ఆత్మకూర్(ఎస్) : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. జిల్లాలోని ఆత్మకూర్(ఎస్), మునగాల మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. ఆత్మకూర్(ఎస్) మండలం మద్దిరాలకు చెందిన ఆటో 12 మంది ప్రయాణికులతో సూర్యాపేట నుంచి మద్దిరాల వైపు వె ళుతోంది. ఈ క్రమంలో నూతనకల్లు నుంచి సూర్యాపేట వైపు అతివేగంగా వచ్చిన కారు ఎదురుగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటో రోడ్డు పక్క గుంటలో పడి నుజ్జునుజ్జయ్యింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నకిరేకల్ మండల చందుపట్లకు చెందిన ముచ్చపోతుల చిలకమ్మ(26) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందగా, అనంతుల మహేష్(20)ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.
కాగా గుడికందుల రాజేశ్వరి, తాడోజు మంజుల(గోరెంట్ల)ముచ్చపోతుల ఇందిర (యడవెళ్లి),పంతం వెంకన్న, బాల మైసయ్య(చిల్పకుంట్ల)ఏల్పుకొండ భవాని(సంగెం),రాయల సరోజ(రామచంద్రపురం)లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా అనంతుల మహేష్, ముచ్చపోతుల ఇందిర పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటనలో ఇరు వాహనాల డ్రైవర్లకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పరమేష్ తెలిపారు.
పండుగకు వస్తూ పరలోకాలకు
ప్రమాదంలో మృతిచెందిన ముచ్చపోతుల చిలకమ్మ ఏకాదశి పండుగకు తల్లిగారి ఊరైన నూతనకల్లు మండలం యడవెళ్లి గ్రామానికి వస్తోంది. వీరిది నకిరేకల్ మండలం చందుపట్ల కాగా బతుకుదెరువునిమిత్తం రెండు నెలల క్రితం హైదరాబాద్‌కు వెళ్లారు. ఈమెకు ఇద్దరు కుమారులు చరణ్, వరుణ్. చిన్న కుమారుడిని తల్లిగారింటి వద్ద ఉంచి వెళ్లగా ఏకాదశి పండుగకు యడవెళ్లి వస్తూ ప్రమాదంలో మృతిచెందింది.పెద్ద కుమారుడు చరణ్‌కు స్వల్పగాయాలయ్యాయి.
శుభకార్యానికి వస్తూ
తుంగతుర్తి మండలం సంగెం గ్రామానికి చెందిన ఏల్పుకొండ భవాని హైదరాబాద్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. ఇంటి వద్ద శుభకార్యానికి వస్తూ ఆటో ప్రమాదంలో చిక్కుకోవడంతో కాలు మూడు సార్లు విరిగినది.
స్వల్ప గాయాలతో బయటపడిన చిన్నారులు
ప్రమాదానికి గురైన ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఇదేఆటోలో ఉన్న ముచ్చపోతుల ఇందిర కుమార్తె (8నెలలు), మృతురాలు చిలక మ్మ కుమారుడు చరణ్ స్వల్పగాయాలతో బయటపడ్డారు.
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
Published Fri, Jul 15 2016 12:55 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement