోల్లో దుంగలను తరలిస్తున్నారు. దీన్నిబట్టి వీరికి ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. పక్కా సమాచారం ఉంటే తప్ప పోలీసులు ఈ వాహనాలను గుర్తించలేకపోతున్నారు. చిత్తూరు, పలమనేరు: కర్ణాటకాలోని కోలారు, బెంగళూరు, జిల్లాలోని మదనపల్లి, పలమనేరు ప్రాంతాల నుంచి నిత్యం వందలాది లారీల ద్వారా టమాటాల ను కలకత్తాకు ఎగుమతి అవుతున్నా యి. ఈ లారీలు ఎర్రచందనం దుంగల రవాణాకు సురక్షితమని భావించిన స్మగర్లు జిల్లా సరిహద్దులో కాపుకాచి డ్రైవర్లతో మాట్లాడుకుని టమాటా బా క్సుల కింద దుంగలను అమరుస్తున్నారు. మామూలుగా టమాటా లోడు తీసుకెళితే లారీ యజమానికి ఖర్చులు పోను రూ.పది వేలు మిగులు తోంది. ఎర్రచందనం దుంగలను టమాటాలతో కలిపి తీసుకెళితే రూ.5 లక్షలు మిగులుతుందనే ఆశ పడుతున్నారు. ఇటీవల పలమనేరు పట్టణా నికి చెందిన టమాటా లారీలో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా ఆత్మకూరు అటవీ శాఖ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. దురాశకు పోయి దొరికిపోతున్నారు పలమనేరు, పుంగనూరు, వీకోట, కర్ణాటకలోని ముళబాగిళు, కోలారు, బంగా ర్‌పేట్ తదితర ప్రాంతాల్లో టమాటాలు తోలే లారీలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్నాళ్లు డ్రైవర్లుగా ఉన్న వారు ఫైనాన్స్‌లో లారీలు కొని త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈ రొచ్చులోకి దిగుతున్నారు. స్మగర్లు సైతం సరుకు లారీలో వేసుకుంటే రూ.5 లక్షల వరకు స్పాట్ పేమెంట్ ఇస్తూ బంపర్ ఆఫర్ పెట్టినట్టు తెలిసింది. ఆత్మకూరులో పట్టుబడిన పలమనేరుకు చెందిన డ్రైవర్ నాలుగు నెలల క్రితం ఆ లారీని తమిళనాడులోని గుడియాత్తంలో ఫైనాన్స్‌లో కొన్నట్టు తెలిసింది. అనుమానం రాకుండా.. చిత్తూరు జిల్లా నుంచి కర్ణాటకలోకి గానీ లేదా నెల్లూరు జిల్లా మీదుగా ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించాలంటే ఎక్సైజ్, ఫారెస్ట్, ఆర్టీవో, అగ్రికల్చర్ చెక్‌పోస్టులను దాటాలి. ఎవరికీ అనుమానం రాకుండా అనేక ఎత్తుగడలు వేస్తున్నారు. జిల్లా నుంచి కోల్‌కతాకు విత్తన కోడిగుడ్ల (హ్యాచరీ ఎగ్స్)ను తరలించే పలు ఏసీ కంటైనర్లు ఉన్నాయి. వీరు కోల్‌కతాలో ఎగ్స్‌ను దింపి అక్కడి నుంచి చెన్నైకి మాంసాన్ని తీసుకొస్తారు. ఇలాంటి ఏసీ వాహనాల్లోనూ దుంగలను తరలిస్తున్నట్టు సమాచారం. గతంలో పలమనేరు చెక్‌పోస్టు వద్ద పార్సిల్ కొరియర్ వాహనంలో ఎర్రచందనం దుంగలను పట్టుకున్న విషయం తెలిసిందే. ట్యాంకర్లో ఎర్రదుంగలను పెట్టి రవాణా చేస్తుండగా స్థానిక పోలీసులు పట్టుకున్నారు. దీంతో పాటు ఖరీదైన కార్లను స్మగ్లర్లు వాడుతుండడం గమనార్హం. ఇదే రీతిలో శుక్రవారం పుంగనూరులో ఓ ఖరీదైన కారులో రవాణా అవుతున్న దుంగలను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. మరికొందరు ప్రైవేటు అంబులెన్స్‌లలో సైతం సైరన్ మోగిస్తూ దుంగలను తరలిస్తున్నట్టు సమాచారం. ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాను అరికట్టేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్, ఫారెస్ట్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు మాత్రం దుంగలను వెస్ట్‌బెంగాల్, కర్ణాటకకు తరలిస్తుండడం కొసమెరుపు.