‘ఎర్ర’దండు..శేషాచలం గుండు | Sandlewood Smuggling in Seshachalam Forests Chittoor | Sakshi
Sakshi News home page

‘ఎర్ర’దండు..శేషాచలం గుండు

Published Sat, Dec 28 2019 10:34 AM | Last Updated on Sat, Dec 28 2019 10:34 AM

Sandlewood Smuggling in Seshachalam Forests Chittoor - Sakshi

స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు(ఫైల్‌)

చిత్తూరు, ఎర్రావారిపాళెం: ఎర్రచందనం అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపుతామని అటవీశాఖ ఉన్నతాధికారులు పదే పదే చెబుతున్నా దీనికి అడ్డుకట్ట పడటం లేదు. ఎర్రదుంగలను తరలిస్తూ తరచూ వాహనాలతో సహా పట్టుపడుతున్న స్మగ్లర్లు, కూలీలు ఉదంతాలే ఇందుకు నిదర్శనంగా ఉంటున్నాయి. పీడీ యాక్టు ప్రయోగించి జైళ్లకు పంపుతున్నా, శేషాచలంలో కూంబింగ్‌ విస్తృతంగా చేస్తున్నా స్మగ్లర్లు, కూలీలు వెరవడం లేదు. అక్రమ రవాణాకు సరికొత్త ఎత్తుగడలను అనుసరిస్తూ అధికారులకు సవాల్‌ విసురుతున్నారు. మరోవైపు ఇంటిదొంగలుగా గుట్టుగా ‘ఎర్ర’దొంగలకు సహకారం అందిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. కొంచెం రిస్క్‌ తీసుకుంటే చాలు..పెద్దమొత్తంలో ఆదాయం కళ్లజూస్తుండడంతో కూలీలుగా ప్రస్థానం మొదలై కోట్లకు పడగలెత్తిన స్మగ్లర్లూ లేకపోలేదు. చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం మండల అటవీ సరిహద్దు ప్రాంతాల్లో టీడీపీ హయాంలో స్మగ్లింగ్‌ విశ్వరూపం దాల్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేవలం ఈ రెండు మండలాల్లో దాదాపు రూ.300 కోట్లకు పైగా ఎర్రచందనం టీడీపీ హయాంలో పట్టుబడినట్లు లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా 417 కేసుల్లో 7559 దుంగలు,  232 వాహనాలను స్వాధీనం చేసుకోగా, 1718మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తమిళ కూలీలపైనే కేసులు, ఒకరిద్దరు స్థానికులపై నామమాత్రపు కేసులు నమోదు చేయడం తప్పితే సూత్రధారులు, పాత్రధారులు, ఇంటిదొంగల వైపు దృష్టి సారించడం లేదనే విమర్శలొస్తున్నాయి. 

కొత్తగా అధికారులు వచ్చినప్పుడల్లా హడావుడి చేయడం తప్పితే స్మగ్లింగ్‌కు పూర్తిస్థాయిలో చెక్‌ పెట్టే దిశగా సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. స్మగ్లింగ్‌లో పట్టుబడ్డ కూలీల విచారణలో తేటతెల్లమైన స్మగ్లర్ల కథాకమామీషు ఏమిటో అధికారులకే తెలియాలి. ఇక సాధారణ కేసుల్లో రిమాండులో ఉన్న ఖైదీలను పోలీస్‌ కస్టడీకి తీసుకొని మరీ విచారణ చేస్తారు. మరి ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో మాత్రం అలా చేయరెందుకో? టీడీపీ పాలనలో జిల్లా స్థాయి అధికారే స్మగ్లింగ్‌కు సహకారమిస్తున్నారని ఒక ఉన్నతాధికారి పత్రికా ముఖంగా  వెల్లడించడం అప్పట్లో అదొక సంచలనం!

ఎర్రచందనం తరలే ప్రాంతాలివే..
శేషాచల అడవుల్లోంచి నరికి కూలీల తెచ్చిన దుంగలను తరలిస్తున్న ప్రాంతాలు ముఖ్యంగా నాగినేనివారిపల్లె సమీప మామిడితోట లు, దేవరకొండ చుట్టూ ఉన్న మామిడి తోట లు,పులిగోనుపల్లె సమీప మామిడి తోటలు.
భూతంవారిపల్లె సమీపంలోని గుట్టలు. గెద్దలబండ, సిద్ధలగండి–వలసపల్లె సమీప గుట్టలు.
తవ్వాండ్లపల్లె వద్ద కలుస్తున్న కొత్తరోడ్డు. బండకొండగుట్టలు
బుడ్డారెడ్డిగారిపల్లె–నెమలిగుండ్లు రోడ్డు
కొంగరవాండ్లపల్లె–బిజ్జేపల్లె రోడ్డు
ఉదయమాణిక్యం–కోటబైలు రోడ్డు. భాకరాపేట ఘాట్‌ రోడ్డు. భాకరాపేట–మంగళంపేట రోడ్డు.

సిబ్బంది కొరత
ఎర్రావారిపాళెం స్టేషన్‌లో 28 మంది ఉండాల్సిన సిబ్బంది 14 మంది, భాకరాపేట స్టేషన్‌లో 28 మందికి 21, చామల రేంజ్‌లో 22 మందికి గాను 8 మంది ఉన్నారు. చామల అటవీ రేంజ్‌ పరిధిలో సుమారు 2.70 లక్షల హెక్టార్లు ఉండగా 30వేల హెక్టార్లకు ఒకరు చొప్పున 22 మంది ఉండాల్సి సిబ్బంది కేవలం 8 మందే ఉన్నారు. ఎర్రావారిపాళెం పోలీస్‌ క్వార్టర్స్‌కు హెచ్‌ఆర్‌ఏ కట్‌ అవుతుండడంతో సిబ్బంది ఇక్కడకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఇకనైనా స్మగ్లింగ్‌ను నిరోధించడానికి, ఎర్రచందనం పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement