నెల్లూరు(క్రైమ్): జిల్లాలోని వెలుగొండ అటవీ ప్రాంతంలో నిఘా పాగా వేసింది. ఎర్రచందనం కొల్లగొడుతున్న దొంగల కోసం వేట ముమ్మరంగా సాగుతోంది. టాస్క్‌ఫోర్సు, స్థానిక పోలీసు అధికారులు మెరుపుదాడులు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున డక్కిలి పోలీసు డక్కిలి, వెంకటగిరి పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. 10 మంది అంతర్రాష్ట్ర ఎర్రస్మగ్లర్లను అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాలులో జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి విలేకరులకు వెల్లడించారు. దేవుడు వెల్లంపల్లిలో చేసిన దాడుల్లో డక్కిలి ఎస్సై నిందితుల నుంచి 78 ఎర్రచందనం దుంగలు, ఆరు సెల్‌ఫోన్లు, మూడు మోటారుబైక్‌లు, బరువు కొలిచే యంత్రం, రూ.900 నగదును స్వాధీనం చేసుకున్నారు. కోనమల్లేశ్వరకోనలో చేసిన దాడుల్లో వెంకటగిరి ఎస్సై తన సిబ్బందితో కలిసి నిందితులను అరెస్ట్‌చేసి 44 చందనం దుంగలు, ఆరు సెల్‌ఫోన్లు, మూడు మోటారుబైక్‌లు ఒక ఐచర్ వ్యాన్, 8.5 కిలోల ఎర్రచందనం పొడి, బరువు తూచే యంత్రం, రూ.1,200 నగదను స్వాధీనం చేసుకున్నారు. రెండు ఘటనల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎర్రదుంగలు, వాహనాలు విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.1.75 కోట్లు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయడంతోపాటు వారి ఆస్తులను సీజ్ చేస్తామని తెలిపారు. సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డులను అందజేశారు.
సమాచారం అందించండి
జిల్లా పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు, ఎర్రచందనం, ఇసుక, సిలికా, గుట్కా అక్రమరవాణాపై ప్రజలు 9390777727, డయల్ 100, క్రైమ్ స్టాఫర్ 1090కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. సమావేశంలో ఏఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ వెంకటరావు, డక్కిలి, వెంకటగిరి ఎస్సై వాసు, కొండపనాయుడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చైనా మార్కెట్‌కు..
డక్కిలి మండలంలోని దేవుడువెల్లంపల్లి కొండల్లో, వెంకటగిరి మండలంలోని కోన మల్లేశ్వరకోనల్లోని అటవీ ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర స్మగ్లర్లు పాగావేశారు. విలువైన ఎర్రచందనం దుంగలను నరికి రహస్య మార్గాల్లో చెన్నై, ముంబై, కొచ్చి, కాండ్లా, కోల్‌కత్తాలోని నౌకాశ్రయాలకు చేరుస్తున్నారు. అక్కడినుంచి అంతర్జాతీయ మార్కెట్‌కు తరలించి రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. కొందరు స్మగ్లర్లు దుంగలను హస్తకళా వస్తువులుగా మార్చి విమానాల ద్వారా చైనా మార్కెట్‌కు తరలిస్తున్నారు.
గతేడాది..
గతేడాది 45 కేసులు నమోదు చేసి 222 మందిని అరెస్ట్ చేశారు. వారినుంచి రూ 13.91 కోట్లు విలువచేసే 13 టన్నుల బరువు కలిగిన 1,330 దుంగలు, 54 వాహనాలు, 193 సెల్‌ఫోన్లు, ఐదు తుపాకులు, ఆరు గొడ్డళ్లు, రూ.75 వేల నగదు, 800 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది స్మగ్లర్లపై పీడీయాక్ట్‌లు నమోదు చేశారు. ఎర్రచందనం అక్రమరవాణాను పూర్తిస్థాయిలో కట్టడిచేసే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా జిల్లాలోని వెలుగొండ అటవీ, సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్, వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. కాగా ఓ వైపు పోలీసులు దాడులు చేసి స్మగ్లర్ల ఆటలు కట్టిస్తున్నా మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాల్లో విలువైన ఎర్రసంపదను సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు.
వందేళ్లకు పైబడిన..
పోలీసులు స్వాధీనం చేసుకున్న దుంగల్లో 100 సంవత్సరాలకు పైబడిన 192 కిలోల బరువున్న వేరుముద్ద ఉంది. ప్రస్తుతం జిల్లా నుంచి ప్రత్యేకంగా ఎర్రచందనం వేరుముద్దల అక్రమరవాణా జోరుగా సాగుతోంది. వాటికి చైనా, సింగపూర్, మలేసియా, జపాన్, హాంకాంగ్‌తోపాటు అరబ్ దేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఈ దేశాల ప్రజలు ఈ వేరుముద్దలతో తయారుచేసిన వస్తువులకు అతీంద్రియ శక్తులు ఉంటాయని బలంగా నమ్ముతారు. ఈ నేపథ్యంలో వీటిపై ఎర్రస్మగ్లర్లు దృష్టి సారించారు.
Comments
Please login to add a commentAdd a comment