
సాక్షి, నెల్లూరు(ఆత్మకూరు) : ఏఎస్సై రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సమ్మెట వెంకటరాజు (56) ఏఎస్సైగా ఆత్మకూరు పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్నాడు. ఆయన కుటుంబం గూడూరులో ఉంటోంది. విధుల కోసం ఆత్మకూరులో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. గురువారం రాత్రి విధులు పూర్తి చేసుకున్నాడు. అనంతరం శుక్రవారం తెల్లవారుజామున ఐదుగంటల సమయంలో గూడూరుకు వెళ్లేందుకు నెల్లూరుపాళెం వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో పామూరుకు అద్దెకు వెళ్లి తిరిగి నెల్లూరుకు వెళుతున్న కారు డ్రైవర్ మోహన్‌రెడ్డి ఏఎస్సై రాజును ఎక్కించుకున్నాడు. కారు నెల్లూరు – ముంబై రహదారిపై వాశిలి గ్రామ సమీపంలో పంది అడ్డుగా రావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గుంతలో బోల్తా పడింది. ఏఎస్సై రాజు తలకు తీవ్ర గాయమై సీట్ల మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. నెల్లూరు టౌన్ మూలాపేట ఇరుకళలమ్మ కాలనీకి చెందిన కారు డ్రైవర్ మోహన్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. 108లో క్షతగాత్రుడిని తొలుత ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు అనంతరం నెల్లూరుకు తరలించారు.
రెండునెలల క్రితమే పదోన్నతి
మృతుడు ఏఎస్సై ప్రకాశం జిల్లా వాసి. ఆయనకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. కాగా ఇటీవల ఏఎస్సైగా పదోన్నతి పొందాడు. మరో రెండునెలల్లో ఎస్సైగా పదోన్నతి వస్తుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సీఐ పాపారావు, ఎస్సైలు సంతోష్‌కుమార్‌రెడ్డి, రోజాలత, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం రాజు మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment