Nellore Crime News
-
నాకెందుకు శాపం.. నేనేమి చేశాను పాపం!
‘దేవుడా..! నాకెందుకు ఈ శాపం.. నేనేమి చేశాను పాపం.. నన్ను కూడా తీసుకెళ్లితే బావుండు.. నేను ఎవరి కోసం బతకాలి.. నేనెందుకు బతకాలి..’ అంటూ ఆ ఇల్లాలు గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. కళ్లెదుటే విగతజీవులుగా పడి ఉన్న భర్త, ఇద్దరు పిల్లలను చూసి తల్లడిల్లిపోయింది. కళ్లల్లో నీళ్లు ఇంకిపోయే వరకు ఏడ్చింది. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు దూరమవడాన్ని తట్టుకోలేకపోయింది. వారి తల నిమురుతూ.. పదేపదే ముద్దాడుతూ గుండెలు పగిలేలా రోదించింది. ఈ ఘటన రాపూరు మండలం గుండవోలులో ఆదివారం విషాదాన్ని నింపింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: మండలంలోని వెలుగోను జంక్షన్ నుంచి ఏపూరు వెళ్లే జాతీయ రహదారిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ప్రమాదంలో తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అంతవరకు తనతో ఉన్న భర్త, ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్న ఆ ఇల్లాలు షాక్‌కు గురై కుప్పకూలిపోయింది. మోటారు బైక్‌పై గంగోటి ప్రతాప్ తన కుమార్తె వైష్ణవి, కుమారుడు సిద్ధార్ధతో కలిసి గుండవోలుకు బయల్దేరారు. ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు ఢీకొనడంతో ప్రతాప్, వైష్ణవి, అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన సిద్ధార్ధను వైద్యం నిమిత్తం నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సిద్ధార్ధ (8) ఆదివారం మృతి చెందాడు. కుప్పకూలిన ప్రభావతి భర్త, పిల్లలు ఒకేసారి మృత్యువాత పడడంతో ప్రభావతి కుప్పకూలింది. ఆమెను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ప్రతాప్ (38) ముంపు గ్రామానికి చెందినవాడు కావడం త్వరలో ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఉన్న కుటుంబానికి నిరాశే మిగిలింది. గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉంటున్న కుటుంబంలోని ముగ్గురూ మృత్యువాత పడడంతో వృద్ధ తల్లిదండ్రులతోపాటు గ్రామం అంతా విషాదంలో మునిగింది. ఒకేసారి ముగ్గురికి అంత్యక్రియలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రతాప్, వైష్ణవి, సిద్ధార్ధకు ఆదివారం గ్రామంలో ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలోని బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు రోదనలతో గ్రా>మం శోకసంద్రంలో మునిగిపోయింది. -
మహిళతో వివాహేతర సంబంధం.. ఆమె కుమార్తెపైనా కన్నేయడంతో...!
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: ఓ మహిళకు ఒకతనితో వివాహేతర సంబంధం ఉంది. అతను ఆమె కుమార్తెను లైంగికంగా వేధింపులకు గురిచేయసాగాడు. ఈ విషయంపై మహిళ అతడిని పలుమార్లు హెచ్చరించింది. అయినా తీరు మారకపోవడంతో భరించలేకపోయిన తల్లి కర్ర, రాళ్లతో అతడిపై దాడి చేయగా తీవ్రగాయమై అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై వెంకటాచలం పోలీసులు ఈ ఏడాది జూన్ 8వ తేదీన హత్య కేసును నమోదు చేశారు. ఎట్టకేలకు హత్య కేసును ఛేదించారు. వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో గురువారం సాయంత్రం నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కసుమూరు కొండపై నివాసం ఉంటున్న కూరపాటి వెంకయ్య (74)కు, అక్కడే నివాసముంటున్న మోతే నారాయణమ్మతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే నారాయణమ్మ కుమార్తెను కూడా వెంకయ్య లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న నారాయణమ్మ పలు సందర్భాల్లో వెంకయ్యను మందలించింది. జూన్ 8న తెల్లవారుజామున నారాయణమ్మ కుమార్తె బహిర్భూమికి వెళ్లగా, వెంకయ్య వెంబడించి పట్టుకోవడంతో పెద్దగా కేకలు వేసింది. నారాయణమ్మ అక్కడికి చేరుకుని కర్రతో వెంకయ్యపై దాడి చేసింది. అక్కడి నుంచి కుమార్తెను తీసుకుని వెళ్లిపోతుండగా, వెంకయ్య మళ్లీ వెంబడించడంతో అక్కడే ఉన్న రాళ్లతో కొట్టి వెళ్లిపోయింది. అయితే వెంకయ్య మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. నారాయణమ్మను కోర్టుకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ గంగాధర్‌రావు, ఎస్సై అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. -
తండ్రిని చంపితే రూ.3 లక్షలు.. తల్లిని కూడా చంపితే రూ.5 లక్షలు!
నెల్లూరు (క్రైమ్): దొంగతనం కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులను పోలీసులు విచారించగా.. తల్లిదండ్రులను హతమార్చేందుకు వారి కుమారుడు.. కిరాయి ఇచ్చిన వైనం వెలుగులోకొచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాళెం పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. చోరీ జరిగిన ప్రదేశాల్లో లభ్యమైన ఆధారాల ఆధారంగా పాతనేరస్తులైన ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంకు చెందిన షేక్ గౌస్‌బాషా, బుచ్చిపట్టణం ఖాజానగర్‌కు చెందిన షేక్ షాహూల్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఐదు దొంగతనాలతో పాటు కావలి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కిరాయి హత్యకు రెక్కీ నిర్వహించినట్టు వెల్లడించారు. దీంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి వారి నుంచి రూ 2.95 లక్షలు విలువచేసే బంగారం, రూ.30వేలను స్వాధీనం చేసుకున్నారు. మూడు సార్లు రెక్కీ కావలి పట్టణం తుఫాన్‌నగర్‌కు చెందిన బాలకృష్ణయ్యకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరు కుమారులకు ఆయన గతంలో సమానంగా ఆస్తి పంచాడు. అయితే తనకు సరిగా పంచలేదని లక్ష్మీనారాయణ తండ్రితో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులను అడ్డుతొలగించుకుంటే వారి పేర ఉన్న ఆస్తి తనకు దక్కుతుందని లక్ష్మీనారాయణ భావించాడు. తన స్నేహితుడైన కావలికి చెందిన సుబ్బారావుకు విషయం తెలిపాడు. అతడి ద్వారా పాతనేరస్తుడు షేక్ షఫీ ఉల్లాను సంప్రదించాడు. తండ్రిని హత్య చేస్తే రూ.3 లక్షలు, తల్లిదండ్రులిద్దరినీ చంపితే రూ.5 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో షఫీఉల్లా గతంలో జైల్లో ఉన్న సమయంలో పరిచయమైన గౌస్ బాషా, షేక్ షాహుల్‌తో కలిసి కిరాయి హత్యకు పథకం రచించారు. లక్ష్మీనారాయణ నిందితులకు అడ్వాన్స్ కింద రూ.30 వేలు, కత్తులను ఇచ్చాడు. నిందితులు మూడుసార్లు బాలకృష్ణయ్య ఇంటివద్ద రెక్కీ నిర్వహించారు. అదును కోసం వేచి చూస్తున్నామని పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ విషయం పోలీసుల ద్వారా తెలుసుకున్న బాలకృష్ణయ్య శుక్రవారం రాత్రి కావలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మీనారాయణ, పి.సుబ్బారావు, షేక్ షఫీ ఉల్లాను శనివారం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: భార్యను హత్య చేసి.. ఆపై చెరువులో పడేసి.. -
వైఎస్సార్సీపీ కౌన్సిలర్ దారుణ హత్య
సూళ్లూరుపేట(నెల్లూరు జిల్లా): సూళ్లూరుపేట పట్టణంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ తాళ్లూరు వెంకటసురేష్ (49) సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. కారును పార్క్ చేయడానికి వెళ్లగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కత్తులతో పాశవికంగా పొడిచి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూళ్లూరుపేట మునిసిపాలిటీ పరిధిలోని 16వ వార్డు కౌన్సిలర్ అయిన వెంకటసురేష్ సోమవారం తన పుట్టిన రోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. తిరిగి సాయంత్రం సూళ్లూరుపేట చేరుకున్నారు. కుటుంబ సభ్యులను బ్రాహ్మణ వీధిలోని ఇంటివద్ద దింపిన వెంకటసురేష్ కారును పార్కింగ్ చేయడానికి పొట్టి శ్రీరాములు వీధిలోని పార్కింగ్ స్థలానికి వెళ్లారు. అక్కడ నుంచి ఎంతసేపటికీ ఆయన తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అతని కుమారుడు ధీరజ్ పార్కింగ్ స్థలానికి వెళ్లి చూడగా.. ఒళ్లంతా కత్తిపోట్లతో కారు డ్రైవింగ్ సీటులో రక్తపు మడుగులో వెంకటసురేష్ పడి ఉన్నాడు. కారు హ్యాండ్ గేర్ వంకర్లు తిరిగిపోయి ఉంది. సమాచారం అందుకున్న ఎస్సై ఉమాశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగులు వెంకటసురేష్ శరీరంపై కిడ్నీలు, లివర్ ఉన్నచోటే అతి పాశవికంగా పొడిచినట్టుగా గుర్తించారు. వెంకటసురేష్‌కు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. వెంకట సురేష్‌కు సౌమ్యుడిగా పేరుంది. ఆయనకు ఎవరితోనూ వివాదాలు గాని, రాజకీయ విభేదాలు గాని లేవని చెబుతున్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది వ్యక్తులు అతడిని హత్యచేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. వైఎస్సార్సీపీ నేతపై హత్యాయత్నం ఐరాల(చిత్తూరు జిల్లా): మండలంలోని వేదగిరివారిపల్లె పంచాయతీకి చెందిన గూబలవారిపల్లెలోని అటవీ ప్రాంతంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కె.చంద్రశేఖర్‌పై హత్యాయత్నం జరిగింది. పాతకక్షల కారణంగా టీడీపీకి చెందిన అరుణ్‌నాయుడు, వేదగిరివారిపల్లె సర్పంచ్ రాజేంద్ర ఆదివారం సాయంత్రం నుంచి తనపై దాడి చేసేందుకు కాపు కాశారని బాధితుడు తెలిపారు. ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి బైక్‌పై వెళ్తున్న తనపై కారంపొడి చల్లి ఇనుపరాడ్లతో దాడిచేసి చంపేందుకు ప్రయత్నించారని వాపోయారు. ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకోవడంతో టీడీపీ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. -
విజిలెన్స్ దాడి: భారీ ఎత్తున రెమిడిసివర్ ఇంజక్షన్లు..
నెల్లూరు: నెల్లూరు జిల్లా పరిధిలోని పొగతోటలో రెమిడిసివర్ ఇంజక్షన్లను బ్లాక్‌లో అమ్ముతున్న ముఠాను విజిలెన్స్ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఒక హాస్పిటల్‌కు అనుబంధంగా ఉన్న ల్యాబ్ కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు గుర్తించారు. వీరిని ఎలాగైనా పట్టుకోవాలని భావించిన అధికారులు సోషల్ మీడియా వేదికగా ఇంజక్షన్ కావాలని అడ్వర్టెజ్ మెంట్ ఇచ్చారు. అయితే దీనికి సదరు ముఠా స్పందించింది. ఆ ముఠా సదరు వ్యక్తికి, ఒక్కొక్క ఇంజక్షన్‌ను రూ. 25 వేల చోప్పున.. మూడు బాక్సులకు నాలుగున్నర లక్షలకు అమ్మేలా డీల్ కుదుర్చుకుంది. అయితే, అప్పటికే ఈ విషయం తెలిసి మాటువేసి ఉన్న విజిలెన్స్ అధికారులు వారిపై దాడిచేసి పట్టుకున్నారు. ఈ దాడిలో భారీ మొత్తంలో రెమిడిసివర్ ఇంజక్షన్‌ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు దుర్మరణం
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని పెళ్లకూరు మండలం నాయుడుపేట - పూతలపట్టు జాతీయ రహదారిపై తల్వాయిపాడువద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి వస్తున్నా కారు ఢీకొనడంతో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న టిప్పర్ వైపు దూసుకెళ్లింది. అప్పటికే వేగంగా వస్తున్న టిప్పర్ ఆటోను ఢీకొనింది. దీంతో ఆటో ప్రయాణిస్తున్న ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం మోదుగుల పాలెం గ్రామానికి చెందిన కూలీలు ప్రతిరోజూ నాయుడుపేటకు వచ్చి లారీ కాటా పనులు జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం స్వగ్రామం నుంచి నాయుడుపేటకు పనుల నిమిత్తం ఆటోలో వస్తుండగా వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ధీంతో ఆటో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న టిప్పర్ వైపు దూసుకెళ్లింది. అప్పటికే వేగంగా ఉన్న టిప్పర్ ఆటోను ఢీకోనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న అప్పాడి రమేష్ (39), వెంకటేశ్వర్లు (28) అక్కడికక్కడే మృతి చెందారు. ఇక గురవయ్య, మునుస్వామి, గురునాధం,చెంగయ్య ల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సల నిమ్మిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసున మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు -
వేధింపులకు తాళలేక టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య
నెల్లూరు: టిక్‌టాక్‌లో స్టార్‌గా ఉన్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఓ అమ్మాయి విషయంలో జరిగిన సంఘటనలే అతడి ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా రంగనాయకుపేటకు చెందిన షేక్ రఫీ టిక్‌టాక్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. రోజూ టిక్‌టాక్‌లో వీడియోలు అప్లోడ్ చేసి నెటిజన్లు.. ఫాలోవర్లను ఆకట్టుకునేవాడు. అయితే అతడి స్నేహితుడితో జరిగిన వివాదంలో మనస్ఫార్థానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెల్లూరులో కెమెరామెన్‌గా పని చేస్తున్న రఫీ టిక్‌టాక్ వీడియోలు కూడా చేస్తూండేవాడు. అయితే అతడి స్నేహితుడు ముస్తఫా ప్రేయసి రఫీతో చనువుగా ఉండేది. రఫీతో ప్రేమగా ఉండటం.. సన్నిహితంగా ఉండటంతో తట్టుకోలేకపోయాడు. ఈ విషయమై ముస్తాఫా ఆగ్రహం వ్యక్తం చేశాడు. రఫీపై దాడి చేయించాడు. ప్రణాళిక ప్రకారం స్నేహితులతో రఫీపై దాడి చేయించాడు. తీవ్ర గాయాల పాలైన రఫీని తండ్రి రియాజ్ ఆస్పత్రిలో చేర్పించాడు. అనంతరం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయంలో రఫీపై వేధింపులు తీవ్రమయ్యాయి. ఈ సమయంలో ఆ వేధింపులు తట్టుకోలేక జనవరి 22వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడిన రఫీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయమై తండ్రి రియాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వేధింపుల కారణంగా తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. దీనిక కారణమైన ముస్తాఫాపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
దారణం: హత్యకు దారితీసిన యువకుల గొడవ
సాక్షి, నెల్లూరు: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నల్ల కుక్కలగుంట కూరగాయల మార్కెట్ వద్ద ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. కరివేపాకు వ్యాపారం చేసుకొని జీవించే సాయి అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన దయానంద్‌తో చిన్నపాటి వివాదం తలెత్తింది. గొడవ మరింత ముదరడంతో దయానంద్ ఆవేశంతో సాయిపై కత్తితో దాడి చేశాడు. దీంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. స్లానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
అప్పన్న బంగారం కేసులో కీలక మలుపు
సాక్షి, నెల్లూరు: అప్పన్న బంగారం పేరిట మహిళను మోసగించిన ఘటనలో ప్రధాన నిందితురాలు కె.హైమావతి పోలీసు కస్టడీ సోమవారంతో ముగిసింది. పోలీసులు ఆమె వద్ద నుంచి రూ.30 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ షేక్ బాజీజాన్‌సైదా కేసు పూర్వాపరాలను వెల్లడించారు. విశాఖపట్నం పెందుర్తి ప్రాంతానికి చెందిన కె.హైమావతి అలియాస్ డెక్క హైమావతి సింహాచలంలో అల్లిక దారాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. సూళ్లూరుపేటకు చెందిన ఎం.శ్రావణితో పరిచయం ఏర్పడింది. ఆలయంలో బంగారం వేలం వేస్తున్నారంటూ మాయమాటలు చెప్పి హైమావతి ఆమెను నమ్మించి రూ. 38 లక్షలు ఖాతాలో జమ చేయించుకుంది. శ్రావణి బిల్లులు కోరగా నిందితురాలు సింహాచలం ఆలయ ఈవో ఫోర్జరీ సంతకాలతో బిల్లులను పంపింది. నగదు తీసుకున్న నిందితురాలు బంగారం ఇవ్వకుండా ఆమెను మోసగించడంతో బాధితురాలు సూళ్లూరుపేట పోలీసులకు, సింహాచలం ఆలయ అధికారులకు ఈ–మెయిల్ ద్వారానూ ఫిర్యాదు చేసింది. మెయిల్లో పంపిన బిల్లులు నకిలీవని ఆలయ అధికారులు గుర్తించి గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విచారించిన పోలీసులు నిందితురాలితో పాటు మరో ఇద్దరిని ఇటీవల అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నిందితురాలు విశాఖపట్నం జైలులో ఉంది. నగదు స్వాధీనం : పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. హైమావతిని పిటీ వారెంట్‌పై నెల్లూరుకు తీసుకువచ్చారు. సూళ్లూరుపేట కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు రిమాండ్ విధించడంతో జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. ఆమె వద్ద నుంచి రూ.11.35 లక్షల నగదు, 280 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం ఆమెను కోర్టులో హాజరుపరిచినట్లు ఇన్స్పెక్టర్ బాజీజాన్‌సైదా తెలిపారు. -
తల్లీకూతుళ్ల హత్యకేసులో ఇంతియాజ్‌కు ఉరిశిక్ష
-
నెల్లూరు కోర్టు సంచలన తీర్పు
సాక్షి, నెల్లూరు: డబుల్ మర్డర్ కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2013లో జరిగిన తల్లీకూతుళ్ల హత్యకేసులో న్యాయస్థానం గురువారం తీర్పును వెల్లడించింది. నిందితుడు షేక్ ఇంతియాజ్‌కు ఉరిశిక్ష విధిస్తూ ఎనిమిదో అదనపు న్యాయమూర్తి సత్యనారాయణ తీర్పునిచ్చారు. కాగా హరినాథపురం 4వ వీధికి చెందిన దినకర్ రెడ్డి భార్య శకుంతలతో పాటు మెడిసిన్ చదువుతున్న కుమార్తె భార్గవిని ముగ్గురు దుండగులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే నగరంలోని వాగ్దేవి డి-ఫార్మసీ కళాశాల కరెస్పాండెంట్ దినకర్ రెడ్డి, స్థానిక హరనాథపురంలో భార్య, కుమార్తెతో నివాసం ఉండేవారు. ఆయన కుమార్తె భార్గవి ఎంబీబీఎస్ చదువుతోంది. 2013 ఫిబ్రవరి 12న దినకర్‌రెడ్డి నూతన గృహానికి సంబంధించిన ప్లాన్ ఇచ్చేందుకు వచ్చిన ముగ్గురు..శకుంతల, భార్గవిపై కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర రక్తగాయాలైన తల్లీకూతురు కిందపడిపోయారు. వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. -
మితిమీరిన వేగం: ఒకరి దుర్మరణం
సాక్షి, నెల్లూరు : మితిమీరిన వేగంతో వస్తున్న ఓ కారు బైక్‌ను ఢీకొనడంతో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన నగరంలోని ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని బీవీనగర్‌కు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి జనార్దన్ (65), అయన బావమరిది నాగరాజు తమ కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా సంక్రాంతి పండగను జరుపుకున్నారు. ఇద్దరూ కలసి బైక్‌లో ఎన్టీఆర్ నగర్‌కు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరిగి జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో కావలి వైపు నుంచి మితిమీరిన వేగంతో వస్తున్న ఓ కారు వీరి బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై నుంచి జనార్దన్ రోడ్డుపై పడ్డాడు. కారు అతని కాలుపై ఎక్కి సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లి పోయింది. జనార్దన్ ఎడమకాలు మోకాలి వరకు తెగి రోడ్డుపై పడింది. అతని తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజు రోడ్డుపై పడడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఐ.ఆంజనేయరెడ్డి, ఎస్సై శంకరరావు ఘటనా స్థలాన్నిపరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు. గురువారం జనార్దన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లిన ప్రమాదానికి కారణమైన కారు ఆత్మకూరు: అయ్యప్పస్వామి మకరజ్యోతి దర్శనానికి బైక్‌లో వెళ్తున్న ఇద్దరు యువకులను ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీకొనడంతో గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని మురగళ్లలో బుధవారం రాత్రి జరిగింది. బాధితులు, పోలీసుల సమాచారం మేరకు.. బండారుపల్లి గ్రామానికి చెందిన గడ్డం ప్రసాద్, వెంకటప్రతాప్ ఆత్మకూరు పట్టణంలోని కాశీనాయన ఆశ్రమంలో ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో మకరజ్యోతి దర్శనానికి బైక్‌లో నీటి పారుదల కాలువ కట్ట రోడ్డుపై బయలుదేరారు. మురగళ్ల సమీపంలో మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ వేగంగా ఎదురుగా వస్తూ వీరిని ఢీకొన్నాడు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ప్రసాద్, ప్రతాప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వీరి వెనకే వస్తున్న మరి కొందరు యువకులు గుర్తించి ఆటోలో ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. అయితే కారు డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న వారు ఆటోను అడ్డుకుని తమ కారుకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. యువకులు సర్దుబాటు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సైతం కారులోని వారికే మద్దతుగా వ్యవహరించారని బాధితులు వాపోయారు. -
రొయ్యల మేత లారీ అపహరణ
నెల్లూరు (క్రైమ్): రొయ్యల మేతలోడ్‌తో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని గుర్తుతెలియని దుండగులు అపహరించారు. ఈ ఘటనపై బాధిత లారీ యజమాని డయల్ 100కు ఫోన్ చేయడంతో బాలాజీనగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గంటల వ్యవధిలోనే లారీని స్వాదీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సేకరించిన సమాచారం మేరకు.. ఎన్టీఆర్ నగర్ నాల్గో బిట్లో ఎ.మల్లికార్జున్‌రెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయనకు ఐదు లారీలు ఉన్నాయి. వాటిని అద్దెకు తిప్పుతున్నారు. అతని వద్ద సరస్వతీనగర్‌కు చెందిన జి.వెంకటేశ్వర్లు (అల్లుడు) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 12న వెంకటేశ్వర్లు బియ్యం లోడ్‌ను తీసుకుని చెన్నైకు వెళ్లాడు. అక్కడ 13వ తేదీన నెల్లూరు రామ్మూర్తినగర్లోని నర్మదా ఎంటర్‌ప్రైజస్‌కు చెందిన రొయ్యల మేతను లారీలో లోడ్ చేయించుకుని నెల్లూరుకు బయలుదేరాడు. రాత్రి 9.30 గంటలకు నెల్లూరుకు చేరుకున్నాడు. ఆ సమయలో కూలీలు లేకపోవడంతో లారీని ఎన్టీఆర్నగర్లోని ఎస్వీజీఎస్ కళాశాల వద్ద పార్క్ చేసి లారీలోనే పడుకుని ఉదయం కూలీలు వచ్చిన అనంతరం అన్లోడ్ చేయించాలని అతని మామ మల్లికార్జునరెడ్డి సూచించాడు. అయితే వెంకటేశ్వర్లు లారీలో కొద్ది సేపు పడుకుని, లారీ తాళాలను క్యాబిన్లో పెట్టి డోర్‌కు తాళం వేసుకుని ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం కళాశాల వద్దకు వచ్చి చూడగా లారీ కనిపించలేదు. దీంతో వెంకటేశ్వర్లు తన మామకు చెప్పాడు. డయల్ 100కు ఫిర్యాదు.. గంటల వ్యవధిలో లారీ పట్టివేత లారీ చోరీ ఘటనపై బాధితుడు మల్లికార్జునరెడ్డి శనివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఘటనా స్థలం నుంచే డయల్ 100కు ఫిర్యాదు చేశారు. బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ వైవీ సోమయ్య జిల్లా వ్యాప్తంగా సిబ్బందిని అప్రమత్తం చేశారు. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఓ బృందం కావలి వైపు టోల్‌ప్లాజా, మరో బృందం గూడూరు బూదనం టోల్‌ప్లాజాలను పరిశీలించారు. చోరీకి గురైన లారీ బూదనం టోల్ ప్లాజాను క్రాస్ చేసి వెళ్లినట్లు సోమయ్య గుర్తించి లారీ ఆచూకీని కనుగొన్నారు. పోలీసు వాహనం లారీని సమీపిస్తున్న విషయాన్ని గమనించిన దుండగుడు లారీని ఆపి దూకి పరుగులు తీశాడు. పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. లారీని స్వాదీనం చేసుకుని, నిందితుడితో పాటు బాలాజీనగర్ స్టేషన్‌కు తరలించారు. నగర ఇన్చార్జి డీఎస్పీ పి. శ్రీధర్ బాలాజీనగర్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని లోతుగా విచారిస్తున్నారు. రొయ్యల ఫీడ్ విలువ రూ.43 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. చోరీకి గురైన రెండు గంటల వ్యవధిలోనే లారీని, అందులోని రొయ్యల ఫీడ్‌ను స్వాదీనం చేసుకున్న బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ వైవీ సోమయ్య, ఎస్సైలు పవన్‌కుమార్, వీరప్రతాప్ తదితరులను ఎస్పీ భాస్కర్‌భూషణ్ అభినందించినట్లు సమాచారం. -
హత్య చేసి.. గోనె సంచిలో పెట్టి
సాక్షి, కోవూరు(నెల్లూరు): మండలంలోని పడుగుపాడు జాతీయ రహదారి సమీపంలో ఉన్న జిమ్మిపాళెం రోడ్డు వద్ద బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. హత్య చేసి మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి పడవేశారు. దీంతో కోవూరు పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. పోలీసుల కథనం మేరకు.. జమ్మిపాళెం రోడ్డుపక్కనే ఉన్న పంటకాలువలో గోనెసంచి అనుమానాస్పదంగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక సీఐ శ్రీనివాసరావు, ఎస్సై కృష్ణారెడ్డిలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సంచిని బయటకు తీయించగా అందులో మహిళ మృతదేహం ఉంది. మహిళ నైటీ ధరించి తీవ్రగాయాలతో ఉంది. హత్య చేసి సంచిలో ఉంచి బూట్ల లేస్లతో కట్టి కాలువలో పడవేశారు. మహిళ హత్యకు గురైందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె వయస్సు 30 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. పోలీస్ జాగిలాలు పరిసర ప్రాంతాల్లో తిరిగాయి. హత్య జరిగి మూడురోజులై ఉంటుందని, మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉందని పోలీసులు తెలిపారు. స్థానికులను విచారించారు. వారినుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో బయటి ప్రాంతంలో హత్య చేసి వాహనంలో మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చి పడవేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
షార్ట్ ఫిల్మ్‌లలో అవకాశమంటూ.. వ్యభిచారంలోకి
సాక్షి, నెల్లూరు : షార్ట్ ఫిల్మ్‌లలో అవకాశాలు ఇప్పిస్తానని మాయమాటలు చెబుతూ నగరంలోని మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపుతున్న జాకీర్ అనే వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఒక బాలిక ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా, పోలీసులు వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి ఎనిమిది మంది యువతులను పట్టుకున్నారు. అనంతరం యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. నిందితుడు జాకీర్‌ను విచారించగా వేర్వేరు పోలీస్ స్టేషన్లలో అతనిపై పలు కేసులున్నట్టు తేలింది. -
ఆధిపత్యం కోసమే హత్య
నెల్లూరు, వెంకటాచలం: పనిచేసే చోట సొంత తమ్ముడి కంటే బయటి వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని ఓ వ్యక్తి కక్ష పెంచుకున్నాడు. ఈక్రమంలో ఆధిపత్యం కోసం మరో వ్యక్తితో కలిసి హత్య చేశాడు. ఈ కేసును వెంకటాచలం పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మంళవారం వెంకటాచలం పోలీసుస్టేషన్లో నెల్లూరు రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నెల్లూరు నగరంలోని కొరడావీధికి చెందిన షేక్ సుభానీ (35) అనే వ్యక్తి షేక్ జమీర్ బంగారు నగల దుకాణంలో పనిచేస్తున్నాడు. అక్కడ సుభానీతోపాటు జమీర్ సోదరుడు షేక్ షామీర్, షేక్ మీరామొహిద్దీన్ పనిచేస్తున్నారు. సుభానీ పనితీరు బాగా నచ్చడంతో యజమాని జమీర్ ఎక్కువగా అతడినే నమ్మేవాడు. జమీర్ తాను బయటికి వెళ్లేప్పుడు బంగారు నగలు దాచే లాకర్ తాళాలు, ఇతర వ్యవహారాలు సుభానికే అప్పజెప్పేవాడు. దీంతో షామీర్ సుభానీపై కక్ష పెంచుకుని ఎలాగైనా అతడి అడ్డుతొలగించాలని మీరామొహిద్దీన్‌తో కలిసి కుట్ర పన్నాడు. ఈనెల 7వ తేదీన షామీర్, మీరామొహిద్దీన్ కలిసి సుభానీని కసుమూరు దర్గాకు వెళదామని నమ్మబలికి తీసుకెళ్లారు. వెంకటాచలం దాటిన తర్వాత చాకిరేవుమడుగు వద్దకు తీసుకెళ్లి వారి వెంట తీసుకువచ్చిన పొదునైన కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి గొంతుకోసి హత్య చేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అతని వద్దనున్న దుకాణం లాకర్ తాళాన్ని తీసుకుని చాకిరేవుమడుగులో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. ఈనెల 12వ తేదీన చాకిరేవుమడుగులో కుళ్లిన మృతదేహం ఉందని కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంకటాచలం పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి గుర్తుతెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేశారు. ఇలా బయటపడింది హత్య కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈనెల 16వ తేదీన జమీర్ బంగారు నగల దుకాణంలో షామీర్, మీరామొహిద్దీన్ కలిసి లాకర్ తాళాలు తీసి 300 గ్రాముల బంగారు నగల దోపిడీకి పాల్పడ్డారు. ఈ విషయం సీసీ టీవీ ఫుటేజీలో బయటపడింది. దీంతో జమీర్ వారిద్దరిపై నిఘా పెట్టాడు. ఈక్రమంలో గూడూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వారి నుంచి చోరీ చేసిన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నాడు. కాగా 7వ తేదీ నుంచి సుభానీ కనిపించకపోవడంతో వీరికి అసలు విషయం తెలిసి ఉండొచ్చని జమీర్ భావించాడు. సుభానీ విషయంలో నిజాలను పోలీసులకు చెపాల్పని వారికి చెప్పగా అక్కడినుంచి పరారయ్యారు. దీంతో జమీర్ అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఉదయం షామీర్, మీరామొహిద్దీలను రూరల్ సీఐ కె.రామకృష్ణ తనసిబ్బందితో నిఘా ఉంచి నెల్లూరులోని జిల్లా కోర్టు వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారే హత్య చేసినట్లుగా తేలింది. నిందితులను కోర్టుకు హాజరుపరుస్తామని డీఎస్పీ వెల్లడించారు. హత్యకేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. సమావేశంలో సీఐ రామకృష్ణ, ఎస్సై కరిముల్లా పాల్గొన్నారు. -
వృద్ధురాలి కళ్లలో కారం చల్లి..
నెల్లూరు, నాయుడుపేటటౌన్: ఓ యువకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి కళ్లలో కారం చల్లి ఆమె ఒంటిపై ఉన్న సుమారు పది సవర్ల బంగారు నగలు అపహరించి పరరాయ్యాడు. ఈ సంఘటన నాయుడుపేటలో మంళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఎల్ఐసీ కార్యాలయం ఎదురుగా మిద్దెపై విశ్రాంతి ఉపాధ్యాయురాలు చతురవేదుల విశాలక్ష్మమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ విషయాన్ని పసిగట్టిన గుర్తుతెలియని యువకుడు మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమె ఇంట్లోకి చొరబడి కళ్లలో కారం చల్లాడు. వెంటనే ఆమె మెడలో ఉన్న మూడు బంగారు చైన్లను లాక్కొని పరారయ్యాడు. వృద్ధురాలు పెద్దఎత్తున కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి చేరుకునేసరికి దుండగుడు రైల్వే స్టేషన్ రహదారి వైపు ఉడాయించాడు. సమాచారం అందుకున్న ఎస్సై డి.వెంకటేశ్వరరావు వృద్ధురాలి ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడాడు. నిందితుడి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. రహదారిపై ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా పరారైన నిందితుడిని పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. ఘటన జరిగిన తర్వాత పోలీసు సిబ్బంది, స్థానిక యువకులు పెద్దఎత్తున నిందితుడి కోసం జల్లెడ పట్టారు. ఓ మద్యం షాపు వద్ద నిందితుడు ఉండగా పట్టుకున్నారు. అతనితోపాటు మరో వ్యక్తి ఈ చోరీలో పాలుపంచుకున్నట్లుగా సమాచారం. -
డబ్బు కోసం స్నేహితులే కడతేర్చారు
సాక్షి, మనుబోలు (నెల్లూరు): మనుబోలు మండలం జట్ల కొండూరు సమీపంలో గతనెల 19వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసం అతని స్నేహితులే హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడ్డ ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గూడూరు డీఎస్పీ బీఎస్బీ హర్ష విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హత్య పూర్వాపరాలను వెల్లడించారు. హత్యకు గురైన వాకాడు మండలం కొండాపురం గ్రామానికి చెందిన మల్లి గురుప్రసాద్ రెండేళ్ల నుంచి అపాచీ కంపెనీలో పనిచేస్తూ సూళ్లూరుపేటలో రూమ్ తీసుకుని ఉంటున్నాడు. అతను అంతకుముందు కొంతకాలం గూడూరు నిమ్మ మార్కెట్లో హమాలీగా పనిచేశాడు. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న గూడూరుకు చెందిన మల్లి చెంచయ్య, ఉప్పలపాటి గురుప్రసాద్ స్నేహితులయ్యారు. ఎలా వ్యాప్తి చెందిందో తెలియదుగాని అపాచీలో పనిచేస్తున్న గురుప్రసాద్‌కు రూ.కోటి దొరికినట్లుగా పుకారు వచ్చింది. ఈ విషయం పూర్వాశ్రమంలో తన స్నేహితులైన గూడూరుకు చెందిన చెంచయ్య, గురుప్రసాద్ చెవిన పడింది. దీంతో ఆ పుకారును నమ్మిన గురుప్రసాద్, చెంచయ్య వారి స్నేహితుడైన రౌడీ షీటర్ వేముల కనకారావు అలియాస్ రాజా సాయంతో గురుప్రసాద్‌కు దొరికిందనుకుంటున్న సొమ్మును కాజేసేందుకు పథకం వేశారు. ఈ క్రమంలో సూళ్లూరుపేటలో ఉంటున్న మల్లి గురుప్రసాద్ వద్దకు వెళ్లి అమ్మాయిల వద్దకు పోదాం అని అతడ్ని టాటా ఏస్ వాహనంలో ఎక్కించుకుని వరగలి క్రాస్‌రోడ్డు సమీపంలోని పోటుపాళెం రోడ్డు వద్దకు తీసుకెళ్లి దొరికిన రూ.కోటి సొమ్మును ఇవ్వాలంటూ జాకీ రాడ్‌తో కొట్టారు. తనకు డబ్బు దొరకలేదని తనని వదిలేయాలని ఎంత వేడుకున్నా వినకుండా అక్కడ నుంచి తీసుకొచ్చి మనుబోలు మండలం జట్ల కొండూరుకు వెళ్లే రోడ్డు వద్ద మళ్లీ కొట్టారు. చొక్కా చించి మెడకు చుట్టి నీటి గుంతలో తలను ముంచి తొక్కడంతో పూపిరాడక మల్లి గురుప్రసాద్ మృతిచెందాడు. రౌడీ షీటర్ కనకారావు కాల్‌డేటా ఆధారంగా అతడ్ని శుక్రవారం గూడూరు రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని స్నేహితులు ఉప్పలపాటి గురుప్రసాద్, చెంచయ్యను తిప్పవరప్పాడు క్రాస్‌రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన పోలీసులకు డీఎస్పీ నగదు రివార్డులు అందజేశారు. సమావేశంలో గూడూరు రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి, మనుబోలు, చిల్లకూరు ఎస్సైలు సూర్యప్రకాష్‌రెడ్డి, హుస్సేన్‌బాషా, హెసీలు శ్రీనివాసులు, ఆది నారాయణ, మాధవరావు, అశోక్ పాల్గొన్నారు. -
మంత్రం చెప్పి.. చైన్ మాయం చేశాడు
సాక్షి, సంగం(నెల్లూరు): ఆ వృద్ధురాలు చిన్నపాటి అంగడి పెట్టుకుని తినుబండారాలు విక్రయిస్తోంది. గుర్తుతెలియని యువకుడు ఆమె వద్దకు వెళ్లి వ్యాపారం బాగా జరిగేందుకు మంత్రం వేస్తానని బంగారు చైన్ తీసుకున్నాడు. మంత్రం చదివి చైన్ మాయం చేశాడు. చైన్ అపహరించాడని గుర్తించిన వృద్ధురాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన మండల కేంద్రమైన సంగంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పెసల భాగ్యమ్మ అనే వృద్ధురాలు స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణం సమీపంలో అంగడి పెట్టుకుని తినుబండారాలు విక్రయిస్తోంది. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఆమె వద్దకు గుర్తుతెలియని యువకుడు వెళ్లాడు. దక్షిణ ఇస్తే జరగబోయేది చెబుతానని ఆమెను నమ్మించాడు. వ్యాపారం బాగా జరగాలంటే మెడలో ఉన్న చైన్ తీసి తనకు ఇస్తే మంత్రించి తమలపాకుల్లో పెట్టి పసుపు, కుంకుమ రాసి డబ్బాలో వేస్తానని భాగ్యమ్మతో అన్నాడు. ఆమె నిజమని నమ్మి తన రెండు సవర్ల బంగారు చైన్ తీసి ఆ యువకుడికి ఇచ్చింది. అతను తమలపాకులో పెట్టినట్లుగా చూపించి చైన్ మాయం చేశాడు. మంత్రాలు చదివి తమలపాకు, పసుపు, కుంకుమ ఓ డబ్బాలో పెట్టి భాగ్యమ్మకు ఇచ్చి పరారయ్యాడు. యువకుడు వెళ్లిన పది నిమిషాలకు భాగ్యమ్మ డబ్బా తెరిచి చూడగా అందులో చైన్ కనిపించలేదు. తమలపాకు, పసుపు, కుంకుమ మాత్రమే ఉన్నాయి. దీంతో వెంటనే సంగం పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : రాజులు వేసుకున్న ఆభరణాలని చెప్పి.. -
పెట్రేగుతున్న దొంగలు
పోలీసులు నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా గస్తీకాస్తున్నారు. కార్డన్ సర్చ్ పేరుతో జల్లెడ పడుతున్నారు. అయినా జిల్లాలో దొంగలు పేట్రేగిపోతున్నారు. ఒక చోరీ కేసు దర్యాప్తులో ఉండగానే.. ఇంకో ప్రాంతంలో దొంగతనం జరుగుతోంది. ఎంత నిఘా పెడుతున్నా వరుసగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విరుసుతున్నారు. సమయంతో నిమిత్తం లేకుండా అందినకాడికి దోచుకెళుతున్నారు. దీంతోప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం నెల్లూరు నగరం వేదాయపాళెంలోని ఓ మొబైల్ షోరూంలో చోరీ జరగడం కలకలం రేపింది. సాక్షి, నెల్లూరు: జిల్లాలో 22 సర్కిల్స్ పరిధిలో 64 పోలీసుస్టేషన్లున్నాయి. నెల్లూరు నగరంలో ఆరు పోలీసుస్టేషన్లు, క్రైమ్ స్టేషన్ ఉంది. మునుపెన్నడూ లేనివిధంగా స్టేషన్ల పరిధిలో నిఘా వ్యవస్థ పెరిగింది. పగలు, రాత్రి అనే తేడాలేకుండా సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారు. వాహన తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు పాతనేరస్తులు, అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా పెంచారు. ప్రతిరోజూ రాత్రి ఆయా స్టేషన్ల పరిధిలో పాతనేరస్తులు, రౌడీషీటర్లను సిబ్బంది నేరుగా కలుసుకుని వారి వివరాలను ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి నేరస్తు ఆట కట్టిస్తున్నారు. అంతేకాకుండా అనేక చోరీ కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి పెద్దఎత్తున చోరీసొత్తును రాబడుతున్నారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేసి నేరాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే వరుసగా జరుగుతున్న చోరీలపై పోలీసుశాఖ ఇంకా అప్రమత్తం కావాలన్న సూచన సర్వత్రా వినిపిస్తోంది. సవాల్ విసురుతున్న చోరులు పోలీసు చర్యలతో నేరాలు తగ్గుముఖం పట్టాయి అనుకుంటుండగానే వరుస చోరీలతో దొంగలు పేట్రేగిపోతున్నారు. యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసరుతున్నారు. తాళం వేసిన ఇళ్లలో దొంగతనం చేయడమే కాదు.. ఇళ్లలో ఉన్నవారిని, రహదారులపై వెళుతున్న వారిని సైతం బెదిరించి దోపిడీలకు పాల్పడుతూ అందినకాడికి దోచేస్తున్నారు. ప్రయాణికుల ముసుగులో దొంగతనాలకు పాల్పడుతున్నారు. సహకారం తప్పనిసరి ఇళ్లు విడిచి ఊర్లకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఎల్‌హెచ్‌ఎంఎస్ (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్) సేవలను వినియోగించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఇళ్లలో విలువైన ఆభరణాలు, నగదు ఉంచరాదు. వాటిని బంధువుల వద్దనో బ్యాంకు లాకర్లలోనో భద్రపరచాలి. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక శక్తులు తారసపడితే వెంటనే సమీప పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించాలి. సెల్ఫోన్ల చోరీలు పెరిగాయ్ జిల్లాలో సెల్ఫోన్ల చోరీలు పెరిగాయి. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, సినిమా హాళ్లలో ఎవరైనా ఆదమరిచి ఉంటే చాలు.. చోరులు క్షణాల్లో వారి ఫోన్లను తస్కరించి మాయమవుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. దొంగలించిన ఫోన్లను ఇతర ప్రాంతాల్లో అమ్మివేయడమో లేక సిమ్ మార్చివేసి వినియోగించడమో చేస్తున్నారు. కొన్ని ఘటనలు.. ► ఈ ఏడాది మేలో సైదాపురంలో ఓ మహిళ కంట్లో కారంపొడి చల్లి 12 సవర్ల బంగారు నగలు దోచుకెళ్లారు. ► జూన్‌లో వెంకటాచలం అటవీ ప్రాంతంలో మధు అనే వ్యక్తిని కత్తులతో బెదిరించి రూ.18 వేలు నగదు దోచుకెళ్లారు. ► జూలైలో ఇందుకూరుపేట మండలం మైపాడులో ఓ ఇంట్లో దొంగలు పడి రూ.10 లక్షల నగదు, రూ.3 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు అపహరించుకుని వెళ్లారు. ► వెంకటాచలం మండలం కాకుటూరు శివాలయంలో దొంగలు పడి రూ 2.07 లక్షలు విలువచేసే సొత్తు అపహరించారు. ► నగరంలోని బాలాజీనగర్‌లో ఓ ఇంట్లో దొంగలు పడి 33 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ► నెల్లూరు రవీంద్రనగర్‌లోని ఓ ఇంట్లో దొంగలు పడి ఏడు సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ► ఇందుకూరుపేట మండలం కొత్తూరులో ఓ ఇంట్లో దొంగలు పడి ఎనిమిది సవర్ల బంగారు నగలు చోరీ చేశారు. ► కోవూరు శాంతినగర్‌లో ఓ ఇంట్లో దొంగలు పడి రూ.లక్ష నగదు, 10 సవర్ల బంగారు ఆభరణాలు దొంగతనం చేశారు. ► వేదాయపాళెం పోలీసుస్టేషన్ పరిధిలో రెండురోజుల్లో నాలుగుచోట్ల 32 సవర్ల బంగారు గొలుసులు అపహరించుకుపోయారు. ► జీజీహెచ్‌లో వైద్యం కోసం వచ్చిన ఓ వృద్ధురాలికి మత్తుమందు ఇచ్చి 8.5 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ► తాజాగా పొదలకూరు మండలం పార్లపల్లిలో భారతి అనే మహిళను చంపుతామని బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న ఏడుసవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. -
భార్య.. భర్త, ఓ స్నేహితుడు..
సాక్షి, కావలి (నెల్లూరు): భార్య..భర్త.. ఓ స్నేహితుడు దారి దోపిడీ దొంగలుగా మారి దోపిడీకి పాల్పడ్డారు. తమకు సన్నిహిత పరిచయం ఉన్న ఓ ఆర్ఎంపీ ని దోచుకున్న ఈ ముగ్గురి ముఠాను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కావలి డీఎస్పీ డి.ప్రసాద్ విలేకరుల సమావేశంలో వివరాలు వివరించారు. పట్టణంలోని వెంగళరావునగర్‌కు చెందిన కందుల రాజేష్, పర్వీన్ భార్యాభర్తలు. ఆ ప్రాంతంలో ఆర్ఎంపీగా ఉన్న తాళ్లపాళెం రాఘవేంద్రరావుతో పర్వీన్ పరిచయం ఏర్పడింది. సన్నిహితంగా ఉంటుండేది. ఆర్ఎంపీ ఒంటిపై ధరించిన బంగారు నగలపై పర్వీన్ కన్నుపడింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మనం గట్టెక్కడానికి ఆర్ఎంపీ ధరించిన బంగారాన్ని ఎలాగైనా కొట్టేయాలని ఆమె భర్తకు చెప్పింది. దీంతో దంపతులతో పాటు రామ్మూర్తిపేటలో నివాసం ఉండే వారి స్నేహితుడు కనమర్లపూడి సాయికుమార్‌తో కలిసి స్కెచ్ వేశారు. అందులో భాగంగా పర్వీన్ గత నెల 8న పట్టణంలో శుభకార్యానికి వెళ్లాల్సి ఉందని, తన భర్త అందుబాటులో లేడని రాఘవేంద్రరావుకు చెప్పింది. తనను బైక్‌పై శుభకార్యం వరకు తీసుకెళ్లి, మళ్లీ బైక్‌పైనే ఇంటికి తీసుకురావాలని పర్వీన్ కోరడంతో రాఘవేంద్రరావు ఆ రోజు రాత్రి 10–11 గంటల సమయంలో శుభకార్యం నుంచి తన బైక్‌పై పర్వీన్‌ను ఎక్కించుకొని వెంగళరావునగర్‌కు వస్తున్నాడు. మార్గమధ్యంలో కచేరిమిట్ట ప్రాంతంలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి బైక్‌ను అడ్డగించారు. ఆర్ఎంపీ పై దాడి చేసి చంపుతామని బెదిరించి అతని వద్ద ఉన్న బంగారు చైను, రెండు ఉంగరాలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు తాళ్లపాళెం రాఘవేంద్రరావు కావలి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ బీవీవీ సుబ్బారావు, ఎస్సైలు, సిబ్బంది లోతుగా విచారణ జరపడంతో భార్య, భర్త, వారి స్నేహితుడు దోపిడీకి పాల్పడ్డారని గుర్తించారు. నిందితులైన దంపతులు రాజేష్, పర్వీన్, సాయి కుమార్‌ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి దోపిడీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. లక్ష ఉంటుందని డీఎస్పీ చెప్పారు. -
తమ్ముడిని కడతేర్చిన అన్న
సాక్షి, ఆత్మకూరు (నెల్లూరు): ఇల్లు పంపకం విషయంలో సొంత అన్నదమ్ముల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు తమ్ముడి ప్రాణం తీసింది. ఈ ఘటన చేజర్ల మండలంలోని కాకివాయిలో ఆదివారం జరిగింది. స్థానికులు, చేజర్ల ఎస్సై ఎన్.కాంతికుమార్ సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన మస్తానయ్య, చినమస్తానయ్య ఇద్దరూ సోదరులు. వీరికి మరో చెల్లెలు ఉంది. కాలనీ ఇల్లు మంజూరు కావడంతో రెండేళ్ల క్రితం నిర్మించుకున్నారు. అప్పటికే ఓ ఇల్లు ఉండగా కాలనీ ఇల్లు చెల్లెలికి ఇవ్వాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే చిన మస్తానయ్య (40) ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. అయినా చెల్లెలుకు, తల్లికి తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఎలాంటి ఆదరువు లేని చెల్లెలకు కాలనీ ఇల్లు ఇద్దామని చెప్పినా ఒప్పుకోక పోవడంతో గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం మరోసారి అన్నదమ్ముల మధ్య ఇంటి విషయమై గొడవ జరిగింది. ఆవేశంలో అన్న మస్తానయ్య తమ్ముడు చినమస్తానయ్యను కర్రతో తలపై కొట్టడంతో తల పగిలి తీవ్రగాయమై అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. వెంటనే నెల్లూరులోని వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం ఆదివారం తెల్లవారు జామున చెన్నైకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న చేజర్ల ఎస్సై ఎన్ కాంతికుమార్ గ్రామానికి చేరుకుని విచారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. -
పసికందు మృతి.. గుట్టు చప్పుడు కాకుండా
సాక్షి, నెల్లూరు: ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. బాధిత తల్లిదండ్రులు అతని కోసం గాలిస్తుండగా తొట్టెలో (ప్లాస్టిక్ డ్రమ్) మృతదేహమై కనిపించాడు. దీంతో వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించగా వైద్యులు మృతిచెందాడని నిర్ధారించారు. మంగళ వారం మృతదేహాన్ని ఊరికి తీసుకెళ్లి పూడ్చిపెట్టేం దుకు యత్నించగా బంధువుల సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని సంతపేటకి చెందిన హుస్సేనీ అలియాస్ వైష్ణవికి నాలుగేళ్ల క్రితం వెంకటగిరి పట్టణం నాగులగుంటపాళేనికి చెందిన విజయకుమార్‌తో వివాహమైంది. విజయకుమార్ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి రేవంత్‌కుమార్ (14 నెలలు) కుమారుడు ఉన్నాడు. వినాయకచవితి సందర్భంగా సుమారు 15 రోజుల క్రితం హుస్సేనీ తన కుమారుడితో కలిసి నెల్లూరులోని పుట్టింటికి వచ్చింది. విజయకుమార్ ఈనెల రెండో తేదీన నెల్లూరుకు వచ్చాడు. అందరూ కలిసి పండగ చేసుకున్నారు. మంగళవారం హుస్సేనీ, విజయకుమార్‌లు వెంకటగిరికి వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి రేవంత్‌కుమార్ అదృశ్యమయ్యాడు. బాలుడు కనిపించకపోవడంతో బాధిత తల్లిదండ్రులు, బంధువులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల వెతికారు. ఈక్రమంలో ఇంటిపక్కనే ఉన్న నీటితొట్టె (ప్లాస్టిక్ డ్రమ్)లో బాలుడు తేలుతుండగా గుర్తించి వెంటనే కనికల హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. బాలుడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించడంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. బాధిత తల్లిదండ్రులు మంగళవారం తెల్లవారుజామున మృతదేహాన్ని వెంకటగిరి నాగులగుంటపల్లికి తీసుకెళ్లారు. అక్కడ పూడ్చిపెట్టేందుకు యత్నించగా రేవంత్‌కుమార్ మృతి అనుమానాస్పదంగా ఉందని బంధువులు డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వెంకటగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అంత్యక్రియలను అడ్డుకున్నారు. అనంతరం జరిగిన విషయాన్ని సంతపేట పోలీసులకు తెలియజేసి మృతదేహాన్ని నెల్లూరుకు పంపారు. సంతపేట ఎస్సై పి.వీరనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తొట్టిలో పడే అవకాశం తక్కువగా ఉండటం, మృతికి తల్లిదండ్రులు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటుండటంతో అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. బుధవారం ప్రభుత్వ వైద్యులు శవపరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై దుర్మరణం
సాక్షి, నెల్లూరు(ఆత్మకూరు) : ఏఎస్సై రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సమ్మెట వెంకటరాజు (56) ఏఎస్సైగా ఆత్మకూరు పోలీసుస్టేషన్లో పనిచేస్తున్నాడు. ఆయన కుటుంబం గూడూరులో ఉంటోంది. విధుల కోసం ఆత్మకూరులో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. గురువారం రాత్రి విధులు పూర్తి చేసుకున్నాడు. అనంతరం శుక్రవారం తెల్లవారుజామున ఐదుగంటల సమయంలో గూడూరుకు వెళ్లేందుకు నెల్లూరుపాళెం వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో పామూరుకు అద్దెకు వెళ్లి తిరిగి నెల్లూరుకు వెళుతున్న కారు డ్రైవర్ మోహన్‌రెడ్డి ఏఎస్సై రాజును ఎక్కించుకున్నాడు. కారు నెల్లూరు – ముంబై రహదారిపై వాశిలి గ్రామ సమీపంలో పంది అడ్డుగా రావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గుంతలో బోల్తా పడింది. ఏఎస్సై రాజు తలకు తీవ్ర గాయమై సీట్ల మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. నెల్లూరు టౌన్ మూలాపేట ఇరుకళలమ్మ కాలనీకి చెందిన కారు డ్రైవర్ మోహన్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. 108లో క్షతగాత్రుడిని తొలుత ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు అనంతరం నెల్లూరుకు తరలించారు. రెండునెలల క్రితమే పదోన్నతి మృతుడు ఏఎస్సై ప్రకాశం జిల్లా వాసి. ఆయనకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. కాగా ఇటీవల ఏఎస్సైగా పదోన్నతి పొందాడు. మరో రెండునెలల్లో ఎస్సైగా పదోన్నతి వస్తుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సీఐ పాపారావు, ఎస్సైలు సంతోష్‌కుమార్‌రెడ్డి, రోజాలత, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం రాజు మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
మత్తులో డ్రైవర్.. స్కూల్ బస్సు బోల్తా
సాక్షి, నెల్లూరు(డక్కిలి) : మండలంలో జరిగిన శ్రీచైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూల్ బస్సు ప్రమాదానికి డ్రైవర్ మద్యం మత్తే కారణమని పోలీసులు నిర్ధారించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వెంకటగిరి శ్రీచైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూల్‌కు చెందిన బస్సు ఉదయం 7.30 గంటలకు డక్కిలి మండలంలోని కమ్మపల్లి, మిట్టవడ్డిపల్లి, దేవునివెల్లంపల్లి, కుప్పాయిపాళెం గ్రామాలకు చెందిన విద్యార్థులను ఎక్కించుకుని డక్కిలి వైపు వస్తోంది. ఎనిమిది గంటల సమయంలో కుప్పాయిపాళెం దాటిన తర్వాత బస్సు అదుపుతప్పినట్లుగా విద్యార్థులు గుర్తించి కేకలు వేశారు. డ్రైవర్ నవకోటి మద్యం మత్తులో ఉండటం, నిద్రలోకి జారుకోవడంతో బస్సు చెరువు వద్ద గుంతలో బోల్తా పడింది. ఈ సంఘటనలో నర్రావుల వెంకటేష్ (6వ తరగతి), పోకూరు రోహిత్ (6వ తరగతి), వేముల నాని (6వ తరగతి), తంబిశెట్టి యామిని (5వ తరగతి), పెదనేని చంద్రిక (5వ తరగతి), కొక్కనేటి శ్రీనివాస్‌కుమార్ (9వ తరగతి), వేముల శరణ్య (4వ తరగతి), ఏలేశ్వరం మహేష్ (5వ తరగతి), పత్తిపాటి భానుప్రకాష్ (6వ తరగతి), ఎ.మోహన్ (9వ తరగతి), కుంచెం నిఖిలేస్ (3వ తరగతి), డ్రైవర్ నవకోటిలకు గాయలయ్యాయి. వీరిలో నిఖిలేష్, యామిని, మోహన్ తీవ్రంగా గాయపడ్డారు. సకాలంలో డక్కిలి పోలీసుల స్పందన స్కూల్ బస్సు బోల్తా పడిన విషయాన్ని తెలుసుకున్న డక్కిలి ఎస్సై కామినేని గోపి వెంటనే స్పందించి తన సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. భయాందోళనతో కేకలు వేస్తున్న విద్యార్థులను ఎస్సై, పోలీసు సిబ్బంది స్థానికులు సాయంతో బస్సులో నుంచి బయటకు తీశారు. పోలీసు వ్యాన్‌లో డక్కిలి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ విద్యార్థులకు డాక్టర్ సుధీర్‌కుమార్ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వెంకటగిరిలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. గూడూరు ఆర్డీఓ బాపిరెడ్డి, డక్కిలి తహసీల్దార్ మునిలక్ష్మి లు విద్యార్థులను పరామర్శించారు. వైద్యసేవల గురించి ఆరాతీశారు. తహసీల్దార్ కుప్పాయిపాళెం, డీ వడ్డిపల్లి గ్రామాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఓదార్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ వెంకటగిరి సీఐ అన్వర్‌బాషా ప్రమాదం గురించి తెలుసుకుని ఘటనా స్థలానికి వివరాలు ఆరాతీశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ స్కూల్ బస్సు డ్రైవర్ నవకోటి మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా తెలిపారు. ఈ విషయం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో వెల్లడైందన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.స్కూల్ బస్సు డ్రైవర్ నవకోటి మద్యం సేవించి బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అతను గురువారం రాత్రి వేటకు వెళ్లి రాత్రంతా నిద్రపోలేదు. శుక్రవారం ఉదయం నవకోటికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 49 శాతం ఆల్కాహాల్ ఉన్నట్లుగా చూపించింది. స్కూల్ నిర్వాహకులు తమ పిల్లలను తీసుకెళ్లే విషయంలో నిబంధనలు పాటించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కమ్మపల్లి, మిట్టవడ్డిపల్లి, దేవునివెల్లంపల్లి, కుప్పాయపాళెం, డక్కిలి, వెలికల్లు తదితర గ్రామాల నుంచి ప్రతిరోజూ 50 మందికి పైగా విద్యార్థులు బస్సులో వెళుతున్నారు. వాహనం కండీషన్లో లేదని వారు చెబుతున్నారు. క్లీనర్‌ను కూడా నియమించలేదని వాపోయారు. రాత్రంతా నిద్రపోలేదు స్కూల్ బస్సు డ్రైవర్ నవకోటి మద్యం సేవించి బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అతను గురువారం రాత్రి వేటకు వెళ్లి రాత్రంతా నిద్రపోలేదు. శుక్రవారం ఉదయం నవకోటికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 49 శాతం ఆల్కాహాల్ ఉన్నట్లుగా చూపించింది. స్కూల్ నిర్వాహకులు తమ పిల్లలను తీసుకెళ్లే విషయంలో నిబంధనలు పాటించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కమ్మపల్లి, మిట్టవడ్డిపల్లి, దేవునివెల్లంపల్లి, కుప్పాయపాళెం, డక్కిలి, వెలికల్లు తదితర గ్రామాల నుంచి ప్రతిరోజూ 50 మందికి పైగా విద్యార్థులు బస్సులో వెళుతున్నారు. వాహనం కండీషన్లో లేదని వారు చెబుతున్నారు. క్లీనర్‌ను కూడా నియమించలేదని వాపోయారు. డ్రైవర్ నిద్రలో ఉన్నాడు : విద్యార్థి కుప్పాయిపాళెం గ్రామం దాటగానే చెరువు వద్ద బస్సు పక్కకు వెళ్లి పోతుండటాన్ని గుర్తించి కేకలు వేశాం. అప్పటికే డ్రైవర్ నిద్రలో ఉన్నాడు. బస్సు అదుపుతప్పి గుంతలో పడిపోగానే మేము గాయపడ్డాం. కేకలు వేయగా చుట్టుపక్కల వారు, పోలీసులు వచ్చి కాపాడారు.