జిల్లా కేంద్రం నెల్లూరు నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఉపాధి, విద్య, ఉద్యోగ నిమిత్తం పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రాంత వాసులు నగరానికి తరలివస్తున్నారు. జనాభా రోజు రోజుకు పెరుగుతోంది. నగర పోలీస్‌స్టేషన్ల పరిధులు పెరిగాయి. నేరాల సంఖ్యా పెరుగుతోంది. అయితే సిబ్బంది సంఖ్య తగిన స్థాయిలో లేదు. దీంతో భద్రత.. అంతంత మాత్రంగా మారింది. ఉన్న వారిపైనే పనిభారం పడింది. కేసుల దర్యాప్తుల్లో పురోగతి కొరవడుతోంది. జనాభాకు అనుగుణంగా సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది.
నెల్లూరు(క్రైమ్): 2011 జనాభా లెక్కల ప్రకారం నెల్లూరు నగర జనాభా 6.01 లక్షలు ఉండగా ప్రస్తుతం సుమారు 8 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో జనాభా సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నగరంలో ఆరు పోలీసుస్టేషన్లు ఉన్నాయి. గత జనాభాకు అనుగుణంగా స్టేషన్ల పరిధులు ఉండేవి. ఇటీవల స్టేషన్ల పరిధులను సైతం పెంచారు. దీంతో నేరాల సంఖ్య పెరుగుతోంది. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, కొట్లాటలు నిత్యకృత్యంగా మారాయి. 2016లో రూ.3 కోట్ల ప్రజల ఆస్తులను దొంగలు కొల్లగొట్టగా 2017లో రూ.2.59 కోట్లు, ఈ ఏడాది రూ.4.91 కోట్ల సొత్తును దొంగలు దోచుకెళ్లారు.
నామమాత్రంగానే సిబ్బంది
పోలీసుస్టేషన్ల పరిధి, జనాభా పెరిగినా ఏళ్ల తరబడి సిబ్బంది పెంపు జరగలేదు. ఆరు పోలీసుస్టేషన్లలో 433 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం 272 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో కొందరు డిప్యుటేషన్లపై వేరే చోట పనిచేస్తున్నారు. 161 ఖాళీలు ఉన్నాయి. కొన్నేళ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం రెట్టింపు అవుతోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే కానిస్టేబుల్ పోస్టులు 104 ఖాళీగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. నగరంలో సుమారు 8 లక్షల మంది జనాభా ఉన్నారు. నగరంలో సిబ్బందిని లెక్కిస్తే 1,847 మందికి ఓ పోలీసు లెక్కన ఉన్నారు. స్టేషన్ విధులు, బందోబస్తులు, నేరనియంత్రణ. కోర్టు డ్యూటీ, ప్రమాదాల నివారణ తదితరాలు సిబ్బందికి తలకు మించిన భారంలా మారుతోంది.
పెరుగుతున్న నేరాలు..అపరిష్కృతంగా కేసులు
ఇటీవల నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, దొంగతనాలు వంటివి నిత్యకృత్యమయ్యాయి. రోజు రోజుకు స్టేషన్లలో కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే సిబ్బంది కొరతతో కేసుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో మూడు సెక్షన్లు ఉండేవి. ప్రస్తుతం రెండు సెక్షన్లకు మార్చారు. దీంతో సిబ్బందిపై ఒత్తిడి పెరిగింది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నగరంలో ఆరు పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో సీఐ, నలుగురు ఎస్సైలు, 8 మంది ఏఎస్సైలు, 15 మంది హెడ్‌కానిస్టేబుల్స్, 104 మంది కానిస్టేబుల్స్ ఖాళీలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment