అటవీ శాఖ కార్యాలయం వద్ద ఉన్న లారీ, కారు
తొట్టంబేడు : ఓ లారీలో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నట్లు పక్కా సమాచారంతో అటవీ శాఖ సిబ్బంది మాటు వేసి పట్టుకున్నారు. ఆ లారీకి ఎస్కార్ట్‌గా ముందు వెళుతున్న ఇన్నోవా కారునూ పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాలనూ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఏమైందో ఏమో గానీ ఉదయానికల్లా లారీ, కారు మాయమయ్యాయి. నెల్లూరు వైపు నుంచి పిచ్చాటూరు మార్గంలో బియ్యం బస్తాల మాటున ఓ లారీలో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నట్లు ఆదివారం అర్ధరాత్రి శ్రీకాళహస్తి అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందింది.
తొట్టంబేడు మండలం లక్ష్మీపురం సమీపంలో మాటు వేసి లారీని సిబ్బంది పట్టుకున్నారు. దాని ముందు ఎస్కార్ట్‌గా వెళుతున్న ఇన్నోవా కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఎస్టార్ట్ వాహనం స్విఫ్ట్ కారు సిబ్బంది కళ్లు కప్పి తప్పించుకుంది. పట్టుబడిన లారీ, కారును తొట్టంబేడు ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న అటవీ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. లారీలో 10 టన్నులకుపైగా చౌక దుకాణాల బియ్యం, ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. రాత్రి పూట లారీ పట్టుబడినందున రేంజర్ వచ్చాక లోడ్‌ను పరిశీలించి విషయం తెలియజేయనున్నట్లు అదేరోజు విలేకరులకు తెలిపారు. అయితే మరుసటి రోజు సోమవారం లారీ, కారును పంపేశారు. ఇదేమని అడిగితే సిబ్బంది పొంతన లేని సమాధానాలు తెలిపారు. దీనిపై స్థానిక ఫారెస్ట్ రేంజర్ వెంకటసుబ్బయ్యను వివరణ కోరగా ఈ సంఘటనకు సంబంధించి తనకేమీ తెలియదని, విచారిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment