వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ
నెల్లూరు(క్రైమ్) : ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 8 మంది అంతర్‌జిల్లా ఎర్రచందనం దొంగల ముఠాను మర్రిపాడు ఎస్‌ఐ, టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.55లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి నిందితుల వివరాలను వెల్లడించారు. గత కొంతకాలంగా ఎర్రదొంగల కదలికలపై నిఘా ఉంచామన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతాల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. శుక్రవారం వేకువన మర్రిపాడు మండల పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం అందిందన్నారు. మర్రిపాడు ఎస్‌ఐ తిరుపతయ్య, ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జి వెంకటరావు తన సిబ్బందితో కలిసి పడమటినాయుడిపల్లి ట్యాంక్ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారన్నారు. మారుతీ ఓమిని వ్యాన్‌లో కొందరు అనుమానాస్పదంగా కనిపించగా తనిఖీ చేశామన్నారు. ఈ క్రమంలో దుండగులు పోలీసు సిబ్బందిని నెట్టివేసి పరారయ్యేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారన్నారు. వారి వద్ద నుంచి రూ.55లక్షల విలువచేసే ఒకటిన్నర టన్నుల బరువు కలిగిన 18 ఎర్రదుంగలు, మారుతీకారు, నాలుగు ద్విచక్రవాహనాలు, తొమ్మిది సెల్‌ఫోన్లు, రూ.4,100నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కొంతకాలంగా అక్రమ రవాణా
వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలం దాసరిపాళేనికి చెందిన ఎం.నరహరి, బ్రహ్మంగారి మఠం రేకులకుంటకు చెందిన వెంకటేష్ కొంత కాలం నుంచి ఎర్రస్మగ్లర్లుగా అవతారమెత్తారని ఎస్పీ తెలిపారు. బద్వేల్ మండలం బాలాయపల్లికి చెందిన ఎన్. చంద్రశేఖర్(పైలెట్), పోరుమామిళ్ల మండలం రేపల్లికి చెందిన ఏ ప్రభాకర్(ఉడ్ కట్టర్), కలతసాడు మండలం చెన్నుపల్లికి చెందిన చంద్రశేఖర్(ఉడ్‌కట్టర్), రాయచోటి నియోజకవర్గం మోతకట్లకు చెందిన జె.వెంకటేశ్వర్లు(పైలెట్), నెల్లూరు జిల్లా దగదర్తి మండలం తడకలూరు గ్రామానికి చెందిన జె.విజుæ(వాహన యజమాని, పైలెట్), కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా కొండషెత్తల్లికి చెందిన అక్రమ్‌పాషాల(డ్రైవర్)తో కలిసి ముఠాగా ఏర్పడినట్లు తెలిపారు. నెల్లూరు, కడప జిల్లాల్లో ఎర్రచందనం దుంగలను నరికించి చెన్నై, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకునేవారని వివరించారు. పైఅందరిపై చార్జిషీట్లు తెరవనున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు. ఏఎస్పీ పీ పరమేశ్వర్‌రెడ్డి, ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జి వెంకటరావు, మర్రిపాడు ఎస్సై తిరుపతయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment