అత్యాశపడ్డాడు.. అడ్డంగా చిక్కాడు | Auto Driver Caught Police Theft Nellore | Sakshi
Sakshi News home page

అత్యాశపడ్డాడు.. పోలీసులకు చిక్కాడు

Published Tue, Jun 18 2019 9:23 AM | Last Updated on Tue, Jun 18 2019 9:24 AM

Auto Driver Caught Police Theft Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు : అత్యాశకుపోయిన ఆటో డ్రైవర్‌ దొంగగా మారాడు. ప్రయాణికుల నగల బ్యాగ్‌ను తస్కరించాడు. చివరికి పోలీసులకు చిక్కి జైలు పాలైయ్యాడు. నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌హాలులో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. చిత్తూరు జిల్లా తిరుపతి నగరానికి చెందిన మొలగముడి రాఘవయ్య ఈనెల 15వ తేదీన తన కుటుంబసభ్యులతో కలిసి గంగపట్నం వెళ్లేందుకు తిరుపతి నుంచి ఆర్టీసీ బస్సులో బయలుదేరి నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చారు. వారు ఆటోలో ఆత్మకూరు బస్టాండ్‌కు బయలుదేరారు.

ఈక్రమంలో రాఘవయ్య తన వద్ద ఉన్న ఓ బ్యాగ్‌ను పదేపదే గమనిస్తుండటాన్ని ఆటో డ్రైవర్‌ చూశాడు. అందులో విలువైన వస్తువులు ఉంటాయని భావించాడు. ఆటోడ్రైవర్‌ దానిని తస్కరిస్తే జీవితంలో స్థిరపడవచ్చని భావించి అదనుకోసం వేచి చూడసాగాడు. రాఘవయ్య, అతని కుటుంబసభ్యులు ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద ఆటో దిగి బ్యాగ్‌ల తీసుకునేందుకు యత్నిస్తుండగానే డ్రైవర్‌ అక్కడి నుంచి ఆటోను వేగంగా తీసుకెళ్లిపోయాడు. ఊహించని ఈ పరిణామంతో ఖంగుతిన్న బాధితులు కొద్దిసేపటికి తేరుకుని జరిగిన ఘటనపై అదేరోజు రాత్రి నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపహరించిన బ్యాగ్‌లో 148 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాసరావు చోరీ ఘటనపై కేసు నమోదు చేశారు. అనంతరం జరిగిన విషయాన్ని నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు కేసు విచారణ చేపట్టారు. 

ఇలా పట్టుకున్నారు
బాధితులు చోరీ ఘటనను వెల్లడించడం మినహా ఆటోకు సంబంధించిన ఎలాంటి వివరాలు చెప్పలేకపోయారు. దీంతో ఇన్‌స్పెక్టర్‌ బాధితులు ఆటో ఎక్కిన సమయాన్ని తెలుసుకుని కమాండ్‌ కంట్రోల్‌లో సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. బాధితులు దిగిన ఆటోను అందులో గుర్తించారు. అయితే ఆటో, పోలీస్‌ నంబర్‌ సరిగ్గా కనిపించలేదు. దీంతో అనేక నంబర్లను పరిశీలించగా అందులోని ఓ నంబర్‌కు గతంలో పోలీసులు ఈ చలాన్‌ విధించడంతో దానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆటో డ్రైవర్‌ ఫొటో లభ్యమైంది. దానిని బాధితులకు చూపించగా అతనేనని గుర్తించారు. 

నిందితుడు కంటేపల్లి గ్రామ వాసి
ప్రయాణికుల నగల బ్యాగ్‌ను తస్కరించిన ఆటో డ్రైవర్‌ వెంకటాచల సత్రంలోని కంటేపల్లి గ్రామానికి చెందిన వి.శీనయ్యగా పోలీసు విచారణలో వెల్లడైంది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాసరావు, ఎస్సై నరేష్, సిబ్బందితో కలిసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం అతను కంటేపల్లి గ్రామ సమీపంలో ఉన్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు దాడిచేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారించగా నేరం చేసినట్టుగా అంగీకరించడంతో అరెస్ట్‌ చేశారు. రూ.3.78 లక్షలు విలువచేసే 148 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ వెల్లడించారు. ఆటో డ్రైవర్‌ అత్యాశే అతడిని దొంగగా మార్చి జైలు పాలుచేసిందని ఎస్పీ పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషిచేసిన నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాసరావు, ఎస్సై నరేష్, సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డులను అందజేశారు. సమావేశంలో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement