సంగం కొండపై అధికారులతో మాట్లాడుతున్న వేణుగోపాల్‌రావు
నెల్లూరు ,సంగం: జిల్లాలో ఎర్రచందనం అక్రమంగా తరలి వెళ్లకుండా స్మగ్లర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా అటవీశాఖ అధికారి సి.వేణుగోపాల్‌రావు తెలిపారు. మండల కేంద్రమైన సంగం కొండపై ఎన్‌ఆర్‌జీఎస్ పథకం కింద నాటిన మొక్కలను బుధవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నెల్లూరు – ముంబై జాతీయ రహదారి పక్కనే ఉన్న సంగం కొండపై 50 హెక్టార్ల విస్తీర్ణంలో ఎన్‌ఆర్‌జీఎస్ పథకం కింద మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
10 హెక్టార్లలో మొక్కలు నాటడం పూర్తైందన్నారు. 50 హెక్టార్లలో తాము నాటించే మొక్కలు పెరిగితే సంగం గ్రామం పర్యాటక కేంద్రంగా కూడా ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటికే ఎర్రచందనం అక్రమంగా తరలించే నేరస్తులపై పోలీసులు, అటవీ శాఖ కలిసి ఉక్కుపాదం మోపి పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టేలా చేశామన్నారు. అంతేకాకుండా ఎర్రచందనం ఉన్న ప్రాంతాల్లో అటవీ సిబ్బందికి త్వరలో రివాల్వర్లు అందజేస్తామన్నారు. ఆ ప్రాంతంలో క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సంగం ప్రాంతంలో కాంటూరు కందకాలు, ఫారంపాండ్స్ తదితరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు మంగమ్మ, ఎస్‌డీ బాబు, హరి, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment