సాక్షి, నెల్లూరు : మితిమీరిన వేగంతో వస్తున్న ఓ కారు బైక్‌ను ఢీకొనడంతో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన నగరంలోని ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని బీవీనగర్‌కు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి జనార్దన్ (65), అయన బావమరిది నాగరాజు తమ కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా సంక్రాంతి పండగను జరుపుకున్నారు. ఇద్దరూ కలసి బైక్‌లో ఎన్టీఆర్ నగర్‌కు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరిగి జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో కావలి వైపు నుంచి మితిమీరిన వేగంతో వస్తున్న ఓ కారు వీరి బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై నుంచి జనార్దన్ రోడ్డుపై పడ్డాడు. కారు అతని కాలుపై ఎక్కి సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లి పోయింది. జనార్దన్ ఎడమకాలు మోకాలి వరకు తెగి రోడ్డుపై పడింది.
అతని తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజు రోడ్డుపై పడడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఐ.ఆంజనేయరెడ్డి, ఎస్సై శంకరరావు ఘటనా స్థలాన్నిపరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు. గురువారం జనార్దన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు మార్జిన్‌లోకి దూసుకెళ్లిన ప్రమాదానికి కారణమైన కారు
ఆత్మకూరు: అయ్యప్పస్వామి మకరజ్యోతి దర్శనానికి బైక్‌లో వెళ్తున్న ఇద్దరు యువకులను ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీకొనడంతో గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని మురగళ్లలో బుధవారం రాత్రి జరిగింది. బాధితులు, పోలీసుల సమాచారం మేరకు.. బండారుపల్లి గ్రామానికి చెందిన గడ్డం ప్రసాద్, వెంకటప్రతాప్ ఆత్మకూరు పట్టణంలోని కాశీనాయన ఆశ్రమంలో ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో మకరజ్యోతి దర్శనానికి బైక్‌లో నీటి పారుదల కాలువ కట్ట రోడ్డుపై బయలుదేరారు. మురగళ్ల సమీపంలో మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ వేగంగా ఎదురుగా వస్తూ వీరిని ఢీకొన్నాడు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ప్రసాద్, ప్రతాప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వీరి వెనకే వస్తున్న మరి కొందరు యువకులు గుర్తించి ఆటోలో ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. అయితే కారు డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న వారు ఆటోను అడ్డుకుని తమ కారుకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. యువకులు సర్దుబాటు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సైతం కారులోని వారికే మద్దతుగా వ్యవహరించారని బాధితులు వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment