తీరని విషాదం..!  | Eight killed in road accidents | Sakshi
Sakshi News home page

తీరని విషాదం..! 

Published Sat, Feb 15 2020 4:06 AM | Last Updated on Sat, Feb 15 2020 5:03 AM

Eight killed in road accidents - Sakshi

మృతి చెందిన అను సెల్వియా, చిన్నారి రియంత్‌ షరీ, విజయలక్ష్మి, నమిత (ఫైల్‌)

రోడ్డు ప్రమాదం రూపంలో ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించింది. తల్లిదండ్రులు విమానం ఎక్కి..గమ్యస్థానంలో  దిగుతుండగానే కోడలు, మనవడు, కుమార్తె, మనవరాలి మరణవార్త వినాల్సి వచ్చింది. అయ్యో దేవుడా..! ఎంత ఘోరం జరిగిపోయెనే! అంటూ బంధువులు, సన్నిహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎయిర్‌పోర్టులో తమకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన తమ పిల్లలు తాము విమానం దిగేలోగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతారని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు.

తడ/ఆత్మకూరు:  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శుక్రవారం రహదారులు రక్తసిక్తమయ్యాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణంపాలయ్యారు. తడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒంగోలు క్లవ్‌పేటకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఒంగోలుకు చెందిన పందిటి యశ్వంత్‌ (35) తల్లిదండ్రులు అమెరికా వెళుతున్న సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి గురువారం చెన్నై వెళ్లారు. శుక్రవారం ఉదయం వారిని చెన్నై విమానాశ్రయంలో దింపిన యశ్వంత్‌ కారు నడుపుకుంటూ తిరుగు పయనమయ్యారు. కారు ఆంధ్రాలోకి ప్రవేశించిన అనంతరం తడ మండలం పన్నంగాడు వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న పాల లారీని వెనుక నుంచి ఢీకొంది. కారులో ఉన్న యశ్వంత్‌ భార్య అనుసెల్వి (27), కుమారుడు రియాంత్‌ షరి (ఏడాది బాబు), అక్క మాడుగుల విజయలక్ష్మి (37) అక్కడికక్కడే మృతి చెందారు. యశ్వంత్‌ తోపాటు అక్క కుమార్తెలు రితిక (12), నమిత (స్మైలీ) (14) తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మాడుగుల నమిత మృతి చెందగా మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతున్నారు.

ఆటోను ఢీకొన్న ఇన్నోవా.. నలుగురు మృతి 
ఆత్మకూరు మండలంలోని వాశిలి గ్రామ సమీపంలో నెల్లూరు–ముంబై హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆత్మకూరు నుంచి ఎనిమిది మంది ప్రయాణికులతో ఆటో వాశిలి గ్రామానికి చేరుకుంది. నెల్లూరు–ముంబై జాతీయ రహదారికి పక్కనే ఉన్న గ్రామంలో ప్రయాణికులు ఆటో దిగుతున్న క్రమంలో ఆత్మకూరు నుంచి అత్యంత వేగంగా నెల్లూరుకు వెళుతున్న ఇన్నోవా కారు వెనుకనే వస్తూ ఆటోను ఢీ కొంది. ఘటనలో తీవ్ర గాయాలపాలైన వారిని ఆత్మకూరులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతూ వాశిలికి చెందిన షేక్‌ మస్తాన్‌బీ (62), గురునాథం చిన్నమ్మ (70), నాగులూరు కోటమ్మ (70), అల్లంపాటి కొండారెడ్డి (71) మృతి చెందారు. ఘటనలో మస్తాన్‌బీ కుమారుడు ఫకీర్‌సా, కోడలు రమీజ, మనవరాళ్లు సన, సానియా గాయపడ్డారు. ఆటో డ్రైవర్‌ రసూల్, కోటయ్య, చంద్రశేఖర్, సుశీలమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఇన్నోవా వాహనంలోని ఆత్మకూరుకు చెందిన ఖాదర్‌బాషా, హరనాథరెడ్డి, నాయబ్‌రసూల్, ఎం.శ్రీనివాసులు గాయపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement