స్వాధీనం చేసుకున్న ఆభరణాలు, నగదు
సాక్షి, నెల్లూరు: అప్పన్న బంగారం పేరిట మహిళను మోసగించిన ఘటనలో ప్రధాన నిందితురాలు కె.హైమావతి పోలీసు కస్టడీ సోమవారంతో ముగిసింది. పోలీసులు ఆమె వద్ద నుంచి రూ.30 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ షేక్ బాజీజాన్‌సైదా కేసు పూర్వాపరాలను వెల్లడించారు. విశాఖపట్నం పెందుర్తి ప్రాంతానికి చెందిన కె.హైమావతి అలియాస్ డెక్క హైమావతి సింహాచలంలో అల్లిక దారాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. సూళ్లూరుపేటకు చెందిన ఎం.శ్రావణితో పరిచయం ఏర్పడింది. ఆలయంలో బంగారం వేలం వేస్తున్నారంటూ మాయమాటలు చెప్పి హైమావతి ఆమెను నమ్మించి రూ. 38 లక్షలు ఖాతాలో జమ చేయించుకుంది. శ్రావణి బిల్లులు కోరగా నిందితురాలు సింహాచలం ఆలయ ఈవో ఫోర్జరీ సంతకాలతో బిల్లులను పంపింది.
నగదు తీసుకున్న నిందితురాలు బంగారం ఇవ్వకుండా ఆమెను మోసగించడంతో బాధితురాలు సూళ్లూరుపేట పోలీసులకు, సింహాచలం ఆలయ అధికారులకు ఈ–మెయిల్ ద్వారానూ ఫిర్యాదు చేసింది. మెయిల్‌లో పంపిన బిల్లులు నకిలీవని ఆలయ అధికారులు గుర్తించి గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విచారించిన పోలీసులు నిందితురాలితో పాటు మరో ఇద్దరిని ఇటీవల అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నిందితురాలు విశాఖపట్నం జైలులో ఉంది.
నగదు స్వాధీనం : పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. హైమావతిని పిటీ వారెంట్‌పై నెల్లూరుకు తీసుకువచ్చారు. సూళ్లూరుపేట కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు రిమాండ్ విధించడంతో జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. ఆమె వద్ద నుంచి రూ.11.35 లక్షల నగదు, 280 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం ఆమెను కోర్టులో హాజరుపరిచినట్లు ఇన్‌స్పెక్టర్ బాజీజాన్‌సైదా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment