శ్రీహరి మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులు, (ఇన్‌సెట్‌లో) మృతదేహం
బాలాయపల్లి: ‘సెల్‌ఫోన్ మర్చిపోయా తీసుకువస్తా. ఇద్దం కలిసి భోజనం చేద్దాం. కాసేపు ఉండు’ అని భార్యకు చెప్పి వెళ్లిన యువకుడు గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అలిమిలికి చెందిన మేకల శ్రీహరి (20) కూలి పనులు చేస్తుంటాడు. సోమవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. భార్య హరితతో కలిసి భోజనం చేసేందుకు సిద్ధం కాగా తన సెల్‌ఫోన్‌ను గూడూరు రూరల్ మండలం గొల్లపల్లిలో ఓ దుకాణం వద్ద మర్చిపోయానని గుర్తించాడు. దీంతో సెల్‌ఫోన్ తీసుకువస్తానని, అప్పటి వరకు భోజనం చేయొద్దని భార్యకు చెప్పి వెళ్లాడు. తన సమీప బంధువు మన్నం మణిని తీసుకుని బైక్‌లో బయలుదేరాడు. ఈ క్రమంలో మండలంలోని అలిమిలి సమీపంలో ఉన్న జయంపు–ఓజిలి రోడ్డు మార్గంలోని అరుంధతీయవాడ వద్ద గుర్తుతెలి యని వాహనం వారిని ఢీకొంది.
దీంతో బైక్ నడుపుతున్న శ్రీహరి అక్కడికక్కడే మృతిచెందాడు. మణి ముళ్లపొదల్లో పడిపోయి తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. అర్ధరాత్రి అయినా భర్త ఇంటికి రాకపోవడంతో శ్రీహరి భార్య బంధువుల ఇంట్లో నిద్రించింది. మంగళవారం తెల్లవారుజామున అలిమిలి గ్రామస్తులు వ్యవసాయ పనుల నిమిత్తం వెళుతుండగా రోడ్డుపై పడిఉన్న శ్రీహరిని చూసి అతని అత్త రమణమ్మకు సమాచారం అందించారు. ఆమె కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుంది. మృతిచెందిన శ్రీహరిని చూసి బోరున విలపించారు. ముళ్లపొదల్లో ఉన్న మణిని చూసి హుటాహుటిన నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. బాలాయపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇలా జరిగిపోయిందా..
శ్రీహరి మృతితో అతని భార్య హరిత బావా లే.. అంటూ కన్నీరుమున్నీరైంది. గొల్లపల్లికి వెళ్లి ఫోన్ తీసుకువస్తా.. భోజనం చేద్దామని చెప్పావు. ఇంతలోనే ఇలా జరిగిపోయిందా అంటూ ఆమె ఏడవడంతో స్థానికులు కన్నీరు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment