
రైళ్ల సంఖ్య గణనీయంగా పెరిగాయి. వాటిల్లో నేరాలు సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రయాణికుల భద్రత కొరవడుతోంది. రైల్వే ప్రయాణికుల భద్రతను పర్యవేక్షించేందుకు నియమించిన జీఆర్పీ (రైల్వే జనరల్ పోలీస్) వ్యవస్థను కొన్ని దశాబ్దాలుగా పటిష్టం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఉన్న అరకొర సిబ్బందితో కేసుల దర్యాప్తులో పురోగతి లేకుండా పోతోంది. రైల్వే ట్రాక్‌పై జరిగే ఆత్మహత్యలు, హత్యల కేసుల పరిస్థితే ఇందుకు అద్దం పడుతోంది. ఇక రైళ్లల్లో జరిగే చోరీలకు సంబంధించి రికవరీలకు నోచుకోవడం లేదు. మొత్తంగా చెప్పాలంటే కేసులకు పరిష్కారం దొరకడం లేదు.
నెల్లూరు(క్రైమ్): రైళ్లలో దోపిడీలు, దొంగతనాలు నిత్యకృత్యంగా మారుతోన్నాయి. రైలు పట్టాలపై మృతులు పెరుగుతున్నారు. రైల్వే గణాంకాల ప్రకారం నెలకు 40 నుంచి 50కు పైగా కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 25 శాతం కేసులు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇక అనధికార (నమోదు కాని) కేసులు ఇంతకు రెండింతలపైనే ఉన్నట్లు సమాచారం. సిబ్బంది కొరత కారణంగానే కేసులు పరిష్కారం కావడం లేదన్నది అధికారుల మాట. నెల్లూరు జిల్లా పరిధిలో కావలి, బిట్రగుంట, నెల్లూరు, కృష్ణపట్నం పోర్టు, గూడూరు, సూళ్లూరుపేటల్లో రైల్వే పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. ఇవన్ని నెల్లూరు రైల్వే డీఎస్పీ పరిధిలో పని చేస్తున్నాయి. రైల్వేలో రోజు రోజుకు నేరాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా దోపిడీలు, దొంగతనాలు అధికమయ్యాయి. వీటితో పాటు రైల్వేట్రాక్‌లపై మృతదేహాలు తరచూ పడుతున్నాయి. కొందరు ప్రమాదాల్లో మరణిస్తుండగా మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైల్వే పోలీసులు ఏళ్ల తరబడి పట్టించుకోరన్న విషయం తెలుసుకున్న క్రిమినల్స్ హత్యలు చేసి ఈజీగా తప్పించుకునేందుకు మృతదేహాలను రైలు పట్టాలపై వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఏడాది వేసవిలో, పండగ వేళల్లో రైలు ప్రయాణాలు అధికంగా ఉంటున్నాయి. దొంగలు ప్రత్యేక ప్రణాళికతో విజృంభిస్తున్నారు. వీటితో పాటు గంజాయి, బంగారం, ఎర్రచందనం, గుట్కా, రేషన్, ఉప్పుడు బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.
బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు అంతే సిబ్బంది
బ్రిటిష్ హయాంలో నెల్లూరు జిల్లా మీదుగా 12 ఎక్స్‌ప్రెస్‌లు, రెండు ప్యాసింజర్ రైళ్లు వెళ్లేవి. ప్రస్తుతం సుమారు 90కు పైగా ఎక్స్‌ప్రెస్‌లు, 16 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. అప్పటి రైళ్లు, నేరాల ఆధారంగా పోలీస్‌స్టేషన్‌కు ఒక ఎస్సై, ముగ్గురు హెడ్‌కానిస్టేబుల్స్, 20 మంది కానిస్టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. నేడు రైళ్ల సంఖ్య, నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో రైళల్లో బ్యాగ్‌లు, గొలుసు, జేబు దొంగతనాలు జరిగేవి. ప్రమాదవశాత్తు రైళ్లలోంచి జారిపడడం, పట్టాలు దాటుతూ మృత్యువాతపడడం, ఆత్మహత్యలు ఉండేవి. నేటి పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. నేరగాళ్లు కొత్త పం«థాల్లో నేరాలకు తెగబడుతున్నారు. దోపిడీలు, దొంగతనాలు, మత్తు మందులిచ్చి నగలు, నగదు అపహరణ, సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి దోపిడీలకు పాల్పడడం, దాడులు, హత్యలు, మిస్సింగ్ కేసులు అధికం అయ్యాయి. సిబ్బంది విధుల్లోనే మార్పులు వచ్చాయి. నేర నియంత్రణతో పాటు ఎస్కార్ట్‌లు, కోర్టు విధులు, మార్చురీ విధులు, రాత్రి, పగటి గస్తీలు నిర్వహించాల్సి వస్తోంది. అయితే నాటి సిబ్బంది సంఖ్యే నేటికి కొనసాగుతోంది. అందులోనూ కొన్ని ఖాళీలు ఉండటంతో ఉన్న సిబ్బందిపైనే పని భారం పడుతోంది. నేరాల నియంత్రణ, కేసుల పరిష్కారం తలకు మించిన భారంగా మారుతోంది. వీటిని అధిగమించాలంటే సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది.
ఖాళీల పోస్టుల భర్తీ ఇలా
జీఆర్పీ నియమకాలు గతంలో కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేవి. 1982 అనంతరం ఈ విధానం మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన సివిల్ పోలీసులనే డిప్యుటేషన్‌పై రైల్వేకు పంపుతారు. ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానాలతో పాటు డిప్యుటేషన్ ముగిసి తిరిగి సొంతగూటికి వెళ్లిన వారి స్థానంలో ఖాళీలను భర్తీ చేయాలంటే సివిల్ నుంచి పోలీసులను రైల్వేకు పంపాల్సి ఉంది. అయితే సివిల్ పోలీసు అధికారులు సకాలంలో సిబ్బందిని ఇవ్వకపోవడంతో సిబ్బంది కొరత ఉంటుంది.
సిబ్బంది కేటాయింపు.. పెంపు కలేనా
పెరిగిన పరిస్థితులకు అనుగుణంగా ప్రతి పోలీసుస్టేషన్‌లో సిబ్బంది సంఖ్యను పెంచడమే కాకుండా ఖాళీలను వెంటనే భర్తీ చేయాల్సి ఉంది. పలు దఫాలు పాలకులు, అధికారులు చర్యలు చేపడుతామన్న ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో సిబ్బంది కేటాయింపు.. పెంపు కలే అని తెలుస్తోంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి పెరిగిన పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందని రైల్వే సిబ్బంది కోరుతున్నారు.
ఏళ్ల తరబడి నియామకాల్లేవు
ఇప్పటి వరకు జిల్లా పరిధిలోని రైల్వే స్టేషన్‌ల్లో సిబ్బంది కొరత వెంటాడుతోంది. నెల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో డీఎస్పీ, సీఐతో పాటు ముగ్గురు ఎస్సైలు, ముగ్గురు హెడ్‌కానిస్టేబుల్స్, 20 మంది కానిస్టేబుల్స్ ఉండాల్సి ఉంది. అయితే అందులో ఇద్దరు ఎస్సైలు లేరు. కావలిలో ఒక ఎస్సై, ముగ్గురు హెడ్‌కానిస్టేబుల్స్, 20 మంది కానిస్టేబుల్స్ ఉండాల్సి ఉండగా 3 కానిస్టేబుల్స్ లేరు. గూడూరులో ఒక ఎస్సై, ముగ్గురు హెడ్‌కానిస్టేబుల్స్, 20 మంది కానిస్టేబుల్స్ ఉండాల్సి ఉండగా ముగ్గురు హెడ్‌కానిస్టేబుల్స్, ఇద్దరు కానిస్టేబుల్స్ లేరు. సూళ్లూరుపేటలో ఒక ఎస్సై, ఒక హెడ్‌కానిస్టేబుల్స్, 8 మంది కానిస్టేబుల్స్ ఉండాల్సి ఉండగా ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ లేరు. బిట్రగుంట, కృష్ణపట్నం పోర్టు స్టేషన్‌ల్లో ఒక హెడ్‌కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుల్స్ ఉండాల్సి ఉండగా రెండు పోలీసుస్టేషన్లలో హెడ్‌కానిస్టేబుల్స్ లేరు. దీన్ని బట్టి చూస్తే సిబ్బంది కొరత వెంటాడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment