నెల్లూరులోని ఓ బంగారు దుకాణం వద్ద పోలీసులు, (ఇన్‌సెట్లో) నిందితుడు రంగా
నెల్లూరు(క్రైమ్): రైల్వే పోలీసుల కళ్లు గప్పి రిమాండ్ ఖైదీ పరారైన ఘటన బుధవారం అర్ధరాత్రి నెల్లూరులో జరిగింది. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా బంగారుపేట మండలం సనత్‌నగర్‌కు చెందిన రంగా అలియాస్ ఎలాంగో అలియాస్ రవి చిన్నతనం నుంచే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు రైళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల రేణిగుంట పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి నెల్లూరు రైల్వే కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించింది. అప్పటి నుంచి నిందితుడు నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ అనుభవిస్తున్నారు. నిందితుడిపై తమిళనాడు రాష్ట్రం జోలార్‌పేటై రైల్వేపోలీసుస్టేషన్ పరిధిలో కేసులు ఉన్నాయి. నిందితుడిని తిరువత్తూరు జేఎఫ్‌సీఎం(111) కోర్టులో హాజరు పరిచేందుకు జోలార్‌పేటై రైల్వే సీఐ ఎస్.శివాహమిరమి తన సిబ్బందితో కలిసి బుధవారం నెల్లూరుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారం నుంచి పీటీ వారెంట్‌పై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
బంగారు వ్యాపారిని తరలించే యత్నం.. అడ్డుకున్న సహచర వ్యాపారులు
రంగాను రైల్వేపోలీసులు ఓ దొంగతనం కేసుకు సంబంధించి విచారించగా చిన్నబజారులోని ఓ బంగారు దుకాణంలో చోరీ సొత్తును విక్రయించాడని వెల్లడించారు. దీంతో పోలీసులు నిందితుడిని వెంట బెట్టుకుని సదరు బంగారు దుకాణం వద్దకు వెళ్లి దుకాణ యజమానిని విచారించారు. అతను తన వద్ద అమ్మలేదని చెప్పడంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా సహచర వ్యాపారులు పోలీసులను అడ్డుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న సంతపేట ఎస్సై సుభాన్ ఘటన స్థలానికి చేరుకుని రైల్వేపోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అందరూ కలిసి సంతపేట పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. అక్కడ నిందితుడు చెప్పిన వివరాల మేరకే వ్యాపారిని అదుపులోకి తీసుకుంటున్నామని తమిళనాడు పోలీసులు సంతపేట పోలీసులకు తెలిపారు. అయితే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపకపోవడంతో అవి తీసుకు వచ్చి వ్యాపారిని తీసుకెళ్లాలని పోలీసులు చెప్పడంతో వారు వెనుదిరిగినట్లు సమాచారం.
ప్యాసింజర్‌లో తరలిస్తుండగా కళ్లుగప్పి
బుధవారం రాత్రి నెల్లూరు రైల్వేస్టేషన్ నుంచి కాకినాడ తిరుపతి ప్యాసింజర్‌లో తిరుపతికి బయలుదేరారు. రైలు సిగ్నల్ కోసం కొమ్మరపూడి సమీపంలో ఆగగా నిందితుడు మరుగుదొడ్డికి వెళ్లాలని చెప్పడంతో వారు అతన్ని బాత్‌రూమ్‌వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు వారిని తోసేసి రైల్లోంచి దూకి పరారయ్యాడు. ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న రైల్వే సిబ్బంది, సీఐ హుటావుటిన రైల్లో నుంచి దిగి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ ప్రాంతమంతా చీకటిగా ఉండటంతో అప్పటికే నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ మేరకు సీఐ నెల్లూరు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఎస్‌డీ సిరాజుద్దీన్ కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment